పాత నేతలకు భంగపాటు


ఎమ్మెల్యేలు చెప్పినట్లే సీఐల బదిలీలు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత

వారు చెప్పిన వారికే పోస్టింగులు

జిల్లాలో ఆరుగురు సీఐల నియామకం

అధికార పార్టీ పాత నేతలకు మొండిచేయి


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మంగళవారం జరిగిన సీఐల బదిలీల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిచ్చిన అధిష్టానం టీడీపీ పాత నేతలకు మొండిచేయి చూపించింది. పాత టీడీపీ నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరికి ప్రాధాన్యతనిస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పినట్లే సీఐలను బదిలీ చేసి వారికే ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు లోకేష్ గట్టిగా సంకేతాలు పంపినట్లయింది. దీంతో 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసిన తమ్ముళ్లకు భంగపాటు తప్పలేదు. వారి భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది వేచి చూడాల్సిందే.. 


 జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ డీఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జరిగిన బదిలీలు పరిశీలిస్తే... కొత్తగా పార్టీలో చేరిన ఫిరాయింపు  ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి సీఐగా ఉన్న బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో గొట్టిపాటి ప్రతిపాదించిన హైమారావును నియమించారు. పార్టీ మారకముందు నుంచి గొట్టిపాటికి  సీఐ ప్రసాద్ అంటే పడదు. వారి మధ్య విభేదాలున్నాయి. తాజాగా అధికార పార్టీలో చేరిన గొట్టిపాటి ఎట్టకేలకు సీఐను బదిలీ చేయించి పంతం నెగ్గించుకున్నారు. బేతపూడి ప్రసాద్ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. అతనిని బదిలీ చేసి పార్టీ అధిష్టానం కరణంకు మొండిచేయి చూపించింది.


  గిద్దలూరు సీఐగా ఉన్న ఫిరోజ్ పట్ల ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి వ్యతిరేకత ఉంది. అశోక్‌రెడ్డి అధికార పార్టీలో చేరటంతోనే ఫిరోజ్ బదిలీకి పట్టుపట్టినట్లు సమాచారం. అయితే మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అడ్డుపడటంతో ఫిరోజ్ బదిలీ తాత్కాలికంగా ఆగింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రితో పాటు చినబాబు లోకేష్ సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఫిరోజ్ బదిలీ కోసం అశోక్‌రెడ్డి మరోమారు పట్టుపట్టారు. దీంతో ఎమ్మెల్యే చెప్పినట్లే ఫిరోజ్‌ను బదిలీ చేసి ఆయన ప్రతిపాదించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీరాంను గిద్దలూరు సీఐగా నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు భంగపాటు తప్పలేదు.


  కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆదేశాల మేరకు కందుకూరు సీఐగా ఉన్న లక్ష్మణ్‌ను వీఆర్‌కు బదిలీ చేసిన అధికారులు ఆయన స్థానంలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన వీఆర్‌లో ఉన్న నరసింహారావును కందుకూరు సీఐగా నియమించారు. పార్టీలో చేరకముందు నుంచి పోతుల రామారావుకు లక్ష్మణ్ అంటే గిట్టదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చేరడంతో ఎట్టకేలకు లక్ష్మణ్‌ను బదిలీ చేయించి ఎమ్మెల్యే ప్రతీకారం తీర్చుకున్నారు. దీంతో పాత కాపు దివి శివరాంకు అధిష్టానం మొండిచేయి చూపించినట్లయింది.


  చీరాల నియోజకవర్గానికి సంబంధించి చీరాల సీఐ సత్యనారాయణను ఏసీబీకి బదిలీ చేసి వీఆర్‌లో ఉన్న కె.వెంకటేశ్వరరావును చీరాల సీఐగా నియమించారు. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరిక మేరకే నిమ్మగడ్డ సత్యనారాయణను బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో పాత టీడీపీ వర్గం పోతుల సునీతతో పాటు ఎంపీ శ్రీరాం మాల్యాద్రి వర్గాలకు అధిష్టానం మొండిచేయి చూపింది.


  ఒంగోలు రూరల్ సీఐగా ఉన్న సంజీవ్‌కుమార్‌ను ఏసీబీకి బదిలీ చేసి డీజీపీ పీఆర్‌ఓగా ఉన్న మురళీకృష్ణను ఒంగోలు రూరల్ సీఐగా నియమించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆదేశాల మేరకు సీఐ నియామకం జరిగినట్లు సమాచారం.


 మొత్తం మీద సీఐల బదిలీల్లో పార్టీ అధిష్టానం ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చి పాత పచ్చచొక్కా నేతలకు మొండిచేయి చూపించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకతో ఇప్పటికే గిద్దలూరు, అద్దంకి, కందుకూరు ప్రాంతాల్లో టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదరక గొడవలు అధిష్టానం వద్దకు చేరాయి. అటు ముఖ్యమంత్రి, ఇటు చినబాబు లోకేష్‌లు ఎవరికి ప్రాధాన్యతనిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు సీఐల బదిలీల వ్యవహారంలో పాత నేతలను పక్కనపెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకే అధిష్టానం ప్రాధాన్యతనిచ్చింది. ఈ పరిస్థితుల్లో పాత నేతల పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. భంగపాటుకు గురైన పాత నేతలు అధికారం కోసం తలొగ్గి ఎమ్మెల్యేల చెప్పుచేతల్లో పని చేస్తారా... లేక అధిష్టానంతో ఆమీతుమీకి తేల్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top