వెయ్యేళ్ల కిందే ఓరుగల్లు విద్యాకేంద్రం!

వరంగల్‌ కోట వద్ద జైన తీర్థంకరుల మూర్తులున్న చాంబర్లు


9వ శతాబ్దంలోనే రెండు పెద్ద విద్యాలయాలు

తాజాగా గుర్తించిన పరిశోధకులు

పద్మాక్షి గుట్ట, వరంగల్‌ కోటల్లో ఆధారాలు లభ్యం



సాక్షి, హైదరాబాద్‌: కాకతీయ విశ్వవిద్యా లయం... వైద్య కళాశాల... నిట్‌... ఉన్నత విద్యకు కేంద్రమైన ఓరుగల్లు నేడే కాదు... పదకొండు వందల ఏళ్ల కిందటే గొప్ప విద్యా కేంద్రంగా విరాజిల్లింది. 9వ శతాబ్దంలోనే ఈ నగరంలో రెండు గొప్ప విద్యాలయాలున్నా యన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చిం ది. వీటి ఆనవాళ్లను ఔత్సాహిక పరిశోధకులు గుర్తించారు. రాష్ట్ర కూటుల కాలంలో ప్రస్తుత హన్మకొండ, వరంగల్‌లలో రెండు జైన విద్యా కేంద్రాలు కొనసాగినట్టు తేల్చారు. రాష్ట్రకూ టుల ఏలుబడిలోనే విఖ్యాత కొలనుపాక జైన దేవాలయం  రూపుదిద్దుకున్నది.


ఈ మంది రం ఒకప్పుడు ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందిన సంగతి తెలిసిందే. అక్కడికి చేరువలోనే ఉన్న హన్మకొండ, వరంగల్‌లలో కూడా రెండు విద్యాలయాలు ఉండేవన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గతంలో పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులు, మరికొందరు ఈ విషయా లను గుర్తించినా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. తాజాగా ‘కొత్త తెలంగాణ చరిత్ర’బృందం సభ్యులు అక్కడి శిల్పాలు, రాతి చిత్రాలను నిశితంగా పరిశీలించి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.



                                              
హన్మకొండలోని పద్మాక్షి గుట్టపై  'వ్యాసపీఠంతో విద్యార్థులు'

పద్మాక్షి గుట్టపై పురాతన విద్యాకేంద్రం...

హన్మకొండలో ప్రధాన ఆలయంగా భాసిల్లుతు న్న పద్మాక్షి అమ్మవారి మందిరమున్న ప్రాంతంలో తొలి పురాతన విద్యాకేంద్రం ఉండేది. ప్రస్తుతం వరంగల్‌ కోటకు ఓ వైపున ఉన్న ఆలయం సమీపంలో రెండో విద్యా కేంద్రం కొనసాగింది. ఆలయం వద్ద ఒకప్పుడు విద్యా కేంద్రం ఉందనటానికి రెండు ఆధారాలను తాజాగా గుర్తించారు. అక్కడ రాతిగోడపై జైన గురువు, ఆయన ముందు ఇద్దరు విద్యార్థులు, వారి మధ్య వ్యాసపీఠం (పఠనం సమయంలో పుస్తకాన్ని ఉంచే చెక్క నిర్మాణం) చెక్కడాలు కనిపించాయి. రెండు వేరువేరు ప్రాంతాల్లో ఇలా ఉన్నాయి. 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలతో భారీ శిల్పం ఉంది.


అలాగే ఓరుగల్లు కోట ఆగ్నేయ ప్రాంతంలో ఆంగ్ల అక్షరం ఎల్‌ ఆకృతిలో భారీ రాతి నిర్మాణం ఉంది. దానిపై 24 చాంబర్లు (చిన్న గదులు), ప్రతి గదిలో ఓ విగ్రహం ఆనవాళ్లున్నాయి. అవి 24 మంది జైన తీర్థంకరులవని గుర్తించారు. వేరువేరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించి ఉంటారని, వారికి వసతి భవనాలు ఉండేవని భావిస్తున్నారు. జైన మత కట్టడాలపై దాడుల నేపథ్యంలో ఆ వసతి గృహాలు ధ్వంసమై ఉంటాయని పేర్కొంటున్నారు. కాగా, మఠాల తరహాలో జైనుల ఏలుబడిలో గచ్చలుగా కొన్ని ప్రాంతాలను గుర్తించి, వాటి నిర్వహణను కొంతమందికి కేటాయించేవారు. అవి విద్యాకేంద్రాలుగా సేవలందించాయి. అలా హన్మకొండ ప్రాంతం కూడా అప్పట్లో ఓ పుస్తక గచ్చగా భావిస్తున్నారు.



కొలనుపాక, బోధన్‌ తరహాలోనే...

‘తొమ్మిదో శతాబ్దంలో ఈ ప్రాంతానికి మంత్రిగా పనిచేసిన బేతన భార్య మహిలమ్మ పద్మాక్షి గుట్టపై వసతి కేంద్రాన్ని కట్టించారు. దాన్ని కడలాలయబసతిగా పేర్కొంటారు. అక్కడే తొలి విద్యాకేంద్రం ఏర్పాటైంది. వ్యాసపీఠాల చెక్కడాలు ఇక్కడే ఉన్నాయి. కొలనుపాక, బోధన్‌లలో కొనసాగిన జైన విద్యాకేంద్రాల్లాంటివేనని తేటతెల్లమవుతోంది’అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ హరగోపాల్‌ ‘సాక్షి’తో చెప్పారు. అరవింద్, హరిసనత్‌కుమార్, సాదిఖ్‌అలీ తదితరులతో కలిసి వీటిపై ఆధ్యయనం చేసినట్టు వెల్లడించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top