పేదల భూములపై వాలిన గద్దలు

పేదల భూములపై వాలిన గద్దలు - Sakshi


♦ మంత్రులు గంటా, అయ్యన్న, ఎంపీ అవంతీ చంద్రబాబు బినామీలు

♦ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో వై.ఎస్.జగన్ పర్యటన

♦ రైతుల పోరాటానికి బాసటగా ఉంటానని భరోసా

 

 (విజయనగరం జిల్లా భోగాపురం  మండలం నుంచి సాక్షి  ప్రత్యేక ప్రతినిధి)

 ‘‘మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతీ శ్రీనివాస్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బినామీలు. రేపొద్దున్న చంద్రబాబుకు డబ్బులు ఇవ్వాల్సింది వాళ్లే. అందుకే భోగాపురం ఎయిర్‌పోర్టు పరిధినుంచి వారి భూములను తప్పించారు. ఎయిర్‌పోర్టు మ్యాపును అమీబాలా రకరకాల వంకర్లు తిప్పి పేదోళ్ల భూములను లాక్కుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన, అన్యాయమైన ప్రభుత్వం మరొకటి ఉండదు’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.



గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు  కోసం భూములు సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఆయన సోమవారం పర్యటించారు. ఎ.రావివలసలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి వారితో మాట్లాడారు. వారి పోరాటానికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించారు. గూడెపువలస, కవులవాడలలో నిర్వహించిన బహిరంగ సభల్లో భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొదటగా భూములు కోల్పోతున్న పేద రైతులు, మహిళలతో మాట్లాడించారు.



నర్సాయమ్మ, బుజ్జి, మణి, గౌరి, మట్టా స్వామి, వంశీరెడ్డి, కొండమ్మ, నర్సమ్మ, బంగారమ్మ, గుర్రమ్మ, సన్యాసిరావు, సోము ముత్యాలు అనే రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకున్న ఎకరా, రెండెకరాలు కోల్పోతే తాము రోడ్డునపడాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రాణాలైనా వదిలేస్తాంకానీ భూములివ్వమని తేల్చిచెప్పారు. అసలు ఎర్రబస్సు లేని ఊరికి ఎయిర్‌పోర్టు ఎందుకని ప్రశ్నించారు. వారి ఆవేదనను, ఆక్రోశాన్ని ఆలకిస్తూ, వారికి ధైర్యం చెబుతూ మధ్య మధ్యలో జగన్ మాట్లాడారు. ‘‘గట్టిగా నిలబడదాం, పోరాడదాం. అవసరమైతే కోర్టుకు పోదాం. నేనూ వచ్చి ధర్నాలో పాల్గొంటా. ఒకవేళ అధికార దుర్వినియోగంతో బలవంతంగా భూములు లాక్కుంటే... మూడేళ్లలో మనం అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ భూములు మీకు తిరిగిస్తాం. ఎవ్వరూ భయపడవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది’’ అని వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే...



 గద్దల్లా పేదోళ్ల భూములు లాక్కుంటున్నారు

 ఏదైనా ఎయిర్‌పోర్టుకు భూములు సేకరించాలంటే... ఏదో ఒక ఆకారం ఉంటుంది. కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు మ్యాపు అమీబాలా ఇష్టమొచ్చిన రీతిలో ఉంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్‌ల భూములు కాపాడేందుకు మ్యాపును అలా మార్చేశారు. మొదట 15 వేల ఎకరాలు లాక్కోవాలని ప్రయత్నించారు. అయితే అందులో తన భూములు కూడా పోతాయని గంటా మొరపెట్టుకున్నారు. అయ్యో... అవునా... నువ్వు డబ్బులు సంపాదిస్తే కదా నాకు డబ్బులిచ్చేదంటూ చంద్రబాబు ఆ భూములను ఎయిర్‌పోర్టు పరిధినుంచి తొలగించారు.



