పాస్‌పోర్ట్‌ పాపం ఎవరిది..!

పాస్‌పోర్ట్‌ పాపం ఎవరిది..! - Sakshi


సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘకాలం తర్వాత 2008లో అరెస్టయిన గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్నాడు... అప్పటికే న్యాయవాది మన్నర్‌ ఘోరీ హత్య కేసులో అతడికి శిక్ష సైతం పడింది... 2010 జులైలో ములాఖత్‌లో అతడిని కలిసిన భార్య హఫీజ్‌బేగం తనకు, పిల్లలకు పాస్‌పోర్టులు జారీ అయినట్లు చెప్పింది... బెయిల్‌పై వచ్చిన వెంటనే కుటుంబంతో సహా దేశం దాటి వెళ్ళిపోవాలని కుట్రపన్నిన అయూబ్‌ఖాన్‌ బోగస్‌ వివరాలతో పాస్‌పోర్ట్‌ పొందడానికి పథకరచన చేశాడు... భార్య, బంధువుల సహకారంతో ‘అన్నీ ఏర్పాటు కావడంతో’ జైల్లో ఉండగానే అతడికి పాస్‌పోర్ట్‌ వచ్చేసింది... 2014 ఏప్రిల్‌ 11న బయటకు వచ్చిన అయూబ్‌ఖాన్‌ దీని ఆధారంగా దుబాయ్‌ పారిపోయాడు. పోలీసు, పాస్‌పోర్ట్, పోస్టల్‌ శాఖలతో ముడిపడి ఉన్న ఈ పాస్‌పోర్ట్‌ ఎపిసోడ్‌లో అసలు విలన్లు ఎవరనేది మిస్టరీగా మారింది. ఈ కేసుకు సంబందించి దక్షిణ మండల పోలీసులు మంగళవారం న్యాయవాది సహా నలుగురిని అరెస్టు చేశారు.



చిరునామాతో పాటు తండ్రి పేరు ‘మార్చేశాడు’...

అయూబ్‌ఖాన్‌ నివాసం వాస్తవానికి పాతబస్తీలోని కుమ్మరివాడిలో ఉంది. అయితే నేరచరితుడైన, ఓ కేసులో శిక్షపడిన అయూబ్‌ తన వ్యవహారాలు వెలుగులోకి రాకూడదనే ఉద్దేశంతో తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ కోసం తన చిరునామాను గోల్కొండ ఠాణా పరిధిలోని టోలిచౌకి బడా బజార్‌గా పేర్కొంటూ దళారుల సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. ఇందులో తన పేరును అయూబ్‌ఖాన్‌గానే పేర్కొన్నప్పటికీ తండ్రి పేరును జహంగీర్‌ ఖాన్‌కు బదులుగా షంషుద్దీన్‌ఖాన్‌గా రాయించాడు. అయూబ్‌ జైల్లో ఉండే తన భార్య హఫీజ్‌బేగం సహకారంతో బయటి కథ నడిపాడు. ఇలా మొత్తం మూడు నకిలీ «ధ్రువీకరణపత్రాలు సృష్టించిన ‘అయూబ్‌ అండ్‌ కో’ వీటి ఆధారంగా తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ కోసం సికింద్రాబాద్‌లోని రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో 2010లో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారంలో  అయూబ్‌ఖాన్‌న్‌  భార్యతో పాటు ఖలీల్, ఖాజీ సయ్యద్‌ ముక్తాధీర్‌ అలీ ఖాద్రీ, డిప్యూటీ ఖాజీ మహ్మద్‌ నసీరుద్దీన్, నోటరీ అడ్వొకేట్‌ పొట్టెం రవీందర్‌నాథ్‌లతో పాటు పాస్‌పోర్టు కార్యాలయం అధికారి వెంకట్, మహ్మద్‌ జాఫర్‌ పాత్రధారులుగా ఉన్నారు.



మిస్టరీలు ఎన్నో...

నిబంధనల ప్రకారం తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేయడానికి ఏవైనా మూడు ధ్రువీకరణలతో పాటు కచ్చితంగా వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ జత చేయాల్సిందే. ఐఏఎస్, ఐపీఎస్‌ సహా ఏదైనా ఆలిండియా సర్వీసుకు చెందిన అధికారి దీన్ని జారీ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసే వ్యక్తి స్వయంగా పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో అయూబ్‌ఖాన్‌ చర్లపల్లి ఖైదీగా ఉండటంతో రెండు అంశాలు అంతుచిక్కట్లేదు. తత్కాల్‌ విధానంలో పాస్‌పోర్ట్‌ జారీ అయిన తర్వాత పోలీసు వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇందులో ఏదైనా తేడాలు తెలిస్తే తక్షణం పాస్‌పోర్ట్‌ కార్యాలయం జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను బ్లాక్‌లిస్ట్‌ చేస్తూ రద్దు చేస్తుంది. తాము రెండుసార్లు వెరిఫై చేసి నెగెటివ్‌ రిపోర్ట్‌ ఇచ్చామని పోలీసులు పేర్కొంటుండగా మరి తేడా ఎక్కడ జరిగిందనేది అంతు చిక్కట్లేదు.



‘అడ్రస్‌’ లేకున్నా డెలివరీ...

ఈ ‘అవాంతరాలను’ అధిగమించిన అయూబ్‌ఖాన్‌ పాస్‌పోర్ట్‌ రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి జారీ అయిపోయింది. సాధారణంగా పాస్‌పోర్ట్స్‌ను దరఖాస్తులో ఉన్న చిరునామాకు పంపిస్తారు. దీన్ని పోస్టల్‌ అధికారులు కచ్చితంగా అదే చిరునామాలో, పాస్‌పోర్ట్‌ ఎవరి పేరున జారీ అయితే వారికే అందించాల్సి ఉంటుంది. అయూబ్‌ఖాన్‌ కారాగారవాసం చేస్తున్నా... పాస్‌పోర్ట్‌ బోగస్‌ చిరునామాలో డెలివరీ అయింది. ఇందులో పోస్టల్‌ ఉద్యోగుల నిర్లక్ష్యం/పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో గ్రాంటిగ్‌ అధికారిగా పని చేస్తున్న వెంకట్‌ సహాయసహకారాల అందించడంతో అయూబ్‌ఖాన్‌ పాస్‌పోర్ట్‌ బయటకు వచ్చిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని  కోసం గాలిస్తున్నారు. మరోపక్క దుబాయ్‌ కేంద్రంగా అయూబ్‌ఖాన్‌ మరో వ్యక్తితో కలిసి భారీగా బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అయూబ్‌ఖాన్‌ ఆస్తుల పైనా కన్నేసిన దక్షిణ మండల అధికారులు వాటి వివరాలూ దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top