ఆధార్, రేషన్ కార్డు లేవా.. అయితే రావొద్దు!

ఆధార్, రేషన్ కార్డు లేవా.. అయితే రావొద్దు! - Sakshi


మీరు ఏదైనా పనిమీద తూర్పుగోదావరి జిల్లా వెళ్తున్నారా? అందులోనూ కిర్లంపూడి గ్రామానికి వెళ్దామని అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి ఫొటో ఐడెంటిటీ కార్డులు తప్పనిసరిగా తీసుకెళ్లండి. దాంతోపాటు మీరు ఏ పనిమీద వెళ్తున్నారో కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అదేంటి... సొంత రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఈ ఆంక్షలేంటి, ఏమైనా పాకిస్థాన్‌లో ఉన్నామా అని భయపడుతున్నారా? కాపు రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు విధించిన ఆంక్షలివి. చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారైనా సరే.. తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు చూపించిన తర్వాత మాత్రమే కిర్లంపూడిలో ప్రవేశించడానికి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు.



ముద్రగడ దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో పోలీసులు హడావుడి చేస్తున్నారు. గత మూడు రోజుల కంటే సోమవారం హడావుడి మరింత ఎక్కువగా కనిపిస్తుండటంతో... ఈరోజు ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని, ఏడాదికి వెయ్యికోట్లు ఇస్తామన్నందున ఈ రెండేళ్లకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు తాము సూచించిన వ్యక్తినే కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలని కోరుతున్నారు. వీటిపై ఆయనతో చర్చించేందుకు ప్రభుత్వం తరఫున కొందరు ప్రతినిధులు ఈరోజు కిర్లంపూడికి వస్తారని తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top