వేశ్యా గృహాలపై దాడి..మూడు బస్సులో తరలింపు

వేశ్యా గృహాలపై దాడి..మూడు బస్సులో తరలింపు - Sakshi


చిన్నశంకరంపేట(మెదక్‌):

హైదరాబాద్‌–నాగపూర్‌ జాతీయ రహదారిపై ఉన్న జప్తిశివనూర్‌ గ్రామ శివారులోని సరోజిని నగర్‌ వేశ్యా గృహాలపై సీఐడీ పోలీసు బృందాలు బుధవారం రాత్రి మెరుపుదాడి చేపట్టాయి. స్థానిక పోలీసులకు సైతం సమాచారం అందించకుండా నేరుగా ఈ కార్యక్రమం చేపట్టిన పోలీసులు మీడియాను సైతం దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకున్నారు. దాడుల్లో మెదక్, సంగారెడ్డి జిల్లా పోలీసులతోపాటు హైదరాబాద్‌ సీఐడీ బృందాలు పాల్గొన్నాయి. వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థలవారు కూడా పాలుపంచుకున్నారు. జప్తిశివనూర్‌ వేశ్యా గృహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. 30 కుటుంబాలకు చెందిన మహిళలు, పురుషులతో పాటు సెక్స్‌ వర్కర్లను బస్సుల్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపునే సెక్స్‌వర్కర్లను మొత్తం అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇళ్లకు తాళాలు వేశారు. వచ్చిన పని ముగించుకుని మూడు బస్సులతో పాటు మరిన్ని అధికారుల వాహనాలతో సంగారెడ్డికి తరలివెళ్లారు.

 

జప్తిశివనూర్‌లో 30ఏళ్లుగా కొందరు ఇళ్లు నిర్మించుకొని వేశ్యవృత్తిని కొనసాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వాలు పునరావాసం కల్పించినా పూర్తిస్థాయిలో నిర్మూలించలేకపోయారు. దీంతో బుధవారం రాత్రి ఒక్కసారిగా రాష్ట్ర సీఐడీ బృందాలతోపాటు పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించి వందమందికిపైగా వేశ్యా గృహాల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని సంగారెడ్డికి తరలించి విచారిస్తున్నారు. గృహాల్లో పూర్తిస్థాయి సోదాలు నిర్వహించి నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడుల విషయమై ప్రత్యేక బృందం అధికారిని ప్రశ్నించినా వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. విలేకరులు ఫోటోలు తీసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తామే సమాచారం అందిస్తామని, ఆపరేషన్‌ పూర్తయ్యే వరకు ఎవరు కూడా దరిదాపుల్లోకి రావద్దని అడ్డుకున్నారు.



అదుపులోకి తీసుకున్న మహిళల్లో బలవంతంగా సెక్స్‌రాకెట్‌లోకి దింపినవారు, మైనర్‌ యువతులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో సీఐడీ అధికారుల బృందం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు ముందు తెలిసినప్పటికీ వారిని సంగారెడ్డిలోని రహస్య ప్రాంతంలోనే మహిళలను మూడు విభాగాలుగా విభజించి విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో 45 ఎళ్లు పైబడిన మహిళలను గృహయజమానులుగా గుర్తించిన పోలీసులు వారిని ఒక గ్రూప్‌గా, 20 ఏళ్లు పైబడిన మహిళలను మరో గ్రూప్‌గా, అంతకు తక్కువ వయస్సు వారిని ఒక గ్రూప్‌గా చేసి వివరాలు రాబడుతున్నారని తెలిసింది. ఇందులో ఆధార్‌, రేషన్‌ కార్డు కలిగిన వారిని, అసలు ఎలాంటి అధారం లేని మహిళలను గుర్తించే పనిలో పడ్డారు సీఐడీ అధికారులు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top