మంటలార్పడానికి ఇక ద్విచక్రవాహనం

మంటలార్పడానికి ఇక ద్విచక్రవాహనం - Sakshi


సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక శాఖలో కొత్త అస్త్రం చేరింది. ఇరుకు గల్లీల్లో జరిగే అగ్ని ప్రమాదాలను సైతం నిమిషాల వ్యవధిలో అదుపులోకి తీసుకొచ్చే మినీ ఫైర్‌ టెండర్‌ వెహికల్స్‌ను ప్రభుత్వం అందించింది. ‘మోటార్‌ సైకిల్‌ మౌంటెడ్‌ మిస్ట్‌ ఎక్విప్‌మెంట్‌’గా పిలిచే ఈ వాహనాలతో భారీ అగ్నిమాపక యంత్రాలు వెళ్లలేని చోటుకు సులువుగా వెళ్లి మంటలను ఆర్పివేయవచ్చు.


గతేడాది సిటీలో 21 మినీ ఫైర్‌ టెండర్‌ వెహికల్స్‌ను ప్రయోగాత్మకంగా పరిచయం చేశారు. వాటితో సత్ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 100 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో గ్రేటర్‌లోని 25 అగ్నిమాపక కేంద్రాలకు రెండేసి చొప్పున కేటాయించారు.



గల్లీల్లో సైతం ఇక ఈజీ..

జనసమ్మర్ధ ప్రాంతాలు, ఇరుకైన రోడ్లు, గల్లీల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన చోటికి భారీ అగ్నిమాపక యంత్రాలు వెళ్లడం కష్టం. నగర ట్రాఫిక్‌లో పెద్ద వాహనాలు చేరుకోవడం కొంత ఇబ్బందే. ఇలాంటి సమయంలో ఈ బుల్లి వాహనాలు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయి. తొలి ఐదు నిమిషాల్లోనే ఘటనా ప్రాంతానికి చేరుకుని తమ పని ముగిస్తున్నాయి. ప్రమాదం మరీ పెద్దదైతే.. భారీ అగ్నిమాపక యంత్రాలు వచ్చేదాకా మంటలు వ్యాపించకుండా వీటితో ‘ఫస్ట్‌ ఎయిడ్‌’ చేస్తున్నారు. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గుతోంది.



వాహనం ప్రత్యేకతలివీ..

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350 సీసీ బైక్‌తో ఈ యంత్రాలను రూపొందించారు. దీనికి పది లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ సిలిండర్‌ ఉంటుంది. దీనికి మిస్ట్‌గన్‌ పరికరాలు అమర్చి ఉంటాయి. 10 లీటర్ల నీరులో 9.3 వాటర్, 0.3 ఫోమ్‌ ఉంటుంది. ఇందులోని నీరు 1000 మైక్రాన్‌ లోపు నీటి తుపరగా మారుతుంది. 200 బార్స్‌ ఒత్తిడి గల ఎయిర్‌ సిలిండర్లు నాలుగు ఉంటాయి. ఒత్తిడితో ఉన్న గాలి, నురుగు, నీటి తుంపరలు బలంగా చిమ్మడం ద్వారా మంటలు అదుపులోకి వస్తాయి.


వాహనానికి ఉన్న మిస్ట్‌ గన్‌తో నీరు 14 మీటర్ల ఎత్తుకు వెళుతుంది. ఘటనాస్థలికి వెళ్లే సమయంలో సైరన్‌ మోగిస్తూ ట్రాఫిక్‌ను చేదించుకుని దూసుకెళ్లవచ్చు. 30 సెకన్లలో మంటలను అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం దీనికుంది. దీని వినియోగం భారీ అగ్నిమాపక యంత్రం మాదిరిగానే ఉంటుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top