చనిపోయిన వారూ ఓట్లేశారు!


  • అర్బన్ బ్యాంక్ ఎన్నికలు, ఓట్ల లెక్కింపులో అడుగడుగునా  అవకతవకలు

  •  ఎన్నికల అధికారికి ఫిర్యాదులిచ్చినా స్పందించలేదు

  •  న్యాయస్థానంపై నమ్మకముంది..

  •  అందుకే హైకోర్టుకు వెళ్లాం : ఎమ్మెల్యే రాజన్నదొర

  •  

    సాలూరు : గత మే 11న జరిగిన సాలూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణలో పలు అవకతవకలు జరిగాయని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. గురువారం ఆయన పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో 3,750 మంది ఉండగా.. అందులో 300కు పైగా మృతుల ఓట్లే ఉన్నాయని తెలిపారు.

     

     ఏ ఎన్నికైనా ముందుగా ఓటర్ల జాబితాను ప్రకటించి, అందులో తప్పొప్పులను సరిచేసి మార్పు, చేర్పుల  అనంతరం తుది జాబితాను విడుదల చేయాల్సి ఉందన్నారు. కానీ ఇక్కడ ఇవేమీ జరగలేదన్నారు. 50 ఏళ్లకిందట మరణించిన వారి ఓట్లు కూడా కొనసాగుతున్నాయన్నారు. కనీసం డిఫాల్టర్ల జాబితాను కూడా ప్రకటించలేదని చెప్పారు.


    పలుమార్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేసినా ఆయన చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందువల్లే పలువురు డిఫాల్టర్లు కూడా ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. అలాగే బ్యాంక్ ఉద్యోగుల బంధువులు ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిబంధన్న ఉన్నా.. దానిని సైతం ఉల్లంఘించారని ఆరోపించారు.

     

     ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులని, ఈ నిబంధన కూడా అమలు కాలేదని తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులతోపాటు, జనరల్ ఏజెంట్లను కూడా లోపలికి అనుమతించలేదని చెప్పారు. పత్రికా విలేకరులను సైతం అడ్డుకున్నారని తెలిపారు. ఈ తరహా లెక్కింపు  దేశంలో ఇదే ప్రథమం కావచ్చన్నారు.


    బ్యాంకు నిర్వహణలో సైతం పలు అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. అందువల్లే హైకోర్టులో తమ పార్టీ అభ్యర్థులు కేసు వేశారని తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రస్తుత పాలకవర్గాన్ని రద్దు చేయాలని కోరారు. అక్రమాలకు పాల్పడ్డవారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ బీసీ విభాగం జిల్లా నాయకుడు మేడిశెట్టి అప్పలనాయుడు, పార్టీ పట్టణ అధికార ప్రతినిధి కామరాజు, గండిపల్లి రాము, పిరిడి రామకృష్ణ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top