కాంగ్రెస్‌లో పొత్తుల పంచాయితీ

కాంగ్రెస్‌లో పొత్తుల పంచాయితీ - Sakshi


సాక్షి, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో శాసన మండలికి జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో జిల్లా నేతల మధ్య పంచాయితీలకు తెరలేపుతున్నాయి. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఒక జిల్లా నేతలు కోరుకుంటుండగా... అధికార పార్టీతో ప్రధాన ప్రతిపక్షం ఎలా జతకడుతుందని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, వామపక్షాలతో సర్దుకుందామని ఒక నేత వాదిస్తే... సర్దుకుపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఏముంటుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పొత్తులపై ఎవరికివారే చర్చలు జరుపుతూ, ఎవరికివారే మాట్లాడితే పార్టీ రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలుగుతుందంటూ కొందరు నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర పార్టీ ముఖ్యులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీని అధిష్టానం పెద్దలు ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు కూడా. అయితే రాష్ట్ర నేతలతో చర్చించిన తరువాత అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. టీపీసీసీ సమన్వయ కమిటీలోనే చర్చించుకుని, ఒక నిర్ణయానికి రావాలని సూచించింది.



 జిల్లా స్థాయిలో అవగాహనే...

 పొత్తులపై రాష్ట్ర స్థాయిలో నిర్దిషంగా ఒక విధానాన్ని ప్రకటించడానికి టీపీసీసీ వెనుకాడుతోంది. ఒక్కొక్క జిల్లాలో పరిస్థితి ఒక్కోలా ఉండటంతో... జిల్లాల వారీగా, అవకాశం మేరకు లోపాయికారీ సర్దుబాట్లకు అనుమతించాలని భావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌తో అవగాహనకు సిద్ధమేనని ఆ జిల్లా నేతలు ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డితో సహా డీకే అరుణ, జి.చిన్నారెడ్డి వంటి అగ్రనేతలంతా సమావేశమై టీఆర్‌ఎస్‌తోనైనా, టీడీపీతోనైనా అవగాహనకు సిద్ధమేనని పార్టీ సమావేశంలో నిర్ణయించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఒక స్థానం వస్తుందని, దానికోసం ఎవరు కలసి వచ్చినా అభ్యంతరం లేదని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో భిన్నమైన పరిస్థితి ఉంది. సీపీఐతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీకి ఎలా విడిచిపెడతారని ఖమ్మం జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు.



అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశ్యమని ఆ జిల్లాకు చెందిన మల్లు భట్టివిక్రమార్క హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షంగా టీడీపీ బలపడడానికి అవకాశమిస్తే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎలా బలపడుతుందని అదే జిల్లాకు చెందిన ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో టీడీపీతో కలిస్తే కాంగ్రెస్‌కు ఒక స్థానం దక్కుతుంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ప్రకటిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిల సొంత జిల్లా నల్లగొండలో మరో రకమైన పరిస్థితి ఉంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి.



కానీ చాలా మంది స్థానిక సంస్థల ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. దాంతో ఇప్పుడా జిల్లాలో ఎవరి బలం ఎంతో తేలని గందరగోళ పరిస్థితి. అయితే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన తన చిరకాల ప్రత్యర్థి చిన్నపరెడ్డి ఎన్నికకాకుండా అడ్డుకోవడానికి జానారెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా అంతర్గత సర్దుబాట్లకు అవకాశమిచ్చి, టీపీసీసీ స్థాయిలో జోక్యం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 

 అర్థవంతమైన పొత్తులే మేలు: ఎమ్మెల్సీ పొంగులేటి

 ఒకవేళ పొత్తులు ఉంటే అర్థవంతంగా, భవిష్యత్తులో పార్టీకి నష్టం లేకుండా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. పొత్తులపై స్పష్టమైన నిర్ణయం జరిగేదాకా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడటం మంచిదికాదన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top