ఇన్‌పుట్‌ సబ్సిడీ ఔట్‌

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఔట్‌


ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీలో  గోల్‌మాల్‌

పరిహారం సొమ్మును పంచేసుకున్న వైనం

నిజమైన అన్నదాతలకు మళ్లీ మొండిచెయ్యే..




రైతుల కష్టాన్ని కరువు కాటేసింది. సరే కదా అని ఇన్‌పుట్‌ సబ్సిడీతో తమ ఇక్కట్లను కొద్దిగానైనా తీర్చుకుందామంటే అధికారులు గద్దల్లా ఎగరేసుకుపోయారు. అనర్హుల పేర్లతో  వివరాలు నమోదు చేసి నిజంగా నష్టపోయిన అన్నదాతలకు అంతులేని ఆవేదనను మిగిల్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో రైతులు దోపిడీకి గురవుతున్న తీరు ఇది.



శాంతిపురం:  శాంతిపురం మండలంలోని 60 రెవెన్యూ గ్రామాల్లోని 3,793 మంది రైతులకు 2015 ఖరీఫ్‌లో వేరుశనగ నష్టపోయినందుకు రూ .1.60 కోట్ల పరిహారం ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.  రైతులందరికీ గరిష్టంగా రూ. 6 వేలు మాత్రమే పరిహారానికి వీఆర్‌వోలు సిఫార్సు చేయడంతో ఆ మేరకే మంజూరయ్యింది.  చాలా మంది బాధిత రైతులకు రూ. 1,250 నుంచి రూ.3,900 వచ్చేలా చేశారు. కానీ కొందరు వీఆర్‌వోలు ముందస్తు ఒప్పందాలతో నాలుగు రెవెన్యూ గ్రామాల్లో ఎంపిక చేసుకున్న దాదాపు 55 మంది పేర్లతో రూ. 12 లక్షల వరకు దిగమింగారు. గుండిశెట్టిపల్లి, ఎంకే పురం, చిన్నగాండ్లపల్లి, ఎం.శాంతంపల్లి, సొన్నేగానిపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో మాత్రం ఎంచుకున్న వారికి భారీగా ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరయ్యేలా చేశారు.  పూర్తిగా భూమి లేకున్నా, పది సెంట్లలోపే ఉన్నా వారితో బేరాలు కుద్చుకుని ఒక్కొక్కరికి ఏకంగా రూ. 27 వేల వరకూ ఇన్‌పుట్‌ సబ్సిడీ నమోదు చేయడంతో ప్రభుత్వం ఆయా మొత్తాలను విడుదల చేసింది. డబ్బులు ఖాతాలోకి రాగానే ముందస్తు ఒప్పందాల ప్రకారం రైతుల ఖాతాల నుంచి అధికారులు సొమ్మును రాబట్టుకున్నారు.  ఈ వ్యవహారం మీడియా దృష్టిలో పడడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించి ంది. వారం నుంచి పలువురు రైతుల ఖాతాలకు మళ్లీ సొమ్మును జమ చేస్తున్నారు. తమ అక్రమాలు వెలుగు చూడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కొందరు బాధిత రైతులు సాక్షిని ఆశ్రయించడంతో తీగ లాగితే డొంక కదిలింది.



నమోదు ఇలా..

చిన్నగాండ్లపల్లి రెవెన్యూలో 63 సెంట్లు, 75 సెంట్లు, 1.50 ఎకరాల భూమి ఉన్న ముగ్గురి పేర్లతో రూ. 24 వేల వంతున పరిహారం మంజూరు చేశారు. ఇదే రెవెన్యూ రికార్డుల్లో పేరు లేని వ్యక్తి పేరుతో మరో రూ. 24 వేలను వెచ్చించారు. ఇలా ఐదు మంది పేర్లతో రూ. 1,20,000 ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఎసరు పెట్టారు.

► గుండిశెట్టిపల్లి రెవెన్యూ పరిధిలో కేవలం మూడున్నర సెంట్ల భూమి ఉన్న మహిళ, మరో 29 సెంట్లు ఉన్న వ్యక్తి, 41 సెంట్లు ఉన్న వారి పేర్లతో రూ. 24 వేల వంతున చెల్లించారు.

