హోదా మా హక్కు... ఇచ్చి తీరాల్సిందే

హోదా మా హక్కు... ఇచ్చి తీరాల్సిందే - Sakshi


తిరుపతి సభలో పవన్ కల్యాణ్

సెప్టెంబరు 9న కాకినాడలో తొలి సభ

పదేపదే సీఎం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడితే ఎలా?

ఏ లొసుగులూ లేకపోతే హోదా కోసం ఎందుకు పోరాడరు?

వెంకయ్య గారూ జాతి ప్రయోజనాలను దెబ్బతీయొద్దు

కాంగ్రెస్, బీజేపీల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తిన పవన్

ఎంపీలు, కేంద్ర మంత్రులపైనా ఘాటు విమర్శలు




సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘ప్రత్యేక హోదా మా హక్కు. ఇచ్చి తీరాలి. మేం అడుక్కునే వాళ్లం కాదు. ఇకపై అరిగిపోయిన కథలు చెప్పొద్దు. అలసి పోయాం... విసిగిపోయాం. పోరాడతాం... హోదా సాధించే వరకూ ఉద్యమిస్తాం. ఇకపై జనసేన ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది’’ అని జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హోదా సాధన ఉద్యమంలో భాగంగా  జనసేన పార్టీ సెప్టెంబరు 9న కాకినాడలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తుందన్నారు.



ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివచ్చే వరకూ తొలి దశలో అన్ని జిల్లాల్లో సభలు నిర్వహిస్తామని, తర్వాత ఎంపీలపై వత్తిడి చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. సాయంత్రం 4.15 గంటలకు వేదికపైకొచ్చిన పవన్ కల్యాణ్ సరిగ్గా 5.15 కి ప్రసంగాన్ని ముగించి వెళ్లారు. పవన్ కల్యాణ్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

 

నిజజీవితంలో అన్నీ సాధ్యం కావు...

‘‘నాకు రాజకీయాలపై వ్యామోహం లేదు. మీరిచ్చే ప్రేమ చాలు. కోట్లు సంపాదిస్తున్నా. కోట్లు ట్యాక్సులు కడుతున్నా. సుఖంగా ఇంట్లో కూర్చోవచ్చు. అయితే సమాజం, దేశం మీద వ్యామోహం, వ్యథ వుంది. సినిమాలు తీసి రెండుగంటల్లో అద్భుతాలు చెప్పొచ్చు. ఆస్తు లు దానం చేయొచ్చు. అన్యాయాలను ఎదుర్కొవచ్చు. కానీ... నిజజీవితంలో అవన్నీ సాధ్యం కావు. తిరుపతిలోనే ఎందుకు సభ పెట్టానంటే...2014 ఎన్నికలపుడు ప్రధాని మోదీ, సీఎం, నేను తిరుపతిలోనే హోదా హామీ ఇచ్చాం గనుక. మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాను. నాది భజనసేన అన్నారు.



నేను మోదీకి భజన చేయను. ప్రధాని మోదీని ప్రమాణ స్వీకారం నాడు కలిశా. మళ్లీ ఇప్పటి దాకా కల వలేదు. నాలుగు నెలల తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ వచ్చినపుడు బీజేపీలో చేరమంటే చేరనన్నాను. సినిమాలను వినోదం కోసం చూడండి. వేరే హీరోలు నాతో బాగానే ఉంటారు. క్షణికావేశంలో మీ జీవితాలను పాడుచేసుకోవద్దు. నా అభిమాని వినోద్ రాయల్ హత్య బాధించింది.

 

సీమాంధ్రులంటే పౌరుషం లేని వాళ్లా..??