తర్వాత ప్లాన్-బి అంటూ మరోటి ప్రకటించారు. తన భూములు పోతాయంటూ అయ్యన్నపాత్రుడు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఎంపీ అవంతి శ్రీనివాస్ వెళ్లారు. మీ భూములు అక్కడే ఉండాలి... ఇప్పుడు ఎకరా రూ.రెండుకోట్లు పలికే భూములు ఎయిర్‌పోర్టు వస్తే రూ.ఐదు కోట్లు పలుకుతాయంటూ చంద్రబాబు ప్లాన్-3ని తీసుకొచ్చారు. సెంటు, అరెకరం, ఎకరం పొలమున్న పేదల భూములను గద్దల్లా లాక్కుంటున్నారు. గూడెపువలస పక్కనే మంత్రి అయ్యన్నపాత్రుడికి చెందిన  సన్‌రే రిసార్ట్స్ కనిపించింది. వందల ఎకరాలు ప్లాటింగ్‌లు చేసి గజం రూ.తొమ్మిదివేలకు అమ్ముతున్నారు. అంటే ఎకరా రూ.2.70 కోట్లు.



అలా తనవాళ్లు కోట్ల రూపాయలకు భూములు అమ్ముకునేందుకు సహకరిస్తూ పేదల భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. పరిహారంగా పప్పు బెల్లాలు ఇస్తామంటున్నారు. నిజానికి ఈ భూములు లాక్కునే అధికారం చంద్రబాబుకు లేదు. ఎందుకంటే సామాజిక ప్రభావం మదింపు జరగలేదు. తాము భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని 80 శాతం ప్రజలు గ్రామ సభలు పెట్టి చెప్పనూలేదు. తాము భూములివ్వబోమంటూ పంచాయితీలు తీర్మానాలు చేస్తే.. వాటిని రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. భూ సేకరణ బిల్లుపై ప్రధాని నరేంద్రమోదీనే వెనకడుగువేస్తే చంద్రబాబుకు ఈ అధికారం ఎక్కడనుంచి వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల ఫీజులు పెరిగినా ఈ ప్రాంతంలో మాత్రం పెరగలేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచితే ఆ మేరకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని కక్కుర్తిపడుతున్న మొట్టమొదటి సీఎం చంద్రబాబే.



 బాబు జీవితమంతా మోసం, అబద్ధం

 ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా రైతులు నెలరోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వంలోని ఒక్క నాయకుడూ వచ్చి పలకరించలేదు. సెక్షన్-30 పేరుతో గ్రామాల్లో ఎవరూ మీటింగులు పెట్టకూడదని బెదిరిస్తున్నారు. ఎవరైనా మైకు పట్టుకుని మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇంత దౌర్జన్యం జరగలేదు. అసైన్డ్ భూములంటే తమ హక్కు అన్నట్లు బలవంతంగా లాక్కుంటున్నారు. మన ప్రభుత్వం వస్తే అసైన్డ్ భూముల చట్టం తీసుకువస్తాం. ప్రభుత్వం అనుకున్నా సరే అసైన్డ్ భూములు తీసుకునే అధికారం లేకుండా పేదలకు రక్షణ కల్పిస్తాం.



ఎయిర్‌పోర్టు పేరుతో సింగపూర్ వారికి భూములు కట్టబెట్టేందుకు జీవో-63 తీసుకొచ్చారు. అంటే.. మన భూములు బలవంతంగా లాక్కుని ఒక ఎయిర్‌పోర్టు కంపెనీ ఏర్పాటు చేస్తారట. తర్వాత భూములన్నీ ఏ సింగపూర్ కంపెనీకో అప్పజెప్పేస్తారట. ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం భూములు లాక్కోవడం ఎక్కడైనా జరుగుతుందా? ఇంతకన్నా లంచగొండి ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అసలు చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రైతులకు రుణాలు మాఫీ చేయకపోవడంతో అపరాధ వడ్డీ కట్టాల్సి వస్తుంది.



చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రైతులు రూ.87,412 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. వారు సున్నా వడ్డీ, పావలా వడ్డీ కట్టేవారు. ఇప్పుడు చంద్రబాబు పుణ్యాన అదే రైతులు 14 నుంచి 18శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది. రైతులు 18 నెలల్లో 18 వేల కోట్లు వడ్డీ కడితే... చంద్రబాబు ముష్టివేసినట్లు రూ.7,400 కోట్లు మాత్రమే ఇచ్చి.. రైతుల రుణాలన్నీ మాఫీ చేశానని చెప్పుకుంటున్నారు. డ్వాక్రా మహిళలనూ మోసం చేశారు. జాబులు ఇవ్వకపోగా ఉన్న జాబులు పీకేస్తున్నారు. రూ.రెండువేలు నిరుద్యోగ భృతి మాటే లేదు. అసలు ఉద్యోగమిస్తానని నేనెప్పుడు చెప్పానని చంద్రబాబు మాట మారుస్తున్నారు. ఆయన జీవితమంతా మోసం, అబద్ధం.



ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, రాజన్నదొర, పుష్ప శ్రీవాణి, వి.కళావతి, కలమట వెంకటరమణ, గిడ్డిఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ రాణి, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, ధర్మాన కృష్ణదాస్, బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, జుత్తు జగన్నాయకులు, మీసాల నీలకంఠం నాయుడు, మాజీఎంఎల్‌సీ సూర్యనారాయణరాజు, విశాఖపట్నం జిల్లాల పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్, రెడ్డి శాంతి, నియోజకవర్గాల సమన్వయకర్తలు పెనుమత్స సురేష్, బెల్లాన చంద్రశేఖర్, జమ్మన ప్రసన్న కుమార్, లెక్కల నాయుడుబాబు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, శ్రీకాకుళం, భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణ, కందుల రఘుబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 అసలిక్కడ ఎయిర్‌పోర్టు అవసరమా?

 ఎయిర్‌పోర్టుకు ఎయిర్‌పోర్టుకు మధ్య 150 నాటికల్ మైళ్ల దూరం ఉండాలని చట్టం చెబుతోంది. విశాఖపట్నంలో 980 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఉంది. దానికీ భోగాపురానికి మధ్య 20 నాటికల్ మైళ్ల దూరం కూడా లేదు. ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు. 20 నాటికల్ మైళ్లంటే దాదాపు 37 కిలోమీటర్లు. విశాఖ ఎయిర్‌పోర్టు పక్కనే నేవీ, పోర్టు ట్రస్టుకు చెందిన ప్రభుత్వ భూమి వెయ్యి ఎకరాలు ఉంది. ఆ భూములు తీసుకుని విశాఖ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసే అవకాశమున్నా కాదని ఇక్కడ భోగాపురంలో పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు.



ప్రస్తుతం నేవీ ఆధీనంలో ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టును విస్తరిస్తామని 2013లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కల్పనా ఛేది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ఒక నివేదిక కూడా ఇచ్చారు. కానీ ఇదే జిల్లానుంచి, ఇదే నియోజకవర్గంనుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్న అశోకగజపతిరాజు ఆ నివేదికను పక్కనపడేసి రైతుల భూముల్లో ఎయిర్‌పోర్టు పెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఒకటికాదు రెండు కాదు... ఐదు వేల ఎకరాలు కావాలట. అసలు ఒక ఎయిర్‌పోర్టుకు ఇంత భూమి అవసరమా? తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్టు కేవలం 1,280 ఎకరాల్లో ఉంది. కేరళ రాజధాని కొచ్చిన్ ఎయిర్‌పోర్టు 800 ఎకరాలే. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబయి ఎయిర్‌పోర్టు 2,000 ఎకరాల్లోపే. ప్రధాని నరేంద్రమోదీ వచ్చిన గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు 960 ఎకరాల్లో ఉంది. అలాంటప్పుడు భోగాపురంలో ఐదువేల ఎకరాలు ఎందుకు?

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top