విద్యుత్‌శాఖలో..రాజకీయ బదిలీలు

విద్యుత్‌శాఖలో..రాజకీయ బదిలీలు - Sakshi


► ఏళ్లతరబడి ఉన్నవారికి  స్థాన చలనమేదీ



కడప అగ్రికల్చర్‌: గడచిన శనివారం విద్యుత్‌ శాఖలో జరిగిన బదిలీల్లో రాజకీయ రంగు పులుముకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టారని కొన్ని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.   ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి స్థాన చలనం కలగకపోవడం గమనార్హం. ఇక్కడ విచిత్రమేమంటే కొందరికి బదిలీలు చేపట్టినప్పటికీ వారు కూడా జిల్లా కాదు కదా... కడప నగర పరిధిని దాటిపోకపోవడం విడ్డూరం. ఈ బదిలీల్లో అధికార నేతల పెత్తనం అధికంగా సాగిందనే చెప్పవచ్చు.



జిల్లాలోని విద్యుత్‌శాఖలో ఏఈలు 27మంది, సబ్‌ఇంజనీర్లు 25 మంది, సహాయ అకౌంటు ఆఫీసర్లు 10 మంది, సీనియర్‌ అసిస్టెంట్లు 30 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 47 మంది, టైపిస్టులు ముగ్గురు, నాలుగో తరగతి ఉద్యోగులు 15 మంది బదిలీలు కోరుకున్న వారి జాబితాలో ఉన్నారు. వీరందరికి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు బదిలీల ప్రక్రియను ఎస్‌ఈతో కూడిన కమిటీ చేపట్టి జాబితాను విడుదల చేసింది. అయితే బదిలీల్లో  నిబంధనలు పాటించలేదని కొందరు అధికారులు ఆరోపించారు. కడప నగరంలో ట్రాన్స్‌ఫార్మర్ల విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి, మరో ఇద్దరు ఏఈలు ఏళ్ల తరబడి ఒకేచోట, ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నా దూరప్రాంతాలకు బదిలీ చేయకుండా ఇక్కడే ఉండేటట్లు చేశారంటే రాజకీయం ఎంతగా పనిచేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ఓ యూనియన్‌ నేత సాక్షికి తెలిపారు.



మంత్రి అనుచరులుగా ఉన్నవారు, పెద్దల సభకు చెందిన అధికార పార్టీ నేత సిపారసులు  పనిచేశాయని యూనియన్లతో సంబంధంలేని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇందులో డబ్బు ప్రభావం కూడా బాగా పనిచేసిందని చెబుతున్నారు. ఇంత దారుణంగా బదిలీల ప్రక్రియ ఎప్పుడు లేదని దుమ్మెత్తి పోస్తున్నారు. ఏళ్ల తరబడి విద్యుత్‌ భవన్‌లో, ఏడీఈ, డీఈ, సబ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని అంగుళం కూడా కదిలించకుండా కుర్చీలు మార్చారని కొందరు ఉద్యోగులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనిపై కోర్టులో ‘పిల్‌’ వేయడానికి సిద్ధమవుతున్నామని ఓ ఉద్యోగి సాక్షికి తెలిపారు.  విద్యుత్‌ శాఖలో బదిలీలు కోరుకునే వారు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని, అందుకు అర్హులైన వారు తప్పని సరిగా ఈ నిబంధనలు పాటించాలని   పేర్కొన్నారు.



ఒకేచోట 3 నుంచి 5 సంవత్సరాలు, ఒకే ప్రాంతంలో (ఏడీఈ, డీఈ కేంద్రాల్లో) 3 నుంచి 5 సంవత్సరాలు పనిచేస్తున్న వారు, 2 1/2 సంవత్సరం ఒకే చోట పనిచేసినప్పుడు ఏదైనా(ఆరోగ్య పరంగా, ఇతర అత్యవసర) కారణాలను చూపుతున్న వారు దరఖాస్తు చేసుకుంటే వారు బదిలీకి అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో  20 శాతం మంది మహిళా అధికారులను, మహిళా ఉద్యోగులను బదిలీ చేయాలని ఉంది. వీరిని కూడా ఎక్కడుండే వారిని అక్కడే సర్ధుబాటు చేశారేగాని, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టలేని పులివెందుల, ప్రొద్దుటూరు, రాయచోటికి కు చెందిన ముగ్గరు మహిళా ఉద్యోగులు ఆవేదనతో తెలిపారు.



నిబంధనల ప్రకారం బదిలీలు

శాఖలోని అసిస్టెంట్‌ ఇంజినీర్లు, సబ్‌ ఇంజనీర్లు, ఇతర ఆఫీసు స్టాఫ్‌ను నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టి పూర్తి చేశాం.  ప్రకటన చేసినప్పుడు యూనియన్‌ నాయకులు, బదిలీలు కొరుకుంటున్న అధికారులు, ఉద్యోగులు నా వద్దకు వచ్చారు. సమస్యలు చెప్పుకున్నారు. ఆ ప్రకారం ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించకుండా అందరి ఆమోదంతో బదిలీ చేశాం. ఇందులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.   –ఎం శివప్రసాదరెడ్డి, ఎస్‌ఈ, జిల్లా విద్యుత్‌శాఖ.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top