► వివాదాస్పద బసవేశ్వరస్వామి ఆలయ మాన్యం సర్వే నంబర్లతో రూ.24 వేలు అర్పించారు. రికార్డుల్లో దొరకని మరో ఐదుగురి పేర్లతో రూ. 27 వేలు, రూ. 24 వేలు, రూ 18 వేలు, రూ. 15 వేలు, రూ 5,250 చొప్పున బిల్లు చేశారు. ఇద్దరు నాయకుల కుటుంబాల్లోని 8 మంది పేర్లతో రూ 1,47,750, మరో 7 మంది పేర్లతో రూ. 1,63,000  ఇన్‌పుట్‌ సబ్సిడీ  ఇచ్చారు.

► ఎం.శాంతంపల్లి రెవెన్యూ రికార్డుల్లో 52 సెంట్ల భూమి ఉన్న వ్యక్తికి రూ. 24 వేలు, భూమి లేని మహిళ పేరుతో రూ 24 వేలు వంతున కేటాయించారు. ఈ గ్రామ పరిధిలో ముగ్గురి పేర్లతో రూ. 66 వేలకు ఎసరు పెట్టారు.

►  సొన్నేగానిపల్లి రెవెన్యూలో 4.40 ఎకరాలు ఉన్న కుటుంబానికి రూ.36 వేలు కేటాయించారు.  ఈ రెవెన్యూ గ్రామంలో పది మంది రైతులకు మాత్రం రూ .15, రూ.18 వేల చొప్పున మంజూరు చేశారు.



వసూలు ఇలా

► గుండిశెట్టిపల్లికి చెందిన ఓ రైతుకు రూ .27 వేలు పరిహారం బ్యాంకు ఖాతాలో జమ కావడంతో తనను ఎస్‌బీఐ బ్యాంక్‌కు పిలిపించిన రెవెన్యూ సిబ్బంది మరో మహిళ ఖాతాకు రూ. 22 వేలను బదిలీ చేశారు. ఆ సొమ్ము పై అధికారులకు వెళ్లాలని, తన ఖాతాకు మళ్లీ నగదు వస్తుందని రైతుకు నచ్చజెప్పారు. అయితే ఈ రైతు ‘సాక్షి’ని కలిసిన  విషయం తెలుసుకుని మళ్లీ తన ఖాతాకు రూ. 22 వేలను బదిలీ చేశారు.



► గుండిశెట్టిపల్లికి చెందిన మరో రైతు ఖాతాకు రూ 19,500 జమా అయ్యింది.   ఇంకా పెద్ద మొత్తం మళ్లీ వస్తుందని మాయమాటలు చెప్పి రూ. 10 వేలను ఓ రెవెన్యూ దళారి ఖాతాకు ‘నగదు బదిలీ’ చేశారు. విషయం బయటకు రావటంతో మళ్లీ ఈ  రైతు ఖాతాకు నగదును బదిలీ చేశారు.



► శాంతిపురంలో సొంత వ్యాపారం చేసుకునే రైతుకు రూ. 24 వేలు ఇన్‌పుట్‌ సబ్సీడి మంజూరు చేశారు.  ఈ విషయం తనకు తెలియక పోవడంతో ఓ వీఆర్‌వో పదేపదే ఫోన్‌ చేసి తన ఫ్రెండ్‌ రూ. 24 వేలను మీ ఖాతాలో వేశారని, ఆ సొమ్మును తీసివ్వాలని పోరు పెట్టాడు. సాంకేతిక కారణాలతో సబ్సిడీ మొత్తం బ్యాంకులో జమ కావడం ఆలస్యమయింది. దీంతో  సదరు రైతు తన ఖాతా స్టేట్‌మెంట్‌ను వీఆర్‌వోకి సమర్పించాడు. ఈ నెల 6 వరకూ రోజుకు రెండు సార్లు ఫోన్లు చేసి నగదుపై ఆరా తీసిన వీఆర్‌వో తర్వాత గుంబనంగా ఉండిపోయాడు.

ఈ వ్యవహారంపై రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అలాగే బ్యాంకులో సాగిన నగదు బదిలీల వ్యవహారం నిగ్గుతేల్చడానికి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), సీఐడీ దర్యాప్తు జరపాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top