వద్దన్నా తలదూరుస్తున్నారు!

వద్దన్నా తలదూరుస్తున్నారు! - Sakshi


- సివిల్‌ తగాదాల్లో ఖాకీల అత్యుత్సాహం

- ఉన్నతాధికారుల సూచనలు పాటించని పోలీసులు

- షాద్‌నగర్‌ సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్‌ తాజా నిదర్శనం




షాద్‌నగర్‌క్రైం: సివిల్‌ తగాదాల్లో తలదూర్చవద్దని ఉన్నతాధికారులు వద్దంటున్నారు.. కిందిస్థాయి అధికారులు మాత్రం వదలనంటున్నారు.. దీంతో వివాదాల్లో చిక్కుకుని బదిలీలు, సస్పెన్షన్లకు వారు గురవుతూనే ఉన్నారు. షాద్‌నగర్‌ పట్టణ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించి సస్పెన్షన్‌కు గురైన సీఐ, ఎస్‌ఐల సంఘటనే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు.   షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని పోలీసు ఠాణాలన్నీ సైబరాబాద్‌ పరిధిలోకి వచ్చిన ఏడు నెలల వ్యవధిలోనే ఇక్కడి ఇద్దరు పోలీసు అధికారులు సివిల్‌ తగాదాల్లో తలదూర్చి సస్పెన్షన్‌కు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన అన్నదమ్ములు కజ్జెం వీరేశం, కజ్జెం శ్రీధర్, కజ్జెం వెంకటేశ్‌ల మధ్య రెండేళ్లుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి.



ఇందుకు సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణంలోని కేశంపేట రోడ్డులోని రైస్‌మిల్‌ నుంచి ఇటీవలే రూ. 8 లక్షల విలువైన బియ్యాన్ని తరలిండంతో పాటు మిల్లులో ఉన్న కొందరిపై ఓ వర్గం చేయిచేసుకుంది. రైస్‌ మిల్లు నుంచి బియ్యం తరలింపు సమయంలో పట్టణ ఎస్‌ఐ నారాయణ సింగ్‌ స్వయంగా అక్కడకు వెళ్లి ఒక వర్గానికి మద్దతు తెలిపి తమకు అన్యాయం చేశారంటూ కజ్జె వీరేశం సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విదేశాల్లో ఉన్న వీరేశం కుమారుడు తన కుటుంబానికి షాద్‌నగర్‌ పోలీసులు తీవ్ర అన్యాయం చేశారని సామాజిక మాధ్యమంలో (ట్విటర్‌)లో పోలీసు అధికారుల పేర్లతో సహా పోస్టులు చేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు వెంటనే పట్టణ సీఐ రామకృష్ణతో పాటు ఎస్‌ఐ నారాయణ సింగ్‌ను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా గురువారం ఈ ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.



రాజకీయ నాయకుల ఒత్తిళ్లే కారణమా..?

పట్టణంలోని కేశంపేట రోడ్‌లోని రైస్‌మిల్లు వ్యవహారంలో ఎస్‌ఐ నారాయణసింగ్‌ అత్యుత్యాహం చూపడానికి ఆయనపై వచ్చిన ఒత్తిళ్లే కారణమని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసు సిబ్బంది ఒత్తిళ్లకు తలొగ్గి విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారుల దృష్టి నుంచి తప్పించుకోలేరని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చిన తర్వాత స్థానిక ఠాణాలో న్యాయం జరగకపోతే బాధితులు నేరుగా సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్యను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. బాధితులకు భరోసానిస్తూ పోలీస్‌ కమిçషనర్‌ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, నియోజకవర్గంలోని పలు మండలాల ఠాణాల్లో రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు విధులు నిర్వహిస్తూ వారు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్‌ ఉదంతంతోనైనా ఆయా ఠాణాల పోలీస్‌ అధికారుల్లో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top