అవమాన భారంతో వృద్ధుని మృతి

అవమానభారంతోనే చనిపోయాడని వివరిస్తున్న భార్య, కూతురు

పొందూరు : చేతబడి చేశారనే నిందారోపణలు ఓ వృద్ధుని ప్రాణాలు తీశాయి. మూఢ నమ్మకాలకు కరగాన రాజారావు(60) బలయ్యాడు. పలుమార్లు తమకు కలలో కనిపిస్తున్నావంటూ పలువురు సోమవారం రాత్రి రాజారావు ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో అవమానం భరించలేని ఆయన మనస్తాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ చింతాడ ప్రసాద్‌ చెప్పిన వివరాలు...

 

కనిమెట్ట గ్రామానికి చెందిన కరగాన రాజారావు  చేతబడి చేస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన బొంతు చిన్నారావు, చల్ల గోవింద, ముద్దాడ చిరంజీవి సోమవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాజారావు ఆ రాత్రే చనిపోయేందుకు ఇంటి నుంచి వెళ్లిపోగా కుమారుడు నర్సింహులు వెతికి ఇంటికి తీసుకువచ్చాడు. రాజారావు ఉదయాన్నే లేచి బయటకు వచ్చినపుడు బొంతు చిన్నారావు గొడవ పెట్టుకొని కిందకు తోసేయ్యడంతో మనస్తాపానికి గురైన ఆయన వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి యత్నించాడు. అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్‌ఐ చెప్పారు. దీనికి సంబంధించి చిన్నారావు, గోవింద్, చిరంజీవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంఘటనా స్థలానికి ఇన్‌చార్జి డీఎస్పీ ఆదినారాయణ వెళ్లి విచారించారు. రాజారావుకు భార్య ఎర్రమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.  రాజారావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top