హోదా విషయంలో కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సీమాంధ్రులంటే పౌరుషం లేని వాళ్లా? కాంగ్రెస్, బీజేపీలు సీమాంధ్రుల ప్రేమ, సహనాన్ని చూశాయి. ఇచ్చిన మాట తప్పితే పోరాట పటిమ, పౌరుషాన్ని చూస్తా రు. హోదా విషయంలో కాంగ్రెస్ మాత్రమే కాదు..బీజేపీ కూడా త ప్పు చేసింది. గెలుపొం దిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా రు. అంతా పార్లమెంటులో పోరాటం చేయలేరా? ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీలు సోని యా దగ్గర మేడం ప్లీజ్ ప్లీజ్ అంటే...నేడేమో బీజేపీ, టీడీపీ ఎంపీలు సార్...సార్ అంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడ్తున్నారు.  

 

మూడు దశల్లో పోరాటం...

హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేస్తాం. మొదటి దశలో భాగంగా సెప్టెంబరు 9న కాకినాడలో తొలి సభ. తర్వాత అన్ని జిల్లా కేంద్రాలలో సభలు నిర్వహిస్తాం. రెండో దశలో ఎంపీలపై ఒత్తిడి తెస్తాం. అప్పటికీ ఆలోచించకపోతే ప్రజల సహకారంతో రోడ్డు మీదకొస్తాను. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయవు. నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ సందర్భంగా టీడీపీకి ఓ సూచన. సీఎం కష్టపడుతున్నారు. నేననే మాట సీఎం గారు సూచనగానే తీసుకోవాలి. కేంద్రంతో పోరాటం వద్దని సీఎం అంటున్నారు.



కానీ పదేపదే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టడం సరికాదనిపిస్తోంది. అరుణ్‌జైట్లీ, వెంకయ్య మాట్లాడుతుంటే అసహనం కలుగుతోంది. రాష్ట్రానికి హోదాతో పనేందని వెంకయ్య అంటున్నారు. వెంకయ్య గారూ తప్పు చేస్తున్నారు. మీరు తెలుగువారు. జాతి ప్రయోజనాల కోసం పోరాడండి. జైట్లీగారూ... మేం అడుక్కునే వాళ్లం కాదు. హోదా మా హక్కు. ఇచ్చి తీరాలి. ఈ అంశాన్ని పక్కకు లాగేందుకు గో సంరక్షణ అంశాన్ని తెరమీదకు తేవద్దు. గోవుల్ని రక్షించాలని మీకనిపిస్తే ఎంపీలందరినీ తలా ఒక గోవును పెంచుకోమనండి. హోదా సాధన విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే మాట మాట్లాడాలి.

 

లొసుగులు లేనప్పుడు ఎందుకు భయం.. ??

ఏపీకి హోదా గురించి మాట్లాడినప్పుడల్లా ముగ్గురు సీఎంలు అడ్డుపడుతున్నారంటున్నారు. ఆరుకోట్ల మంది అడ్డు చెబితే ఆగని రాష్ట్ర విభజన ముగ్గురు సీఎంలు అడ్డుచెబితే హోదా ఆగడమెందుకు? ఎవరి చెవిలో పూలు పెడతారండీ?? అయినా కేంద్రం అంటే ఎందుకంత భయం? అదేం బ్రహ్మరాక్షసి కాదే. ఏ లొసుగులూ లేకపోతే సీఎం ఎందుకు హోదా కోసం పోరాటం చేయరు? సీబీఐ కేసులంటారు...దాచుకోడానికేమైనా ఉన్నాయా...ఏమీ లేనప్పుడు ఎందుకంత భయం.



పార్లమెంటును స్తంభింపజేయండి. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు తుమ్మితే ఊడిపోయే పదవిని పట్టుకుని వేలాడ్డం ఎందుకు? ఢిల్లీలో మన ఎంపీలకు హిందీ రాదు. క్లాసులన్నా తీసుకోవాలి. కేంద్రం కూడా ఒక్కటి ఆలోచించాలి. రాష్ట్రంలోని కేశినేని నాని, మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌లనో, లేక మంత్రి నారాయణనో చూసి వీరికి హోదా అక్కర్లేదనుకోవవద్దు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను చూడండి. ఆఖరి మాటగా చెబుతున్నా. ఇకపై పోరాడతాం .’ అని పవన్ ప్రసంగాన్ని ముగించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top