సీన్‌ రివర్స్‌


ఒంగోలు టౌన్‌ : ఐసీడీఎస్‌ ఒంగోలు అర్బన్‌ ప్రాజెక్టులో అంగన్‌వాడీ కేంద్రాల మెర్జ్‌కు అద్దె రూపంలో బ్రేకులు పడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో కాన్వెంట్‌ విద్య అందించాలన్న ఉద్దేశంతో మూడు కేంద్రాలను ఒకేచోటకు తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ తరలింపు ప్రక్రియకు అనూహ్య రీతిలో అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకు తమ ఇళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించినందున బకాయిలు చెల్లించిన తర్వాతే కదలనిస్తామంటూ అనేకమంది ఇంటి యజమానులు చెబుతుండటంతో అంగన్‌వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒంగోలు అర్బన్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 137 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి నెలకు 3 వేల రూపాయల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల విలీన ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి అద్దె దెబ్బ అంగన్‌వాడీలను వేధిస్తోంది. ఒంగోలు అర్బన్‌ ప్రాజెక్టులోనే 13 నెలల నుంచి అద్దె బకాయిలు ఉండటంతో అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో అంగన్‌వాడీలు కొట్టుమిట్టాడుతున్నారు.



అడకత్తెరలో పోకచెక్కలా...

ఒంగోలు అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తాము సూచించిన విధంగా అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని కేంద్రంలో మెర్జ్‌ చేయాలని సూపర్‌వైజర్‌ మొదలుకుని సీడీపీఓ వరకు ఆదేశాల మీద ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఆ కేంద్రాలను వారు సూచించిన చోటకు మార్చేందుకు ప్రయత్నిస్తే అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే కేంద్రాలను కదలనిస్తామంటూ అనేకమంది ఇంటి యజమానులు గట్టిగా చెబుతుండటంతో అంగన్‌వాడీల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకవైపు కేంద్రాలను మార్చలేదంటూ అధికారుల నుంచి వేధింపులు, ఇంకోవైపు కేంద్రాలను కదలనీయమంటూ యజమానులు భీష్మించుకుని కూర్చుండటంతో అనేకమంది అంగన్‌వాడీలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మెర్జ్‌ చేయాలంటూ ఒత్తిళ్లు ఎక్కువగా వస్తుండటంతో కొంతమంది అంగన్‌వాడీలు వడ్డీకి తీసుకువచ్చి కడుతుంటే, ఇంకొంతమంది అంగన్‌వాడీలు ఇంట్లో ఉన్న అరకొర బంగారాన్ని తాకట్టు పెట్టి కేంద్రాల అద్దె బకాయిలు చెల్లిస్తున్నారు.



బకాయిలు ఎప్పుడు వస్తాయో...

ఒంగోలు అర్బన్‌ ప్రాజెక్టులో అద్దె బకాయిలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని మిగిలిన 20 ప్రాజెక్టుల్లో నెలల తరబడి అద్దె సమస్య లేదు. ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ వచ్చిన వెంటనే బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే ఒంగోలు అర్బన్‌ ప్రాజెక్టులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్‌ ఉన్నప్పటికీ అద్దె బిల్లులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనేక మంది అంగన్‌వాడీలు ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్‌ వచ్చినప్పటికీ బిల్లులు చెల్లించని విషయాన్ని ప్రాజెక్టు డైరెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు కొంతమంది సమాయత్తం అవుతున్నారు.



సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తా : ప్రాజెక్టు డైరెక్టర్‌

ఒంగోలు అర్బన్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీ విశాలాక్షి ’సాక్షి’కి తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లుల చెల్లింపులో సమస్య తలెత్తిందన్నారు. దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top