రారండోయ్‌.. జాతర చూద్దాం..


  • నేటి నుంచి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర

  • 37 రోజుల పాటు నిర్వహణ

  • పూర్తయిన ఏర్పాట్లు

  • పెద్దాపురం :

    కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఏటా 37 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. 

    చింతపల్లి వారి ఆడపడుచుగా..

    మరిడమ్మ అమ్మవారు సామర్లకోట చింతపల్లి వారి ఆడపడుచు. ఇప్పటికీ ఆ వారుసులే ఇక్కడ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. వారి కుల దేవతగా పెద్దాపురం పట్టణంలో వెలసి స్థానిక ప్రజలనే కాకుండా యావత్‌ ఆంధ్రావనిని సంరక్షిస్తున్న వరదేవతగా ప్రఖ్యాతి గాంచింది.  ఏటా ఆషాఢమాసంలో 37 రోజుల పాటు జాతరను జరపడం ఆనవాయితీగా వస్తోంది.

     

    వారానికో వీధి సంబంరం:

    గ్రామ దేవతగా ఆరాధించే పెద్దాపురం పట్టణంలో ఆయా వీధుల వారు అమ్మవారి సంబరాలను నిర్వహించడం ఆనవాయితీ. రూ.లక్షలు వెచ్చించి అమ్మవారి సంబంరం నిర్వహిస్తుంటారు. ఆ వీధిలో ఆరంభమయ్యే సంబరంలో మరిడమ్మ అమ్మవారిని ఊరేగిస్తూ పలు దేవతామూర్తుల వేషధారణలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధానంగా చాపలవీధి, కుమ్మరవీధి, పాశిలివీ«ధి, కొత్తపేట, రామారావుపేట, బంగారమ్మ గుడివీధి తదితర వీధుల్లో అమ్మవారి సంబరాలు నిర్వహిస్తారు.

    ఆషాఢంలో నూతన దంపతులు రాక:

    వివాహమైన నూతన దంపతులు పెద్దాపురం అమ్మవారిని దర్శి«ంచుకుంటారు. ఆషాఢమాసమంతా ఇక్కడే తీరునాళ్లు జరుపుతుంటడడంతో సతీమణి, మరదళ్లు, బావమరుదులతో ఇక్కడకు వచ్చి తీర్థంలో సరదాగా గడుపుతుంటారు.

    నేడు జాగరణ

    ఏటా ఆషాఢమాసం ఆరంభంలో నిర్వహించే మరిడమ్మ అమ్మవారి జాగరణ మహోత్సవం నేటి రాత్రి ప్రారంభం కానుంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆలయ ట్రస్టీ చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.పుష్పనాథం, ధర్మకర్తల ఆధ్వర్యంలో ప్రారంభయ్యే జాతరను రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజులు ప్రారంభిస్తారు. ఆలయాన్ని దేవాదాయ శాఖాధికారు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రాత్రికి అమ్మవారి ఊరేగింపుతో పాటు వేకువ జామువరకు గరగల నృత్యం, భారీ మందుగుండు సామగ్రి పేలుడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అసిస్టెంట్‌ కమిషనర్‌ పుష్పనాథం విజ్ఞప్తి చేశారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top