వైఎస్ జగన్ దీక్ష భగ్నం.. పోరు ఉధృతం

వైఎస్ జగన్ దీక్ష భగ్నం.. పోరు ఉధృతం - Sakshi


మంగళవారం తెల్లవారుజామున జగన్‌ను బలవంతంగా గుంటూరు జీజీహెచ్‌కి తరలించిన పోలీసులు

 

 ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడు రోజులుగా సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం తెల్లవారు జామున దీక్షా శిబిరంపై దాడి చేసిన పోలీసులు జగన్‌ను బలవంతంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీక్ష విరమించేది లేదని ప్రతిఘటించిన జగన్.. ఆసుపత్రిలోనూ ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు నిరాకరించారు. అయితే పోలీసులు వైద్యుల సాయంతో  ఫ్లూయిడ్స్ ఎక్కించి జగన్ దీక్షను భగ్నంచేశారు.  అంతకుముందు జగన్ ఆరోగ్యం బాగా విషమించిందని, కీటోన్స్ స్థాయి 4 ప్లస్‌కు చేరుకున్నాయని కలెక్టర్‌కు, ఎస్పీకి  వైద్యులు నివేదిక ఇచ్చారు.



దాంతో పోలీసులు రంగంలో దిగి జగన్‌ను ఆసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జగన్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తూ వైద్యసేవలందిస్తున్నారు. జగన్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు విజయమ్మ, భారతి, షర్మిలతోపాటు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. జగన్ ఆరోగ్యం ప్రమాదకరస్థితిలో ఉన్నందున 24 గంటల పాటు ఆయన తమ పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. కాగా జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేయటంతో వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు రాష్ర్టవ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్నారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించారు.



మరోవైపు దీక్ష భగ్నం, జగన్ ఆరోగ్యం, భవిష్యత్ కార్యాచరణపై వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు సమీక్షించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. బుధవారం నుంచి ఈనెల 21 వరకు రకరకాల పోరాటాలతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి, నిరవధిక దీక్ష భగ్నం గురించి వివరించేందుకు గాను ఈనెల 22న జగన్ ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోరనున్నారని  వైఎస్సార్‌సీపీ నాయకులు వివరించారు.

 

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిరవధిక నిరాహార దీక్ష సాగించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. విషమించిన స్థితి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగుపడుతోందని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జగన్‌కు గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం వైద్యసేవలందిస్తోంది. జగన్ ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నివేదిక ఇవ్వడంతో మంగళవారం తెల్లవారు జామున పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆయన్ను బలవంతంగా 108 అంబులెన్సులో జీజీహెచ్‌కు తరలించారు.



జీజీహెచ్ మిలీనియం బ్లాక్‌లోని రెస్పిరేటరీ ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్‌లో తెల్లవారుజాము 4.30 గంటల నుంచి వై.ఎస్. జగన్‌కు వైద్య సేవలు మొదలుపెట్టారు. జగన్‌ను ఆసుపత్రికి తరలించారని తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వై.ఎస్ విజయమ్మ, భారతి, షర్మిల, ఈసీ గంగిరెడ్డి జీజీహెచ్‌కు చేరుకున్నారు. తెల్లవారు జామున 5 గంటలకు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించడంతో జగన్ నిరాకరించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వైద్యులు బలవంతంగా ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్స్‌ను ఎక్కించారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు ఆధ్వర్యంలో వైద్యుల బృందం వైద్య సేవలు అందిస్తోంది.



 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే..

 వైఎస్ జగన్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు మంగళవారం మధ్యాహ్నం విలేకరులకు వివరించారు.  జగన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో 24 గంటలపాటు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘వై.ఎస్. జగన్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. జగన్ మొదట వైద్యానికి నిరాకరించినప్పటికీ ప్రస్తుతం సహకరిస్తున్నారు. మంగళవారం తెల్లవారు జామున జగన్‌ను ఆసుపత్రికి తీసుకురాగానే 5 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించాం. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.



జగన్‌ను డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పద్మజారాణి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి. నాగశ్రీహరిత, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ జి. శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ ఆనంద్, డాక్టర్ వాణిలతో కూడిన వైద్యుల బృందం పరీక్షించి వైద్య సేవలు అందిస్తోంది. జగన్‌కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడంతోపాటు, పలు వైద్యసేవలు అందించిన అనంతరం తిరిగి 11 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతమేరకు మెరుగుపడిందని తేలింది. ఆయన శరీరం వైద్యానికి బాగా సహకరిస్తోంది. ఉదయం 5 గంటల సమయంలో షుగర్ లెవల్స్ 65 ఉండగా, 11 గంటల సమయానికి 121కు చేరుకున్నాయి.



