చివరికి పెరిగింది


భీమవరం/పెరవలి : ధాన్యం ధర అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం మిల్లర్లు ఏ–గ్రేడ్‌ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,200 పైగా చెల్లిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు బస్తా రూ.950 మాత్రమే పలికిన ధర అమాంతం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ.. పంట చేతికి వస్తున్న తరుణంలో వాతావరణం అనుకూలించింది. దిగుబడులు పెరగటం.. ఇప్పుడు ధాన్యం ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఎంతోకొంత కోలుకునే పరిస్థితి కనిపిస్తోంది. దాళ్వాలో ఎంటీయూ–1010, ఎంటీయూ–1156, ఎంటీయూ–1121 రకాలను సాగు చేశారు. వీటిలో ఎంటీయూ–1165 రకం దిగుబడి బాగా వస్తోంది. ఎకరానికి 50 నుంచి 60 బస్తాల వరకు పండిందని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో ఇప్పటికే వరి కోతలు పూర్తికాగా.. డెల్టాలో మాసూళ్లు ఊపందుకున్నాయి. మాసూళ్లు ప్రారంభ సమయంలో యంత్రం సాయంతో కోసిన ధాన్యానికి బస్తాకు రూ.950 మాత్రమే చెల్లించారు. అప్పట్లో ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోయారు.

 

పెరిగిన ధరలు ఇలా

మిల్లర్లు 75 కిలోల ఏ గ్రేడ్‌ ధాన్యానికి చేరా రూ.1,200 నుంచి రూ.1,220 వరకు చెల్లిస్తున్నారు. వరి కోత యంత్రంతో మాసూళ్లు చేసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో బస్తాకు రూ.1,100 ఇస్తున్నారు. సార్వా సీజన్‌లో ఆరుదల ధాన్యాన్ని కేవలం రూ.1,050కి  కొనుగోలు చేయగా.. దాళ్వాలో ప్రస్తుతం రూ.150కి పైగా అదనంగా చెల్లిస్తున్నారు.

 

దళారుల మాయాజాలం

ఇప్పటికే సగం మంది రైతుల నుంచి బస్తా రూ.950 చొప్పున దళారులు ధాన్యం కొనుగోలు చేశారు. దానిని నిల్వచేసి ఇప్పుడు మిల్లర్లకు పెరిగిన ధరకు విక్రయిస్తున్నారు. సీజన్‌ మొదట్లో ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు నష్టపోయారు. ఇప్పుడు మిల్లర్లు ధర పెంచినా.. దళారులు మాత్రం రూ.1,050కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నేరుగా మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే అలవాటు లేని రైతులు దళారుల చేతిలో మోసపోతుండగా.. మిల్లులకు తీసుకెళ్లి విక్రయించే రైతులకు మాత్రం మంచి ధర లభిస్తోంది.

 

వీడని నల్లమచ్చ సమస్య

ఎంటీయూ–1156 రకం ధాన్యాన్ని పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలోనే రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ రకం ధాన్యం తల భాగంలో చిన్నపాటి నల్లమచ్చ వస్తోందని చెబుతున్నారు. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ నిరాకరిస్తున్నందు వల్ల కొనేది లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. డెల్టా ఆయకట్టులోని 56 వేల హెక్టార్లలో 1156 వరి సాగు చేయగా.. ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఈ ధాన్యాన్ని కొనేవారు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐకేపీ కేంద్రాలైనా కొనుగోలు చేస్తాయనుకుంటే.. వాటికి లింకింగ్‌ వ్యవస్థగా రైస్‌మిల్లర్లే వ్యవహరిస్తున్నారు. రైస్‌మిల్లర్లు ఆ ధాన్యాన్ని వద్దంటే తాము చేయగలిగిందేమీ లేదని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం మొహం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top