పాపం పద్మ!

పాపం పద్మ!

వీడని అత్తింటి వివక్ష

పోరాడుతున్నా కనికరించని వైనం

తల్లీబిడ్డలను పట్టించుకోని కుటుంబం  

 

 దేవరపల్లి : అమ్మాయి పుట్టిందన్న సాకుతో భర్త, అత్తమామలు చూపుతున్న వివక్షపై పోరాడుతున్న ఆ తల్లికి మోక్షం కలగడం లేదు. పోలీసు కేసు నమోదై బాధితురాలికి మహిళా సంఘాలు, న్యాయస్థానం అండగా నిలిచినా ఆ కుటుంబం మాత్రం కనికరం చూపడం లేదు. మూడు రోజులుగా వర్షం పసిబిడ్డతో తడుస్తూ వారి ఇంటి ముందే ఎదురుచూస్తున్న ఆమెను చూసి గ్రామస్తులు చలించిపోయారు. శనివారం సర్పంచ్‌ సాయంతో ఆమె అత్తింటి తలుపు తెరిచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. అయితే తానకు, బిడ్డకు పోషణ ఎలా అని ఆ తల్లి రోదిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. ద్వారకాతిరుమల మండలంలోని మలసానికుంటలో ఆడబిడ్డ పుట్టిందని గురజాల పద్మను భర్త సత్యనారాయణ, అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులు పట్టించుకోకుండా అదే గ్రామంలోని తమ పొలంలోని ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే.



పద్మ అత్తింటి ముందు ఈనెల 5 నుంచి మౌనపోరాటం చేస్తుండగా 9న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా న్యాయమూర్తి గంధం సునీత సైతం స్పందించడంతో ఈనెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్టేషన్‌లో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. పద్మకు మహిళా సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి, మహిళా ఛైతన్య సమాఖ్య సంఘాలు అండగా నిలిచాయి. భర్త, అత్తమామలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆమెను వారికి అప్పగించారు. ఇంత జరిగినా అయితే అత్తింటి వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్లీ పద్మను ఇంటిబయటే వదిలేసి, వారంతా పొలంలోని ఇంటికి వెళ్లిపోయారు.



పద్మ మాత్రం తన బిడ్డతో ఇంటి బయటే మౌనపోరాటం చేస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆరుబయట పసిపాపతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పద్మను చూసి చలించిన స్థానికులు గ్రామ సర్పంచ్‌ బత్తుల విజయశేఖర్‌కు విషయాన్ని తెలిపారు. దీంతో ఆయన, పలువురు పెద్దలు వారి ఇంటికి చేరుకుని, ఇంటి తలుపులు తెరచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని పద్మ వేడుకుంటోంది.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top