పల్స్ రేటు ఉదయం 5 గంటలకు 45 ఉండగా 11 గంటలకు 55కు చేరుకుంది. బీపీలో పెద్దగా మార్పు లేదు. యూరిన్‌లో కీటోన్ బాడీస్ ఉదయం 5 గంటల సమయంలో 4 ప్లస్ ఉండగా, 11 గంటలకు 3 ప్లస్‌కు తగ్గాయి. యూరిక్ యాసిడ్ ఉదయం 5 గంటలకు 14.4గా ఉండగా, 11 గంటలకు 13.2కు తగ్గింది. అప్పటికీ ఎక్కువగా ఉండటాన్ని జగన్‌తో ప్రస్తావించగా, తన తండ్రి రాజశేఖరరెడ్డికి కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేదని చెప్పారు. దీంతో వంశపారంపర్యంగా వచ్చినట్లు గుర్తించాం. ఉదయం 5 గంటల సమయంలో జగన్ 72.3 కేజీల బరువు ఉండగా 11 గంటల సమయానికి 72.8 కేజీలకు పెరిగారు. జగన్ ఘన పదార్థాలు తీసుకోకపోవడంతో 2.5 లీటర్ల ఫ్లూయిడ్స్ ఎక్కించాము.



జగన్‌కు వ్యాయమం చేసే అలవాటు ఉండటంతో బీపీ, పల్స్ సాధారణ స్థితిలోనే ఉంటున్నాయి. సాయంత్రం 6.45 గంటలకు బీపీ పరీక్ష చేయగా 120/80, పల్స్ రేటు 56గా ఉన్నాయి. జగన్ నీరు, మజ్జిగ, పాలు వంటి ద్రవాహారం నోటి ద్వారా తీసుకుంటున్నారు. అయితే కొన్ని రిపోర్టులు ఇంకా నార్మల్‌కు రాలేదు. దీంతో వై. ఎస్. జగన్‌ను 24 గంటలపాటు మా పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించాం.’’



 దీక్ష భగ్నం జరిగిందిలా...

 జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను ఏడో రోజున మంగళవారం తెల్లవారు జామున 4.15 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. పార్టీ శ్రేణుల నిరసనలు, ప్రతిఘటనల మధ్య జగన్‌ను బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తీసుకువెళ్లారు.  జగన్ దీక్షను భగ్నం చేయడం, ఆయన్ను అంబులెన్స్‌లోకి ఎక్కించడం అంతా ఐదు నిమిషాల్లో పోలీసులు ముగించారు. గుంటూరు అర్బన్ ఏఎస్పీలు వెంకటప్పలనాయుడు, భాస్కరరావుల ఆధ్యర్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మంగళవారం తెల్లవారు జామున 4.10 గంటలకు వేదికపైకి చేరుకుని 4.15 గంటల కల్లా జగన్‌ను తీసుకుని వెళ్లి పోయారు.



ముందుగా పోలీసు ఉన్నతాధికారులిద్దరూ వేదికపైకి వెళ్లి  నిద్రపోతున్న జగన్‌ను మేల్కొలిపారు. ‘సార్, మీ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. మిమ్మల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలి...దయ చేసి సహకరించండి’ అని ఏఎస్పీ వెంకటప్పలనాయుడు జగన్‌కు నచ్చ జెప్పేయత్నం చేశారు. కానీ ఆయన శిబిరం నుంచి కదలడానికి నిరాకరించారు. ఇదే సమయంలో వేదిక సమీపంలో ఉన్న కార్యకర్తలంతా ‘జై...జగన్...’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అవినాష్‌రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, ఆదిమూలం సురేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, మర్రిరాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొలుసు పార్థసారథి, జోగి రమేష్, ఎమ్మెల్యే నారాయణస్వామి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, తలశిల రఘురాం, గొట్టిపాటి భరత్ తదితరులు పోలీసులను ప్రతిఘటించారు.



నిరసనలు, ప్రతిఘటనలు పెరుగుతుండడంతో పోలీసులు ఆయన్ను ఒక్కసారిగా తమ చేతులపైకి ఎత్తుకుని మోసుకుంటూ దీక్షా వేదికపై నుంచి కిందకు ఒక్క ఉదుటున తీసుకొచ్చి అప్పటికే సిద్ధం చేసుకున్న 108  వాహనంలో ఎక్కించేశారు. తనను తీసుకు వెళ్లొద్దంటూ జగన్ చేతులతో వారించినా వారు పట్టించుకోలేదు. అంబులెన్స్‌ను పోనీయకుండా వేదిక కింద కొందరు కార్యకర్తలు అడ్డగిస్తూ మళ్లీ నినాదాలకు పూనుకోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి వాహనాన్ని ఆగమేఘాలపై జీజీహెచ్‌కు చేర్చారు.



అంబులెన్స్ జీజీహెచ్‌లోకి రాగానే అప్పటికే అక్కడకు చేరుకున్న  పోలీసులు గేట్లు మూసివేసి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు లోపలకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీజీహెచ్ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పదిహేను వాహనాల్లో తరలి వచ్చిన ఆరుగురు డీఎీస్పీలు, సుమారు 20 మంది సీఐలు, నలభై మంది ఎస్‌ఐలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, నిరుద్యోగ యువకుల, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న ప్రతిపక్ష నేత దీక్షను భగ్నం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశారు. ప్రజా స్వామ్య వాదులంతా ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. జగన్ దీక్షను భగ్నం చేసినా తదుపరి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.



