మెదక్ జిల్లాలో బంద్ పాక్షికం..ఉద్రిక్తం


- ముంపు గ్రామాల చుట్టూ పోలీసు వలయం

- పోలీసుల ఆధీనంలోరాజీవ్ రహదారి

- కార్లు, బస్సుల్లో తనిఖీలు

- జాతీయ రహదారి మీదనే కోదండరాం అరెస్టు

- గ జ్వేల్‌లో దామోదర్, సునీతారెడ్డి, రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

- సిద్దిపేట, ఆందోల్‌లో మల్లన్నసాగర్ కట్టాలంటూ ప్రతి ర్యాలీలు



సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి


 మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జికి నిరసనగా సోమవారం వివిధ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా బంద్ పాక్షికంగా జరిగింది. తూర్పు మెదక్ జిల్లా ప్రాంతంలోనే కొంత మేరకు బంద్ ప్రభావం కనిపించింది. ముందస్తుగానే ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మొహరించటంతో సర్వత్రా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జిల్లా సరిహద్దు ప్రాంతం ఒంటిమామిడి నుంచి కుకునూర్‌పల్లి వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


 


రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి, మెదక్ జిల్లా ఒంటిమామిడి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసు బలగాలను మొహరించారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో చెక్‌పోస్టు పహారా ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి చెక్‌పోస్టు వద్దనే అరెస్టు చేసి జిన్నారం మండలం బొల్లారం పోలీసుస్ట్టేషన్‌కు తరలించారు.


 


కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్‌రాజనర్సింహ, సునీతారెడ్డి, శ్రావణ్, అద్దంకి దయాకర్, టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, రఘునందన్‌రావును గజ్వేల్ పట్టణంలో వేర్వేరు సమయాల్లో అరెస్టు చేసి తూప్రాన్, హైదరాబాద్‌లోని ఇతర పోలీసుస్టేషన్లకు తరలించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డిని, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్కను కుకునూర్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారిని సొంత పూచీకత్తుపై వదిలారు.




పోలీసు వలయంలో ముంపు పల్లెలు

వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, సింగారం, బంజేరుపల్లి తదితర ముంపు గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. బయటి వ్యక్తులు ఊర్లోకి, ఊరి వ్యక్తులు బయటికి వెళ్లకుండా దిగ్బంధించారు. పోలీసు చర్యలకు నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లలోనే ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎప్పుడేఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి పల్లెల్లో నెలకొని ఉంది.




సిద్దిపేట, ఆందోల్‌లో ప్రతి ర్యాలీలు

ఆందోల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కొందరు రైతులు మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేసి సింగూరును నింపాలని నినాదాలు చేస్తూ ఎంపీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇచ్చారు. దీంతో పట్టణంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్‌ను విజయంవంతం చేయాలని కోరుతూ దుకాణాలు మూసివేయించగా...వారి వెనకే టీఆర్‌ఎస్ శ్రేణులు వెళ్లి మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ దుకాణాలు తెరిపించాయి. గజ్వేల్ పట్టణంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యరక్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top