'పది నిమిషాలంటే.. రెండున్నర గంటలా'

'పది నిమిషాలంటే.. రెండున్నర గంటలా' - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  శాసన సభ సమావేశాల్లోని చివరి రోజు ప్రతిష్టంభన నెలకొంది. దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కుంభకోణం వ్యవహారం ఈ ప్రతిష్టంభనకు కారణమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేవలం ఐదు రోజులు మాత్రమే శాసన సభ సమావేశాలు జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఐదు రోజుల్లో ఏనాడు కూడా ప్రభుత్వం ప్రతి పక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించలేదు.



ఆఖరికి చివరి రోజు కూడా బాధ్యతా రహితంగానే ప్రభుత్వం వ్యవహరించినట్లు ప్రతిపక్ష సభ్యులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కీలకమైన ఓటుకు కోటు కేసుపై చర్చ జరగాలని దీనిపై చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో మొత్తం రెండుసార్లు సమావేశం వాయిదా పడింది. ఇందులో రెండోసారి పదినిమిషాలు వాయిదా అని చెప్పిన స్పీకర్ కోడెల శివప్రసాద్.. రెండున్నర గంటల తర్వాతగానీ సమావేశం తిరిగి ప్రారంభించలేకపోయారు. ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే నిరవదిక వాయిదా వేశారు.



ఫలితంగా పలువురు నేతలు పది నిమిషాలు అంటే రెండున్నర గంటలని అర్ధమా అని ప్రశ్నిస్తున్నారు. తాము లాబీల్లో టీలు, కాఫీలు తాగేందుకు రాలేదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు వచ్చామని అన్నారు. ఓ వ్యక్తికి(ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు) సంబంధించిన అంశాన్ని(ఓటుకు కోట్లు) మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి అంటగట్టి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ఏ అంశంపై చర్చ లేవనెత్తారో ఆ చర్చకు సంబంధించిన వ్యక్తి(ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు) చివరి రోజు అసలు సభలోనే అడుగుపెట్టకుండా కేవలం ఛాంబర్కే పరిమితమవడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని పెదవివిరుస్తున్నారు.



చివరకు రెండున్నరగంటల అనంతరం సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షం లేవనెత్తిన అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండానే స్పీకర్ నేరుగా అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయడం చూస్తుంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్ తమ మనోభావాలను కించపరిచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసినందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా తప్పించుకొని సభను నిరవదిక వాయిదా వేయించారని ఆరోపించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top