వంద రోజులు పని కల్పించాల్సిందే..

వంద రోజులు పని కల్పించాల్సిందే.. - Sakshi


పన్నులు పూర్తిగా వసూలు చేయాలి

 రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌




సంగెం(పరకాల) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు వంద రోజులకు పైగా పని కల్పించాల్సిందేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ నీతూప్రసాద్‌ స్పష్టం చేశారు. మండలంలోని ఉత్తమ గ్రామపంచాయతీ అయిన తీగరాజుపల్లి గ్రామాన్ని శనివారం ఆమె కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టి, ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని ఇంకుడు గుంత, రైతులు నిర్మించుకున్న నాడెపు కంపోస్టు పిట్, ఇంటి ఆవరణలోని ఇంకుడు గుంత, వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం హరితహరం, నీటి తొట్టి, నాడెపు కంపోస్టు పిట్, పాఠశాలలోని ఇంకుడు గుంతల వల్ల ప్రయోజనాలను రైతులు, సర్పంచ్‌ను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా నీతూప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలు ఎక్కువగా పనికి హాజరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.



ఈజీఎస్‌ ద్వారా వచ్చిన నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, గ్రామానికి మంజూరయ్యే నిధులను సక్రమంగా ఉపయోగించుకుని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చుకోవాలన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా వెచ్చిస్తున్నారో సర్పంచ్‌ రంగరాజు నర్సింహస్వామిని ఆరా తీసిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీఓ భద్రునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top