ఓర్వలేకనే ఆరోపణలు

ఓర్వలేకనే ఆరోపణలు - Sakshi

పరిగి: అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీనిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలోని కొప్పుల శారదా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ గొల్లకురుమల ఆత్మీయ సదస్సుకు ఆయనతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, విద్యా, మౌలిక వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌ నాగేందర్‌గౌడ్, గొల్లకురుమల సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు.



ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొర్రెల పంపిణీ పథకాన్ని గొల్లకురుమల సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొల్ల కురుమలకే కాకుండా గంగపుత్రులు, ముదిరాజ్‌లు, రజకులు, నాయీబ్రాహ్మణులు తదితర అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమని, అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఒక్కో వర్గం కోసం ఒక్కో ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రతి రోజు హైదరాబాద్‌కు 30 వేల గొర్రెలు అమ్మకానికి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, దీంతో మనకు కావాల్సి ఆదాయం ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. దీనిని నివారిస్తే.. ఆర్థికంగా స్థిరపడవచ్చని తెలిపారు.



టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గొల్లకురుమల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తుందని తెలిపారు. పశు సంపద పెరుగుతున్న నేపథ్యంలో వెటర్నరీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఆయన మంత్రిని కోరారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం కులవృత్తులను ప్రత్యేక గుర్తింపునిస్తోందని తెలిపారు.



విద్య, మౌలిక వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు గుర్తింపునిచ్చిన మొట్టమొదటి నాయకుడు కేసీర్‌ మాత్రమేనని తెలిపారు. కార్యక్రమంలో గొల్లకురమల సహకారం సంఘాల జిల్లా అధ్యక్షుడు సదానందం, ఆయా మండలాల ఎం పీపీలు, జెడ్పీటీసీలు,  గొల్లకురుమల సహకార సంఘాల సీనియర్‌ నాయకులు జ్యోతి,  మహేష్‌రెడ్డి, అనీల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, నాగిరెడ్డి, ఆర్‌ ఆంజనేయులు, సుధాకర్‌రెడ్డి, విజయమాల, సురేందర్, ప్రవీణ్‌రెడ్డి, వెంకటయ్య, అరుణ, నాగరాజు, భాస్కర్, అశోక్‌రెడ్డి, అనూష, రవికుమార్, నరేష్, మల్లేశం, రవి, రాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top