మేయర్ హత్యకు స్కెచ్.. వీడియో స్వాధీనం

మేయర్ హత్యకు స్కెచ్.. వీడియో స్వాధీనం - Sakshi


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడని భావిస్తున్న చింటూ సన్నిహితుడి ఇంటి నుంచి ఒక ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దాన్ని విశ్లేషించగా.. చింటూ అసలు మున్సిపల్ ఆఫీసులోకి ఎలా వెళ్లాలి, ఎలా హత్య చేయాలన్న విషయమై ముందుగా వేసుకున్న మొత్తం స్కెచ్ అంతా ఒక వీడియో రూపంలో ఉంది. అది ఇప్పుడు పోలీసులకు దొరికింది. దాదాపు ఆరు నెలల నుంచి మేయర్ దంపతుల హత్యకు కుట్ర పన్నుతున్నట్లు దీంతో స్పష్టమైంది. అయితే ఇంత జరుగుతున్నా ఎక్కడా పోలీసులకు గానీ, నిఘా వర్గాలకు గానీ సమాచారం అందకపోవడం పూర్తిగా నిఘా వైఫల్యమేనని అంటున్నారు.



గురువారం వరకు ఈ కేసులో మొత్తం 11 మందికి నోటీసులు జారీచేయగా, తాజాగా 14 మంది ఇళ్లలో సోదాలు జరిగాయి. బాంబు స్క్వాడ్‌తో కూడా తనిఖీలు చేసి.. చింటూ ఇంట్లో కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మరో 14 మంది ఇళ్లలో సోదాలు చేసి, చింటూకు సంబంధించిన సమాచారం కనుగొన్నారు. ఈ మొత్తం కేసులో 47వ వార్డు కౌన్సిలర్ పద్మావతి భర్త మురుగ అనే వ్యక్తి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరికొందరు కీలక నిందితుల పాత్ర కూడా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. దీనికి సంబంధించి 8 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొందరి ఇళ్లలో కూడా సోదాలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top