పేదల భూములపై పచ్చ గద్దలు

పేదల భూములపై పచ్చ గద్దలు - Sakshi


పెదగంజాంలో టెక్స్‌టైల్స్ పార్కుకు ప్రభుత్వ ప్రకటన

రాజధాని తరహాలో భూ దందాకి దిగిన టీడీపీ నేతలు

దశాబ్దాల క్రితం రైతులకు ఇచ్చిన భూములు లాక్కునే వ్యూహం

అప్పనంగా రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం

సహకరించకపోతే ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులు

అధికార పార్టీ నేతలకు రెవెన్యూ అధికారుల వత్తాసు

భూములిచ్చేది లేదంటున్న రైతులు, కూలీలు

జీవనాధారం కోల్పోరుు రోడ్డున పడతామంటూ ఆవేదన


జిల్లాలోని అధికార పార్టీ నేతలు రాజధాని తరహాలో భూ దందాకు తెరతీశారు. విలువైన పేదల భూములను అప్పనంగా కొట్టేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ పరిధిలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలోని భూములు అప్పగించాలంటూ స్థానిక నేతలు అక్కడి రైతులను బెదిరిస్తున్నారు. భూములిస్తే అంతో ఇంతో ముట్టజెబుతామని లేకపోతే బలవంతంగా లాక్కుంటామని హెచ్చరిస్తున్నారు. రైతుల దగ్గర భూములు గుంజుకొని వాటినే టెక్స్‌టైల్స్ పార్కుకు అప్పగించి కోట్లు కొట్టేసేందుకు స్థానిక పచ్చ నేత సమీప బంధువు వ్యూహం రచించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులు, రైతు కూలీలు ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు.


సాక్షి ప్రతినిధి, ఒంగోలు ; ప్రభుత్వం పెదగంజాం ప్రాంతంలో మెగా టైక్స్‌టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పార్కు నిర్మాణం ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నట్లు చెప్పింది. ఇందుకోసం 530 ఎకరాలకుపైగా భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఇదే అదునుగా నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యనేత సమీప బంధువు ఆ భూములు కొట్టేసి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెదగంజాం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1160, 1161లలో వందలాది ఎకరాలు భూమి ఉందని, ఆ భూములలో మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. పార్కు నిర్మాణం కోసం అదే భూములను ఎంపిక చేయాలంటూ స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


 అధికారుల ద్వారా బెదిరింపులు..

రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్న సామెతగా రెవెన్యూ అధికారులు పెదగంజాం భూములను సేకరించేందుకు రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులు భూములివ్వమని తేల్చి చెప్పారు. దీంతో అధికార పార్టీ ముఖ్యనేత సమీప బంధువు రైతులపైఒత్తిడి తెచ్చారు. గతంలో ప్రభుత్వం ఆ భూములను డికెటిలుగా ఇచ్చిందని, వాటిని అప్పగించకపోతే పైసా ఇవ్వకుండా లాక్కుంటామని బెదిరింపులకు దిగారు. స్వచ్ఛందంగా భూములు అప్పగిస్తే అంతో.. ఇంతో ముట్టజెబుతామని సానుభూతి మాటలు చెప్పారు. ఇదే విషయాన్ని అధికారుల ద్వారా చెప్పించారు. దీంతో అధికారులు కూడా రైతులను బెదిరిస్తున్నారు. అప్పనంగా భూములు కొట్టేసి వాటిని రైతులతో రాయించుకొని, తర్వాత అదే భూములను టెక్స్‌టైల్ పార్కుకు అప్పగించి కోట్లలో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతులను బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.


 గతంలో భూములిచ్చిన ప్రభుత్వం..

పెదగంజాం పంచాయతీ పరిధిలోని 1969 ప్రాంతంలో అమీన్‌నగర్ అనే గ్రామం ఉండేది. 150కిపైగా కుటుంబాలు అక్కడ నివసించేవారు. రొంపేరు కాలువకు దక్షిణం వైపున ఉన్న ఈ గ్రామం తరచూ వరదలకు గురయ్యేది. తీవ్ర తుపాను ప్రభావంతో 1970 ప్రాంతంలో ఏకంగా ఊరు మునిగిపోయింది. దీంతో గ్రామస్తులు ఆ ఊరు వదిలి కాలువ ఉత్తరం వైపు వలస వచ్చారు. 1972 ప్రాంతంలో బాధితులకు పాత అమీన్‌నగర్ ఉన్న ప్రాంతంలో సర్వే నెం.1160, 1161లో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున దాదాపు 500 కుటుంబాలకు 530 ఎకరాలు భూములిచ్చారు. ప్రస్తుతం ఆ భూముల్లో రైతులు ఉప్పు సాగుతో పాటు, రొయ్యల చెరువులను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు.


కొందరు చేపల వేట సాగిస్తూ పొట్టపోసుకుంటున్నారు. ఇక్కడ రైతులతో పాటు పెదగంజాం పంచాయతీ పరిధిలోని పెదగంజాం, పల్లెపాలెం, బుచ్చిగుంట. కోడూరివారిపాలెం, కాటం వారిపాలెం, ఏటిమొగ, ఆవలదొడ్డిగొల్లపాలెం తదితర గ్రామాలకు చెందిన 8 వేల మందికిపైగా రైతులు, రైతు కూలీలకు ఆ భూములే జీవనాధారం. ఇప్పుడు ప్రభుత్వం  భూములను లాగేసుకుంటే అందరూ రోడ్డున పడాల్సి వస్తోంది.  మరో చోట నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో టైక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసుకోవాలని రైతులతో పాటు వేలాది కూలీలు విన్నవిస్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేసుకొని ఆ భూములపై గద్దల్లా వాలారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top