బీసీలు లేకుంటే టీడీపీ లేదు

బీసీలు లేకుంటే టీడీపీ లేదు - Sakshi


చంద్రన్న స్వయం ఉపాధి

ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు


సాక్షి, విజయవాడ బ్యూరో: తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నుముకని, వారు లేకుంటే పార్టీయే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో వారికి ఒక శాతం కూడా అన్యాయం జరకుండా అందరితో సమానంగా ఆర్థిక అభివృద్ధి సాధించేవరకు అండగా ఉంటానని తెలిపారు. ఆయన శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో  చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాలను ప్రారంభించారు. బీసీ 10 ఫెడరేషన్లను చైతన్యవంతం చేస్తానని, అలాగే 139 కులాలకు సంబంధించిన నిపుణులు, మేధావులతో మాట్లాడి వారి అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.  బీసీల సమస్యలు చర్చించుకునేందుకు ప్రతీ జిల్లాకు ఒక బీసీ భవన్ నిర్మిస్తానన్నారు.


 అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేం..

అందరికీ గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వలేమని చంద్రబాబు తేల్చిచెప్పారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలిపారు. టీడీపీకి వెన్నంటి ఉన్న బీసీలకు మరింత న్యాయం చేస్తూనే కాపుల్లోని పేదలకు న్యాయం చేస్తానని ప్రకటించా రు. రుణమేళాలో 40,712 మందికి రూ. 260. 96 కోట్ల రుణాలను ఆయా ఫెడరేషన్‌లకు సీఎం చేతుల మీదుగా చెక్కులు అందించారు.


 విశాఖలో మెడికల్ టెక్నాలజీ పార్కు

విశాఖపట్నంలో మెడికల్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ(ఏఐఎంఈడీ) ముందుకు వచ్చింది. ఈ మేరకు శనివారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఏఐఎంఈడీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏఐఎంఈడీ ఫోరం కో-ఆర్డినేటర్ రాజీవ్‌నాథ్ సంయుక్తంగా ఎంఓయూ పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వచ్చే నెల 7వ తేదీలోపు ఈ పార్కుకు శంకుస్థాపన చేస్తామన్నారు. కాగామధ్యాహ్నం జపాన్‌కు చెందిన నరులా గ్రూపు ఎండీ, ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ధర్మీందర్‌సింగ్ సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


 కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ నిరసన

కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ ప్లకార్డులు పట్టుకున్న అఖిల భారతీయ యాదవ మహాసభ నేతలు నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో సీఎం సభలో కలకలం రేగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం మెగా బీసీ రుణమేళా సభలో సీఎం ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే సభికుల్లో ఉన్న పలువురు పైకి లేచి కాపులను బీసీల్లో చేర్చి మాకు అన్యాయం చేయొద్దంటూ నినాదాలు చేస్తూ  ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సీఎం చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి చర్యలను తాను సహించనని, కఠనంగా ఉంటానని హెచ్చరించారు.  సీఎం హెచ్చరికలతో రంగంలోకి దిగిన పోలీసులు 20మందిని అదుపులోకి తీసుకుని మాచవరంపోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top