ఆపరేషన్‌ స్మైల్‌

ఆపరేషన్‌ స్మైల్‌


తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు..

బాల కార్మికులకు విముక్తి  

స్పెషల్‌ డ్రైవ్‌లో 103 మంది గుర్తింపు




తప్పిపోయిన పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే లక్ష్యంగా ఆపరేషన్‌ స్మైల్‌–3 నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 103 మంది బాలకార్మికులను గుర్తించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు బాలకార్మికులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇళ్లకు చేర్చుతున్నారు. కొందరిని చైల్డ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు.    – సత్తుపల్లి



హెల్ప్‌లైన్‌కు సమాచారమివ్వాలి

ఆపరేషన్‌ స్మైల్‌–3తో అనాథ పిల్లలు, వీధి బాలలకు పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.  తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం. చదువు లేనివారికి వృత్తి నైపుణ్యం పెంపొందించే కోర్సులు నేర్పిస్తున్నాం.  ఎవరైనా బాలకార్మికులను గుర్తిస్తే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098కు సమాచారం ఇవ్వాలి. –టి.విష్ణువందన , జిల్లా బాలల సంరక్షణాధికారిణి



సత్తుపల్లి: బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. వీధుల్లో  18 సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు యాచక వృత్తిలో ఉన్నా.. పనుల్లో ఉన్నా.. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తోంది. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కొందరు పిల్లలు వీధుల్లో అల్లరిచిల్లరగా తిరుగుతుండటం.. ఇళ్లల్లో పని చేస్తుండటం ప్రత్యేక బృందాల దృష్టికి వస్తున్నాయి. ఈ క్రమంలో కమిటీ సభ్యులు బాలల తల్లిదండ్రులను కలిసి కౌన్సెలింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు.



ఖమ్మం  చైల్డ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ ద్వారా 18 ఏళ్ల వయసు వచ్చే వరకు చదివించటం, భోజన సదుపాయంతో పాటు వసతి కల్పిస్తామని,  నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను వీధుల్లోకి వదిలేయకుండా ఈ కేంద్రానికి తరలించాలని ప్రత్యేక బృందాలు చెబుతున్నాయి.



పనుల్లో ఉన్న బాలబాలికలను..

రాజస్థాన్, ఒడిశా, బిహార్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో వివిధ పనులు చేస్తున్న బాలబాలికలను గుర్తించారు.  వారి సొంత ప్రాంతాలను గుర్తించి  తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.  సత్తుపల్లి డివిజన్‌లో సత్తుపల్లిలో 22 మంది, పెనుబల్లిలో 63 మంది బడిబయట పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. బడిబయట పిల్లలకు ఎంఈఓ, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ సహకారంతో కౌన్సెలింగ్‌ చేపడుతున్నారు.



జువైనల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం..

మొదటివారంలో జిల్లాలో అనాథ పిల్లలతో అనాథాశ్రమాలు నడుపుతున్న కేంద్రాలను చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు పరిశీలించారు. రెండో వారంలో వీధి బాలలను గుర్తించి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇక మూడో వారంలో 14 ఏళ్లలోపు బాలబాలికలు షాపుల్లో ఎక్కడైన పని చేస్తున్నట్లయితే.. యజమానులపై కార్మిక శాఖ అధికారి ద్వారా  కేసు నమోదు చేస్తారు. నాలుగో వారంలో యాచక వృత్తిలో ఉన్న పిల్లలను గుర్తిస్తారు.  పసిపిల్లలను జోలెలో వేసుకుని తిరుగుతూ యాచన చేస్తున్న వారిపై జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తారు.



సబ్‌ డివిజన్‌కో ప్రత్యేక బృందం..

జిల్లాలోని మూడు పోలీస్‌ సబ్‌ డివిజన్లకు ఒక్కో స్పెషల్‌ టీంను నియమించారు. ఈ ప్రత్యేక బృందాల్లో ఒక ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది, ఐసీడీఎస్‌ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ, కార్మికశాఖ, విద్యాశాఖల అధికారులు ఉంటారు. ఆపరేషన్‌ స్మైల్‌–3 విజయవంతం కోసం ఈ బృందాలు సబ్‌డివిజన్‌ వారీగా పర్యవేక్షిస్తున్నాయి. ప్రత్యేక బృందాలు సబ్‌డివిజన్‌ వారీగా గస్తీ తిరుగుతూ వీధి బాలలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించేందుకు ఈ బృందాలు కృషి చేస్తున్నాయి.



మేం సహకరిస్తున్నాం..

బాలకార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి సంపూర్ణ సహకారం అందిస్తున్నాం.  సత్తుపల్లి డివిజన్‌లో 37 మంది బాలురు, ఏడుగురు బాలికలను గుర్తించాం. పిల్లలను పనిలో పెట్టుకోవటం చట్టరీత్యానేరం. ఈ టీమ్‌లో పోలీస్‌శాఖ నుంచి ఒక ఎస్‌ఐ , కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. –బల్లా రాజేష్, డీఎస్పీ, సత్తుపల్లి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top