వివరాలు..ప్లీజ్‌!


సాక్షి, నల్లగొండ : మీ పేరు, ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు... మీరు ఎప్పుడు ఉద్యోగంలో చేరారు.. రెగ్యులర్‌ ఎప్పుడైంది.. ఆధార్‌ నంబర్, స్థానికత వివరాలు.. మీరు బ్యాంకులో రుణం తీసుకున్నారా... తీసుకుంటే ఎంత.. ఎన్ని కిస్తీలు కట్టారు.. ఇంకా ఎన్ని కట్టాలి.. మీ భార్య/ భర్త ఏం చేస్తారు.. మీ పిల్లలేం చేస్తారు.. వారి మొబైల్‌ నంబర్‌.. మీ జీవిత భాగస్వామి వార్షిక ఆదాయం ఎంత.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 31 అంశాలపై ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది.  అన్ని వివరాలు ఇవ్వాలని జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నాలుగు పేజీల ఫారాలను అందజేసింది. అంతేకాదు..



అడిగిన వివరాలన్నీ ఇస్తేనే మార్చి నెలలో వేతనం అందుకుంటారని సర్కారు స్పష్టం చేసింది.  ఈ వివరాలను ఆన్‌లైన్‌లో ఇవ్వాలా.. లేదంటే మాన్యువల్‌గా ఇవ్వాలా.. అనే దానిపై ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఎలా ఇవ్వాలన్నది పక్కనబెడితే అసలు ఇన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తమను ఎందుకు అడుగుతోందనే దానిపై జిల్లా ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.



అసలెందుకు..

ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వానికి కచ్చితంగా కొన్ని వివరాలు సమర్పించాలి. వారి ఇన్‌కంటాక్స్‌ రిటర్నులు కూడా సమర్పించాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా ఈ ఫార్మాట్‌ తరహాలోనే కొన్ని వివరాలు సేకరించారు. ఈసారి మాత్రం పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలన్నింటినీ ఎందుకు తీసుకుంటున్నారన్న చర్చ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సాగుతోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగులకు శాశ్వత కేటాయింపులు జరిపేందుకు గాను వారి స్థానికత తదితర వివరాలు తీసుకుంటున్నారని, దీని ఆధారంగానే జిల్లాలకు ఉద్యోగులను బదిలీ చేస్తారనే చర్చ జరుగుతోంది.



సర్వీసు రికార్డులో స్థానికత ఉంటుంది కనుక మళ్లీ ఇప్పుడు ఎందుకనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు శాఖల బదలాయింపు కోసమనే వాదన కూడా వినిపిస్తోంది. జిల్లాల విభజన తర్వాత అనేక శాఖల విలీనం జరిగింది. కొన్ని శాఖలో పనిభారం ఎక్కువ ఉంటే కొన్ని చోట్ల తగ్గిపోయింది. కొన్ని శాఖల్లో ఉద్యోగులు అధికంగా ఉంటే మరికొన్ని శాఖల్లో కొరత ఉంది. ముఖ్యంగా కలెక్టరేట్లు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఉద్యోగుల బదలాయింపులుంటాయని కొందరు భావిస్తున్నారు.



 అలాంటప్పుడు బ్యాంకుల్లో రుణాలు, జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఒక ఉద్యోగి పూర్తి వివరాలుండాలనే కోణంలో వివరాలను సేకరిస్తున్నా.. ఇప్పటికే ఉన్న సమాచారాన్ని కూడా ఎందుకు అడుగుతున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్న ప్రభుత్వ సిబ్బంది నిర్వాకాన్ని గుర్తించేందుకేనా అనే అనుమానం ఉన్నా.. తాజా ఉత్తర్వుల్లో అసలు ఆస్తుల వివరాలే అడగలేదు. గతంలో టీచర్లకు ఇలాంటి ఫారాలు ఇచ్చారు. వారి నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తీసుకున్నారు.  



15 లోపు ఇస్తేనే వేతనాలు..

ఈ వివరాలన్నింటినీ ఈనెల 15లోపు కచ్చితంగా సమర్పిస్తేనే మార్చి నెలలో జీతం వస్తుందని కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అయితే..ఈ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలా లేదా మాన్యువల్‌గా ఇస్తే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఉన్నతాధికారులను అడిగితే రెండు విధాలుగా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం ఈ సమాచారం వెళ్లలేదు. కొందరు ఆన్‌లైన్‌లో చేస్తుండగా, మరికొందరు మాన్యువల్‌గా చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే... ఈ వివరాలతో పాటు కొన్ని ధ్రువపత్రాలను కూడా సమర్పించాల్సి ఉండడం, గడువు చాలా దగ్గర ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి వివరాలు ఇస్తే సరిపోతుందని, తర్వాత మరో గడువు లోపు సర్టిఫికెట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ వివరాల సేకరణ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నుంచి కచ్చితమైన సమాచారం వస్తే బాగుంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top