ఇకపై.. పలమనేరు ఫైనాపిల్‌!

ఇకపై.. పలమనేరు ఫైనాపిల్‌!


ఇకపై.. పలమనేరు ఫైనాపిల్‌!



– వినూత్నంగా ఫైనాపిల్‌ను సాగుచేసిన రైతు

– మంచి పంటతోపాటు భారీ దిగుబడి

 పలమనేరు: ఫైనాపిల్‌.. సాధారణంగా మనజిల్లా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అయితే ఇకపై అదికూడా సుపరిచితం కానుంది. వీటిని ప్రయోగాత్మకంగా సాగుచేస్తే మంచి దిగుబడి సాధించవచ్చని నిరూపించాడో యువరైతు. రెండేళ్ల క్రితం తన మామిడి తోటలో అంతరపంటగా నాటిన ఫైనాపిల్‌ ప్రస్తుతం మంచి దిగుబడితో కొతకొచ్చింది. దీంతో చుట్టుపక్కల రైతుల సైతం తాము కూడా ఫైనాపిల్‌ పంటను సాగుచేసేందుకు స్ఫూర్తినిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. పలమనేరు మండలంలోని సాకేవూరు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ నరసింహులు నాయుడు కుమారుడు శ్రీకాంత్‌ తన పొలంలో రెండేళ్ల క్రితం వరకు సాధారణ పంటలే వేసేవాడు. అయితే ఓసారి నెల్లిపట్ల సమీపంలోని తన బంధువుల పెరట్లో ఓ ఫైనాపిల్‌ మొక్కను చూసి తను కూడా సాగుచేయాలని భావించాడు. అక్కడే ఫైనాపిల్‌ మోసులను తెచ్చి కొద్దికొద్దిగా నాటుతూ ప్రస్తుతం అర్ధ ఎకరాలో పంటను సాగు చేశాడు. రెండేళ్ల క్రితం నాటిన పంట ప్రస్తుతం కోతకొచ్చింది. కేరళలో పండే స్థాయిలోనే దిగుబడి కూడా వచ్చింది. అయితే కేరళ ఫైనాఫిల్‌ కంటే ఎక్కువ నాణ్యత, రుచి ఉండడంతో వ్యాపారులు ఎగబడుతున్నారు. ఏడాదికోమారు జూన్, జూలైలో పంట దిగుబడులొస్తాయని చెబుతున్నాడు. ప్రస్తుతం ఉన్న మొక్కల పక్కన పుట్టే మోసులతో ఎకరా విస్తీర్ణంలో పంటను సాగుచేసేందుకు యువరైతు సన్నాహాలు చేస్తున్నాడు. కేరళ రాష్ట్రంలో పండే పంట ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకుని సాగవుతోందడంతో స్థానిక రైతుల్లోనూ ఈ పంటసాగుపై ఆసక్తి పెరిగింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు ఈ తోటను పరిశీలిస్తున్నారు. ఈ దఫా వచ్చిన ఫలసాయాన్ని బంధువులకు, స్నేహితులకు, కొంత వ్యాపారులకు విక్రయిస్తానని రైతు తెలిపాడు. ఏదేమైనా ఫైనాపిల్‌ను ఈ ప్రాంతంలో సాగుచేయొచ్చునని నిరూపించి ప్రశంసలందుకుంటున్నాడు.

ఓసారి ప్రయత్నిద్దామని వేశా..

మన ప్రాంతంలో ఫైనాపిల్‌ సాగువుతుందో..? లేదోననే అనుమానంతో అర్ధ ఎకరాదాకా పండించా. ప్రస్తుతం పంట దిగుబడి వచ్చింది. ఫైనాపిల్‌ భలే టేస్ట్‌గా ఉంది. ఈ దఫా మరో ఎకరా పంటసాగుకు ప్లాన్‌ చేస్తున్నా. ఇక్కడి ఎర్రమట్టి భూముల్లోని మామిడి తోపుల్లో పంట చక్కగా పండుతుందని తెలుసుకున్నా. రాబోవు రోజుల్లో స్థానికంగా ఫైనాపిల్‌ విరివిగా పండే రోజులు వస్తాయి.

– శ్రీకాంత్, రైతు, సాకేవూరు



మామిడి తోపుల్లో పండించవచ్చు

మామూలుగా తీర ప్రాంతాల్లో ఫైనాపిల్‌ ఎక్కువగా సాగవుతుంది. దీనికి గాలిలోతేమశాతం (హ్యుమిడిటీ) 60 నుంచి 80 శాతం వరకు ఉండాలి. జిల్లాలోనే పలమనేరు చల్లటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఫైనాపిల్‌ను సాగుచేసుకోవచ్చు. ముఖ్యంగా తోటల కింద 50 శాతం షేడింగ్‌లో పంటను సాగుచేయాలి.

 – సుభాహనీ, హార్టికల్చర్‌ ఏడీ, పలమనేరు





 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top