అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి కొమ్ముగాస్తున్నారు

అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి కొమ్ముగాస్తున్నారు - Sakshi


► సీఎం చంద్రబాబుపై సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ధ్వజం



ఒంగోలు టౌన్‌ : అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముగాస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ధ్వజమెత్తారు. ఒక పథకం ప్రకారం కేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. మంగళవారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో జరిగిన అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాట సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన కేసు పరిష్కారంలో తీవ్ర జాప్యం జరగడం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కారణంగా అనేకమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.



అగ్రిగోల్డ్‌ బాధితుల విషయంలో చంద్రబాబు మాటలు కోటలు దాటతాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని వ్యాఖ్యానించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు సీపీఎం అండగా ఉండి పోరాడుతుందన్నారు. బాధితుల సంఘ రాష్ట్ర కన్వీనర్‌ వీ మోజస్‌ మాట్లాడుతూ మార్చి నెలలో బాధితులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదన్నారు. వంద రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి క్యాబినెట్‌ మీటింగ్‌లో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటిస్తూ బాధితులను నయవంచనకు గురిచేస్తున్నారని విమర్శించారు.



అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకుండా మాటలతో కాలయాపన చేయాలని చూస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో పోరాట సంఘ నాయకులు అద్దంకి కోటేశ్వరరావు, ఏ నర్సయ్య, కే వెంకట్రావు, ఎన్‌వీ శ్రీను, కే ప్రసాద్, ఐ.శివ, సత్యనారాయణ, ఉమాకుమారి, సుబ్బలక్ష్మి, విశాలాక్షి, ఎన్‌.లక్ష్మి, శోభాదేవి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top