కళ్లెదుట దొంగలు..కనబడలేదట..!

కళ్లెదుట దొంగలు..కనబడలేదట..! - Sakshi


గుంటూరు కార్పొరేషన్‌లో పింఛన్‌ మాయంపై చర్యలు శూన్యం

రూ. 3.50 లక్షలు కాజేసినట్లు తేల్చిన అధికారులు

ముగ్గురు ఆర్‌ఐలు, పదిమందికిపైగా సిబ్బంది పాత్ర ఉన్నట్లు సమాచారం

ఐదు నెలలు దాటుతున్నా విచారణ  పేరుతో కాలయాపన

కలెక్టర్‌ ఆదేశించినా పట్టించుకోని వైనం




సాక్షి, గుంటూరు: స్థానిక నగరపాలక సంస్థలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది కలిసి పింఛన్లు కాజేశారు. 147 మందికి సంబంధించి సుమారు రూ. 3.50 లక్షలు వారికి ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రాసుకుని జేబులో వేసుకున్నారు. దీనిపై డీఆర్‌డీఏ అధికారులు విచారణ జరిపారు. ఇందులో టీసీఎస్‌ నుంచి టెక్నికల్‌ కో–ఆర్డినేటర్‌గా ఉన్న గోపి అనే వ్యక్తి సహకారంతో నగరపాలక సంస్థకు చెందిన రెవెన్యూలో కొందరు అధికారులు, ఉపాసెల్‌లోని సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అప్పటి కమిషనర్‌ నాగలక్ష్మికి లేఖ రాశారు. సీరియస్‌గా తీసుకున్న ఆమె క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని ఆదేశించారు. అయితే 25 రోజుల తర్వాత లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి నిందితులు ఎవరో చెబితే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.



కమిషనర్‌ నాగలక్ష్మి బదిలీతో..

అనంతరం కమిషనర్‌ నాగలక్ష్మి బదిలీ కావడంతో ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కనీసం కమిషనర్‌ అథంటికేషన్‌ మార్చి పింఛన్‌ డబ్బులు కాజేసిన గోపిపై టీసీఎస్‌కు ఫిర్యాదు కూడా చేయకపోవడంతో డీఆర్‌డీఏ అధికారులే ఆ పని కూడా చేశారు. దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిన కలెక్టర్‌ పింఛను కాజేసిన వ్యవహారంపై ఆరా తీయడంతోపాటు విచారణ ఎంత వరకు వచ్చిందంటూ కార్పొరేషన్‌ అధికారులను వివరణ కోరారు. దీంతో డీసీ –2ను విచారణ అధికారిగా నియమించామంటూ కలెక్టర్‌కు సమాధానం ఇచ్చారు.



ఐదు నెలలు గడిచినా..

సంఘటన జరిగి ఐదు నెలలు దాటుతున్నా ఇంత వరకు విచారణ పూర్తి కాలేదు.  జిల్లాలో పింఛను డబ్బులు పంచే అధికారులకు ఎంపీడీవోలు చెక్కు ఇస్తుంటారు. కార్పొరేషన్‌లో మాత్రం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పింఛన్‌ పంపిణీ చేస్తారు. వీరికి రెవెన్యూ అధికారులు నేరుగా డబ్బులు ఇచ్చి, మిగిలిన డబ్బులు తిరిగి తీసుకుంటారు. ఇక్కడ పింఛన్‌ గోల్‌మాల్‌లో నగరపాలక సంస్థకు చెందిన ముగ్గురు ఆర్‌ఐలు, పది మందికిపైగా ఉపాసెల్‌ సిబ్బంది పాత్ర ఉన్నట్లు సమాచారం.



రాజకీయ పైరవీలు

అక్రమార్కులు హైదరాబాద్‌ వెళ్లి సర్వర్‌లో తమ పేరు తొలగించుకొనేందుకు ప్రయత్నించినా కుదరలేదని దీంతో విచారణలో తమ పేర్లు రాకుండా అధికార పార్టీ నేతల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిసింది.  



విచారణ వేగవంతం చేస్తాం: కమిషనర్‌ అనూరాధ

పింఛన్‌ గోల్‌మాల్‌ వ్యవహారంలో విచారణ వేగవంతం చేస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులు తేలితే ఉపేక్షించబోం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top