అది జలం కాదు.. గరళం!

అది జలం కాదు.. గరళం!

జిల్లాలో 1375 బావుల్లో నీరు ప్రాణాంతకం

అందులోని నీటిని తాగొద్దని అధికారుల హెచ్చరిక

వాటికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయని వైనం

 

 

విజయనగరం కంటోన్మెంట్‌: జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న వనరులే చాలవనుకుంటే... అందులో నీరు స్వచ్ఛత లేక తాగేందుకు పనికి రానివిగా తయారవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1375 బావుల్లో నీరు ప్రజలు తాగేందుకు పనికిరావని... అందులో ఉండాల్సిన ఖనిజ లవణాల శాతం వల్ల తాగేందుకు పనికి రాదని తేల్చారు. కానీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదు. జిల్లాలోని తాగునీటి వనరుల నుంచి వస్తున్న నీటిని గ్రామీణ నీటిపారుదల శాఖ పరీక్ష విభాగం ఆధ్వర్యంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని బావులు, బోరు బావుల నీటిని పరీక్షించగా బోర్ల నీరు బాగానే ఉన్నట్టు నివేదికల ఆధారంగా గుర్తించిన అధికారులు బావులు మాత్రం చాలా వరకూ తాగేందుకు పనికిరావని తేల్చారు. వెంటనే సంబంధిత ఎంపీడీఓలకు ఆ వివరాలను అందించారు. గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య శాఖలోని విభాగమైన ప్రయోగ శాలల ద్వారా డివిజన్ల వారీగా తాగునీటిని పరీక్షిస్తున్నారు. ఇందుకోసం ఆయా ల్యాబ్‌లకు హైదరాబాద్‌ తదితర ప్రాంతాలనుంచి వచ్చే  కెమికల్స్‌తో నీటిని పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల్లో జిల్లాలో అత్యధిక సంఖ్యలోని బావుల్లోగల తాగునీటిని తాగొద్దనే సంకేతాలను ఇచ్చారు. దీంతో ఇప్పుడా బావులలోని తాగునీటిని తాగొద్దంటూ అధికారులు ఆయా బావులపై ఎర్రక్షరాలతో సూచనలు చేస్తున్నారు. 

 

 

అదనపు నీటి వనరులేవీ? 

జిల్లాలోని 1375 తాగునీటి బావులు తాగేందుకు పనికి రావని గుర్తించిన అధికారులు ఇందులో 175 బావులు ఏజెన్సీలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. అంటే మిగతావన్నీ మైదాన ప్రాంతాల్లోనివేనని చెప్పవచ్చు. వాస్తవానికి ఏజెన్సీలో తాగునీటి బావులు, బోరు బావులు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న బావులు తాగేందుకు వినియోగించకూడదని చెప్పినపుడు కొత్తగా తాగునీటి వనరులను ఏర్పాటు చేయాలి. కానీ ఆ స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో గిరిజనులకు తాగునీటి అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో క్రాష్‌ ప్రోగ్రాం ద్వారా తాగునీటి వనరులకు మరమ్మతులు అరకొరగా చేపడుతున్నారే తప్ప అదనపు వనరులు మాత్రం కల్పించడం లేదు. 

 

 

ప్రమాదకర బావుల వివరాలు పంపించాం: ఎన్‌.వి.రమణమూర్తి, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

జిల్లాలోని తాగునీటి బావుల్లో నీటిని పరీక్షించి తాగేందుకు పనికి రావని గుర్తించిన బావుల వివరాలను ఎంపీడీఓలకు పంపించాం. ఆయా నంబర్ల వారీగా వారు వాటిని తాగకూడదని బావుల వద్ద సూచనలు రాయాలి. అదేవిధంగా చేస్తున్నారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top