విభజనకు ముందే పాలమూరు, డిండి

విభజనకు ముందే పాలమూరు, డిండి - Sakshi


♦ జీవోలు సైతం వెలువడ్డాయి

♦ శాసనసభలో స్పష్టం చేసిన మంత్రి హరీశ్‌రావు

♦ పట్టిసీమను అనుమతులు లేకుండా చేపట్టారు

♦ దత్తత తీసుకున్న పాలమూరుకు చంద్రబాబు ఏం చేయలేదు

♦ కేంద్రానికి రాసిన లేఖను బాబు వెనక్కి తీసుకోవాలి

 

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో తమకున్న వాస్తవ కేటాయింపుల్లో నుంచే నీటిని వాడుకుంటూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. వీటిని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని.. ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు సైతం వెలువడ్డాయని స్పష్టంచేశారు. ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును మాత్రం విభజన అనంతరం కొత్తగా చేపట్టారని, దీనికి గతంలో ఎలాంటి అనుమతులు, జీవోలు లేవని ఆయన బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. అన్ని అనుమతులు ఉన్న పాలమూరు, డిండి చేపడితే అక్రమం, ఏ అనుమతులు లేని పట్టిసీమ చేపడితే సక్రమమా? అని ప్రశ్నించారు.



పట్టిసీమపై కచ్చితంగా బోర్డుకు తెలియజేయాల్సి ఉన్నా ఏపీ ఆ పని చేయకపోగా, అన్ని అనుమతులున్న రాష్ట్రాన్ని తప్పుపడుతోందన్నారు. శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కృష్ణాలో 70 టీఎంసీలను వాడుకుంటూ చేపట్టనున్న పాల మూరు ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక రూపొం దించాలంటూ 2013లోనే జీవో 72 ఇవ్వగా, అదే కృష్ణాలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారని గుర్తుచేశారు.



నిజానికి కృష్ణా జలాల్లో బచావత్ అవార్డు మేరకు ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయని, అయితే అందులో 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామన్నారు. మరిన్ని కేటాయింపుల కోసం ట్రిబ్యునల్, కోర్టుల ముందు కొట్లాడుతున్నామని, భవిష్యత్‌లో రాష్ట్రానికి మరిన్ని కేటాయింపులు వచ్చే అవకాశం ఉందన్నారు. బచావత్ ఆదేశాల మేరకు పట్టిసీమ నుంచి నీటిని తీసుకుంటే 45 టీఎంసీల మేర రాష్ట్రానికి హక్కు లభిస్తుందని చెప్పారు. రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.



 బాబును టీడీపీ నేతలు నిలదీయాలి

 గతంలో మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా ప్రగతికి ఏమీ చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం కరువు జిల్లాలకు నీరివ్వాలని ప్రయత్నిస్తుంటే బాబు కేంద్రానికి లేఖలు రాస్తూ అడ్డుకునే యత్నం చేస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు. రైతు ఆత్మహత్యలపై ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు బాబు కుట్రలపై స్పందించాలని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్న తీరుపై నిలదీయాలని హితవు పలికారు. జిల్లా అభివృద్ధిని నిజంగా కోరుకుంటే బాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిండి ద్వారా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు నీరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top