పంచాంగాల్లో ఏకీకరణ అవసరం


  • ఆ దిశలో తొలి అడుగుగా రేపు రాష్ట్రస్థాయి సదస్సు

  • విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం కార్యదర్శి మధుర ఫాలశంకరశర్మ

  • రాజమహేంద్రవరం కల్చరల్‌ : 

    ‘మనం జరుపుకొనే పండుగలు, సంక్రమణాలు, చివరకు పుష్కరాలకు సైతం పంచాంగకర్తలు విభిన్న తేదీలను సూచించడం ప్రజలను అయోమయానికి గురి చేసే ఆస్కారం ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి  రాజమహేంద్రవరం జాంపేటలోని ఉమా రామలింగేశ్వర కల్యాణమండపంలో ఈ నెల 22న  జరిగే సదస్సు తొలిమెట్టు కావాలని భావిస్తున్నా’నని జ్యోతిష విజ్ఞాన భాస్కర, మహామహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తి శాస్త్రి తనయుడు, విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం కార్యదర్శి ఫాలశంకర శర్మ అన్నారు. సదస్సు నేపథ్యంలో శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నేటి గందరగోళ పరిస్థితులకు కారణాలు, సమన్వయం సాధించడానికి చేస్తున్న కృషిని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే....

    మరో వరాహమిహిరుడు రావాలి..

    పంచాంగకర్తల మధ్య ఏకీకరణకు నా తండ్రి కృష్ణమూర్తి శాస్త్రి తుదివరకూ తపన పడ్డారు. ఆదివారం జరిగే సదస్సుతో ఏకీకరణకు చేరుకుంటామని ఆశించడం అత్యాశ అవుతుంది. అయితే, జ్యోతిష రంగంలో మరిన్ని పరిశోధనలకు ఈ సదస్సు ఆస్కారం కలిగిస్తుందని అనుకుంటున్నాను. సంస్కరణలు మహర్షులు, ప్రవక్తలు, పండితులతోనే ప్రారంభమయ్యాయి. ఉదాహరణగా రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆదిశంకరులను పేర్కొనవచ్చును. వారి పేరిట అనుయాయులు ఆ ప్రవక్తల సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. పూర్తిస్థాయి ఏకీకరణకు మరో వరాహమిహిరుడు రావాలి. అయితే, ప్రయత్నం అంటూ ఒకటి ప్రారంభం కావాలి, ప్రజలను చైతన్యవంతులను చేయాలి, చివరికి వారే న్యాయనిర్ణేతలు కావాలి.

    విభేదాలకు కారణాలు ఇవీ...

    భారత తొలిప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పంచాంగాలలో ఏకీకరణ సాధనకు కేలండర్‌ రిఫారŠమ్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంచాంగరచనలో నిపుణులు ఎవరూ లేరు. క్రీ.శ. 499–505 మధ్యకాలంలో వరాహమిహిరుడు అయనాలు మారతాయని, మార్పులకు అనుగుణంగా పంచాంగరచనల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. నెహ్రూ నియమించిన కమిటీ సభ్యులు మార్పులు చేయడం శ్రమదమాదులతో కూడిన పనిగా భావించి   పక్కన పెట్టారు. ఈ విషయం కమిటీ రిపోర్టులోనే ఉంది. సూర్యగమనంలో మార్పులను వారు పరిగణనలోకి తీసుకోలేదు. కమిటీ సూచనలకు అనుగుణంగానే రూపొందుతున్న పంచాంగాలనే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. కర్మలు సరైన సమయంలో చేసినప్పుడే ఫలమంతమవుతాయి. తప్పుడు సమయాల్లో చేస్తే, ఆశించిన ఫలితాలు రావు.  

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top