‘గిట్టుబాటు’ బాధ్యత ప్రభుత్వానిదే..

‘గిట్టుబాటు’ బాధ్యత ప్రభుత్వానిదే.. - Sakshi


త్వరలో వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ: పోచారం

యాచారం:  పంట పండించే శ్రమ రైతులదైతే.. దానికి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రజలకు సరిపడా కూరగాయలు, పండ్లు, పూలను అందించాలనే లక్ష్యంతో పంట కాలనీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గునుగల్ గ్రామంలో సోమవారం పంట కాలనీల ప్రాముఖ్యత, రైతులకు కల్పించే రాయితీలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ... మహానగరంతో పాటు శివారు ప్రాంత ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు, పూలలో 70 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని, ధరలు కూడా అధికంగా ఉంటున్నాయని అన్నారు.



దీంతో స్థానికంగానే వీటిని పండించాలని సీఎం సూచించారని... అందుకనుగుణంగాప్రభుత్వం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో పంట కాలనీలను ఏర్పాటు చేస్తోందన్నారు. వ్యవసాయం, ఉద్యానం రెండూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉద్యోగ ఖాళీలన్నీ త్వరలో భర్తీ చేస్తామన్నారు. పంట కాలనీల రాయితీ కోసం రూ.వెయియ కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు కొత్తగా ఏర్పడిన వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని 5 లక్షల ఎకరాలకు పాలమూరు, డిండి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో  ప్రభుత్వం కృషి చేస్తోందని మరో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యాన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి,  కమిషనర్ వెంకటరాంరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top