ఖాకీల్లో వణుకు పుట్టిస్తున్న మట్కా


 ప్రొద్దుటూరు క్రైం: మట్కా, క్రికెట్‌ బెట్టింగ్, పేకాట జరుగుతుందంటే.. అది కొందరు పోలీసుల చలవతోనే అని చెప్పవచ్చు. కొందరు పోలీసు అధికారుల చల్లని చూపు ఉండటం వల్లనే అసాంఘిక కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతున్నాయి. పోలీసు అధికారులు తల్చుకుంటే ఒక్కరు కూడా మట్కా రాయడానికి సాహసించరు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ లాంటి అధికారులు వీటిని ఎంతగా అణచివేయడానికి ప్రయత్నించినప్పటికీ కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఆశీస్సులతో అసాంఘిక కార్యకలాపాలకు బ్రేకు పడటం లేదు. మట్కా మామూళ్ల వ్యవహారం పోలీసు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మట్కా డాన్‌ నాగేశ్వరరావు నుంచి డబ్బు తీసుకున్నారనే కారణంతో త్రీ టౌన్‌ ఎస్‌ఐ మహేష్, ఏఎస్‌ఐ మునిచంద్రను డీఐజీ రమణకుమార్‌ ఇటీవల సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారులపై వేటుతో ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటే పొరపాటే అవుతుంది. మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది.

పెంచిన మొక్కే కాటేసింది..

మట్కా డాన్‌ నాగేశ్వరరావు చాలా ఏళ్ల నుంచి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విజయనగరం వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను 45 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద కంపెనీ ఏర్పాటు చేసి మట్కా నిర్వహిస్తున్నప్పటికీ నాగేశ్వరరావు ఎప్పుడూ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కలేదు. అతని అనుచరులు దొరికిన ప్రతి సారి మట్కా డాన్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకై పోలీసులు రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా అతను పోలీసులపై రూ.లక్షలు వెదజల్లుతూ తన మట్కా సామ్రాజ్యాన్ని ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ వ్యాప్తంగా విస్తరింప చేసుకున్నాడు. ఇలా కొందరు పోలీసులే అతన్ని చిన్న మొక్క నుంచి మహా వృక్షంలా మారడానికి కారకులయ్యారు. అయితే చివరకు పెంచిన మొక్కే పోలీసులను కాటేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసుల అదుపులో ఉన్న నాగేశ్వరరావు మామూళ్ల చిట్టా విప్పడం వల్లనే ఎస్‌ఐ, ఏఎస్‌ఐలపై వేటు పడింది. ఆదిలోనే అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసి ఉంటే మట్కా డాన్‌గా మారేవాడు కాదని, అతని నేర సామ్రాజ్యం పొరుగు జిల్లాలకు విస్తరించేది కాదని పోలీసు వర్గాల అభిప్రాయం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top