ఊరంతా ఖాళీ

ఊరంతా ఖాళీ - Sakshi


కరువు కథ...కన్నీటి వ్యథ

పంటపండదు...పని దొరకదు

ఉపాధికోసం తప్పని వలసబాట

ఏ ఇంటికి చూసినా తాళాలే

బండ్రేపల్లిలో నిశ్శబ్ధ రాజ్యం




కదిరి:



నియోజకవర్గం: కదిరి

మండలం: నల్లచెరువు

ఊరు: బండ్రేపల్లి

మొత్తం ఇళ్లు: 120

వలస వెళ్లిన కుటుంబాలు : 92

గ్రామ పరిధిలోని బోర్లు: 48

పూర్తిగా ఎండిపోయినవి: 36

పనిచేస్తున్న బోర్లు: 12

ఉపాధి జాబ్‌ కార్డుల సంఖ్య:120

పనిదినాలు పూర్తిచేసుకున్న వారు: 5 మంది




కరువు...వర్షాభావం ఈ రెండింటికీ ‘అనంత’ చిరునామాగా మారిపోయింది. ఎటుచూసినా నెర్రెలు చీలిన పొలాలు... బక్కచిక్కిన గేదెలే కనిపిస్తాయి. ఇక కదిరి ప్రాంతంలో అయితే కొన్నేళ్లగా దుర్భిక్షం తాండవం చేస్తోంది. వరుస కరువులతో రైతులు కుదేలయ్యారు. పంటలు పండవు...స్థానికంగా ఉపాధి దొరకదు..అందుకే 20 ఎకరాల ఆసామికూడా ఊరు దాటాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 8 వేల కుటుంబాలు వలసబాట పట్టాయి. ఉపాధి పనులు కూడా వెక్కిరిస్తుండగా...ఒక్క నల్లచెరువు మండలం బండ్రేపల్లిలోనే 92 కుటుంబాలు బెంగుళూరు, హైదరాబాదు, తిరుపతి వంటి నగరాలకు వెళ్లి పొట్టపోసుకుంటున్నాయి. దీంతో ఆ గ్రామంలో ఏ ఇంటికి చూసినా తాళాలే కనిపిస్తున్నాయి. ఊరంతా నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది.



చేపల వల అల్లుకోవడానికి దారం సిద్ధం చేసుకుంటున్న ఈయన పేరు గండారెడ్డి గంగిరెడ్డి. స్వగ్రామం నల్లచెరువు మండలం బండ్రేపల్లి. భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. ఇతనికి 20 ఎకరాల పొలం ఉంది. 2 బోర్లు ఉన్నాయి. వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆ రెండు బోర్లూ ఎండిపోయాయి. వ్యవసాయంలో పెట్టిిన పెట్టుబడులు కూడా చేతికి అందక పోవడంతో సాగుకు స్వస్తి పలికాడు. దీంతో గంగిరెడ్డి పొలం ఇప్పుడు బీడుగా మారిపోయింది. కొడుకు, కోడలు ఇద్దరూ బెంగుళూరులో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఊర్లోనే ఉండిపోయిన గంగిరెడ్డి ఆయన భార్య నాలుగు మెతుకులు తినేందుకు కొంత మొత్తం పంపుతున్నారు.



....గండారెడ్డి గంగిరెడ్డి కుటుంబం మాత్రమే కాదు..ఇలాంటి కుటుంబాలు బండ్రేపల్లిలో చాలానే ఉన్నాయి. అందుకే గ్రామంలో ఏ ఇంటి వైపు చూసినా తాళాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పాడిపంటలతో ఈ గ్రామం కళకళలాడేది. ఎవరి ఇంటి ముందు చూసినా రెండు కాండ్ల(జతలు) ఎద్దులు, 10, 15 పాడి ఆవులు కన్పించేవి. చుట్టుపక్కల గ్రామాల వారంతా పనుల కోసం ఈ ఊరికి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.



సెక్యూరిటీ గార్డుగా మారిన రైతులు

దేశానికే అన్నం పెట్టిన రైతన్నలు కరువు దెబ్బకు కోలుకోలేకపోయారు. పాలకులు కూడా పట్టించుకోకపోవడఽంతో  20 ఎకరాలున్న రైతన్న కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణాల బాట పట్టాడు. ఆత్మగౌరవాన్ని చంపుకుని సెక్యూరిటీ గార్డుగానో, అపార్ట్‌మెంట్‌ల వద్ద కాపలా ఉండటమో లేదంటే భవన నిర్మాణ కూలీలుగానో పనిచేస్తున్నారు. మహిళలేమో గార్మెంట్‌ పరిశ్రమల్లోనూ, ఇళ్లల్లో పని చేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. బండ్రేపల్లిలో జనమంతా వలసవెళ్లడంతో ఊరు వల్లకాడుగా మారింది. ప్రధాన వీధుల్లో కూడా కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలచాయి. ఇంటికి నిత్యం తాళం వేయడంతో ఎన్నో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.



ఉపాధి పనులు బంద్‌

ఒకప్పుడు 40 మంది విద్యార్థులున్న బండ్రేపల్లి పాఠశాలలో ఇప్పుడు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. ఊరంతా వలసబట పట్టడంతో అధికారులు సైతం ఆ గ్రామంలో ఉపాధి పనులు  పూర్తిగా నిలిపివేశారు. ఇంతటి కరువు తామెన్నడూ చూడలేదని గ్రామస్థులు అంటున్నారు.



గొర్రెల కాపరిగా ఉండిపోయా

మా ఊరు ఒకప్పుడు ఎలా ఉండేదో తలచుకుంటేనే ఏడుపొస్తుంది. మేమంతా కూలి చేసుకునేటోళ్లం. కానీ మేము ఏ రైతు దగ్గర కూలి పనులకెళ్లామో ఆ రైతే ఇపుడు బెంగుళూరులో కూలి పనిచేస్తున్నాడు. అది చూసి మాకే బాధేస్తోంది. అందుకే నేను తిరిగొచ్చేసి, 10 గొర్రెలు పెట్టుకొని మేపుకుంటూ ఊరిలోనే ఉండిపోయా. కానీ నా కొడుకు, కోడలు మాత్రం బెంగుళూరులోనే ఉన్నారు.

–వెంకటరమణ, బండ్రేపల్లి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top