గులాబీ దండుకే యంత్ర‘లక్ష్మి’!

గులాబీ దండుకే యంత్ర‘లక్ష్మి’!


సబ్సిడీ ట్రాక్టర్లు అధికార పార్టీ నాయకులకే..

మూడో విడతలో జిల్లాకు 224 ట్రాక్టర్లు మంజూరు




సీఎం కార్యాలయం హామీ ఇచ్చినా..

2015లో నా పంట పొలంలో పసుపు, మొక్కజొన్న, సోయా పంటలు ఎండిపోయాయి. సీఎం క్యాంపు కార్యాలయానికి టెలిగ్రాం చేశా. ప్రభుత్వం వ్యవసాయానికి అందించే ప్రోత్సాహకాల విషయంలో నాకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హామీ పత్రం వచ్చింది. అందుకు అనుగుణంగా యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధిదారుడిగా ఎంపిక చేయాలి. కానీ.. అధికార పార్టీ నాయకుల మూలంగా నాకు ట్రాక్టర్‌ మంజూరు కాలేదు.



మోర్తాడ్‌(బాల్కొండ) :

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా యంత్రలక్ష్మి పథకం కింద జిల్లాకు మంజూరైన ట్రాక్టర్ల యూనిట్లు మరోసారి గులాబీ నాయకులనే వరించాయి. ముచ్చటగా మూడోసారి యంత్రలక్ష్మి ట్రాక్టర్ల యూనిట్లను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఇప్పించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని వివిధ మండలాలకు 2016–17 ఆర్థిక సంవత్సరానికి 224 ట్రాక్టర్ల యూనిట్లు మంజూరయ్యాయి.


అయితే ఆర్థిక సంవత్సరం ముగింపులోనే ప్రభుత్వం ట్రాక్టర్ల యూనిట్లకు సబ్సిడీ కోసం నిధులు కేటాయించింది. దీంతో ముందుగానే ఎంపిక చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో దరఖాస్తు చేయించిన నేతలు వారికే మంజూరయ్యేలా ముందుచూపుతో వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని అధికారులు రైతులకు అందించ లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడానికి సమయం దగ్గరపడుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపలేదు. కేవలం 300 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇదే అదనుగా భావించిన కొందరు ముఖ్యనేతలు ట్రాక్టర్ల యూనిట్లను హడావుడిగా మంజూరు చేయించారు.


గుట్టుచప్పుడు కాకుండా దరఖాస్తు

నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో గుట్టుచప్పుడు కాకుండా దరఖాస్తులు మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ చేయించి గ్రామజ్యోతి వ్యవసాయ కమిటీ, మండల కమిటీల ఆమోదం పొందేలా చేశారు. ఆ తరువాత జిల్లా వ్యవసాయ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి దరఖాస్తులు పంపించి వాటికి మోక్షం కలిగించడానికి అధికార పార్టీ నాయకులు పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి.


జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం వెల్లడించిన 224 మంది లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే అందులో అందరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీల నాయకులు ఉన్నారు. ఒకరిద్దరు ఎంపీపీలతోపాటు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, కొంత మంది సర్పంచ్‌లు, మరికొంత మంది ఉప సర్పంచ్‌లు, సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు ఉన్నట్లు స్పష్టం అయ్యింది. ఈ ప్రజాప్రతినిధులు అంతా గులాబీ కండువాలు కప్పుకునే నాయకులు కావడం విశేషం.


రెండు విడతల్లో అధికార పార్టీ నాయకులకే పెద్దపీట

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2015లో మొదటిసారి యంత్రలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. తొలిసారి అమలు చేసిన సమయంలో ఉమ్మడి జిల్లాకు 175 ట్రాక్టర్ల యూనిట్లను మంజూరు చేశారు. యంత్రలక్ష్మి పథకం కింద అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో భారీ సబ్సిడీ ట్రాక్టర్‌లను పొందడానికి రైతులు ఎక్కువ మంది పోటీ పడ్డారు. అప్పట్లో దాదాపు 500 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా అన్ని దరఖాస్తులను పరిశీలించి ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన వారికే ట్రాక్టర్లను మంజూరు చేశారు. 2016లో రెండో విడత ట్రాక్టర్‌లను మంజూరు చేయగా జిల్లాకు 212 యూనిట్లను కేటాయించారు.


కాగా 300 దరఖాస్తులు అధికారులకు అందగా ఇందులో కూడా ముఖ్యనేతలు చెప్పిన దరఖాస్తులకే అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీనిపై తాళ్లరాంపూర్‌కు చెందిన రైతు బోనగిరి నర్సారెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా లోకాయుక్త స్పందించి జేడీఏకు నోటీసులను జారీ చేసింది. యంత్రలక్ష్మి ట్రాక్టర్ల యూనిట్ల మంజూరులో ప్రజాప్రతినిధుల జోక్యంపై లోకాయుక్త మండిపడింది. అయితే యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధిపొందేవారికి కనీసం రెండు ఎకరా ల వ్యవసాయ భూమి ఉండాలి.


ఎంత భూమి ఎక్కువ ఉన్నా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హుడు అని ప్రభుత్వం నిర్ణయించడంతో లోకాయుక్తలో అధికారులు ప్రభుత్వ నిబంధనలు చూపి తప్పించు కోగలిగారు.


భారీగా సబ్సిడీ

యంత్రలక్ష్మి పథకం కింద ఒక్కో ట్రాక్టర్‌ యూనిట్‌కు 50 శాతం సబ్సిడీని అందిస్తున్నారు. ట్రాక్టర్‌ ధర ఎంత ఉన్నా సబ్సిడీ మొత్తం రూ.5 లక్షల వరకు వర్తించేది. కాగా సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం ట్రాక్టర్‌ ధర ఎంత ఉన్నా సబ్సిడీని రూ.4 లక్షలకు పరిమితం చేసింది. లబ్ధిదారుడికి రెండు ఎకరాలు కనిష్టంగా భూమి ఉండాలి. గరిష్టంగా ఎంత భూమి ఉన్నా యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధిపొందవచ్చు.


ఇదిలా ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్‌ల కింద సబ్సిడీ రుణాలు అందించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించగా దరఖాస్తులు అనేకం వచ్చాయి. అయితే లబ్ధిదారులను ఎంపిక చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం లక్కీ డ్రా పద్ధతిని అవలం భించింది. ఈ విధానాన్ని యంత్రలక్ష్మి ట్రాక్టర్ల యూనిట్ల కేటాయింపునకు అమలు చేసి ఉంటే కొంతమంది అర్హులకైనా ట్రాక్టర్ల యూనిట్లు మంజూరయ్యేవని రైతులు చెబుతున్నారు. కనీసం నాలుగో విడత నుంచైనా డ్రా విధానం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top