 ముఖ్యనేతల అత్యవసర భేటీ

 అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలంతా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమై జగన్ అరెస్టు, ఆసుపత్రికి తరలింపు పరిణామాల అనంతర పరిస్థితిపై సమీక్షించారు. దీక్ష భగ్నం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయక పోగా అందు కోసం పోరాడుతున్న జగన్‌కు అడ్డంకులు సృష్టించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తదుపరి ఉద్యమకార్యాచరణను రూపొందించారు.  

 

 కీటోన్‌లు ఏంచేస్తాయి?

 కీటోన్‌లు ఉత్పత్తి అయ్యాయంటే శరీరాన్ని అతలాకుతలం చేస్తాయి. పూర్తి నిరాహార దీక్షలో ఉన్నప్పుడు శరీరంలో కార్బొహైడ్రేట్‌లన్నీ ఖర్చయిపోయి, కొవ్వులు వినియోగం మొదలవుతుంది. ఈ కొవ్వులు ఆహారంగా మారుతున్న సమయంలోనే శరీరంలో కీటోన్‌లు విడుదలవుతాయి. ఈ కీటోన్‌లు ఎపిడోసిస్‌గా మారుతాయి. అంటే శరీరమంతా యాసిడ్‌లు వ్యాపిస్తాయి. వీటివల్ల ప్రధానంగా మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల శ్వాస పీల్చుకోలేరు. ఆయాసం ఎక్కువగా ఉంటుంది. నోరు ఎండిపోతుంది. కొన్ని సందర్భాల్లో గుండెమీద కూడా దుష్ర్పభావం చూపించే అవకాశముంటుంది.

 

 ఇప్పటికి నాలుగుసార్లు ప్రమాదకర దీక్షలు

 ప్రజాసమస్యలపై నిరవధిక నిరాహార దీక్షలకు దిగడం జగన్‌మోహన్‌రెడ్డికి ఇది నాలుగోసారి. గతంలో ఆయన  2011 ఫిబ్రవరిలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలన్న డిమాండ్‌తో 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 2013 ఆగస్ట్‌లో 7 రోజుల పాటు చంచల్‌గూడ జైలునుంచే నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అనంతరం రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ 2013 అక్టోబర్‌లో ఐదు రోజుల నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోరుతూ 7 రోజుల పాటు దీక్ష కొనసాగింది. కేవలం మంచి నీళ్లు మాత్రమే ఆహారంగా ఏడు రోజుల అకుంఠిత దీక్ష కొనసాగించడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ఈ మార్పులు ఆరోగ్యపరంగా తీవ్ర దుష్ర్పభావం చూపిస్తాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

 

 కీటోన్స్ నివారణకు ఫ్లూయిడ్సే ఆహారం

 శరీరంలో 3ప్లస్‌గా కీటోన్స్ వచ్చాయంటే చాలా ఎక్కువ. కిడ్నీ తోపాటు గుండెకూ ప్రమాదమే. జగన్‌మోహన్‌రెడ్డి వైద్య పరీక్షలు చూస్తూంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. శరీరం నుంచి కీటోన్స్‌ను తొలగించేందుకు ఐవీఫ్లూయిడ్స్ మినహా మరో మార్గం లేదు. రికవరీ అయ్యేవరకూ వైద్యుల పర్యవేక్షణ అవసరం. శరీరంలో కీటోన్స్ నిల్ అని తేలాకే ఆయన ఇంటికెళ్లాలి. అయినా పదే పదే శరీరంలో కీటోన్‌లు ఉత్పత్తి కాకుండా చూసుకోవడం మంచిది.  

 -డా.సి.ప్రభుకుమార్, ఎండీ, ఇంటర్నల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్

 

 నాలుగు ప్లస్ కీటోన్స్ చాలా ప్రమాదకరస్థాయి

 కీటోన్‌బాడీస్ 1 ప్లస్ దాటితే శరీరంలో అవయావాలు క్రమపద్ధతిలో పనిచేయకుండా గతి తప్పుతాయి. కీటోన్ బాడీస్ 4ప్లస్ దాటిందంటే తీవ్రస్థాయిలో ఉన్నట్లు లెక్క. ఇలాంటి సమయాల్లో కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, లివర్ తదితర అవయవాలపై కీటోన్‌బాడీస్ ప్రభావం కనిపించి అవయవాలు పనిచేయడం మానివేస్తాయి. శరీరంలో యాసిడ్ నిల్వలు బాగా పెరిగిపోయి మనిషి నీరసించి పోయి కోమాలోకి పోయే ప్రమాదం ఉంది. మూత్రపరీక్ష ద్వారా శరీరంలో కీటోన్‌బాడీస్ ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేస్తారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో కీటోన్‌బాడీస్ కనిపిస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువ.  

 - డాక్టర్ పద్మలత, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, జీజీహెచ్, గుంటూరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top