సదాశివపేటలో కూలిన పురాతన భవనం

గడిమైసమ్మ మందిరం సమీపంలో కూలిన పురాతన భవనం


సురక్షితంగా బయటపడిన కుటుంబ సభ్యులు

తప్పిన ప్రమాదం.. పరిశీలించిన ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి


సదాశివపేట: ఎడ తెరిపిలేకుండా కురిసిన వర్షాలకు బాగా తడిసిపోయిన అతి పురాతన భవనం అకస్మాత్తుగా కూలిపోయిన సంఘటన గురువారం పట్టణంలోని గడిమైసమ్మ మందిరం సమీపంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం భవనంలో ఉంటున్న అల్లాదుర్గం సురేశ్, భార్య విశాల, నానమ్మ నాగమణి, ఏడాది వయస్సున్న కుమారుడు ప్రద్వీక్‌లు ప్రమాదం నుంచి బయటపడ్డారు.


ఇటీవల కురిసిన వర్షాలకు భవనం పూర్తిగా తడిసిపోయింది. దీంతో  గురువారం అకస్మాత్తుగా   పగుళ్లు రావడం గమనించిన సురేశ్‌ వెంటనే తేరుకుని భవనంలో ఉన్న నానమ్మ, నాగమణి,  భార్య  విశాల, కుమారుడు ప్రద్వీక్‌లను చాకచక్యంగా తప్పించారు. భవనం ముఖద్వారం పూర్తిగా కూలిపోయింది.


దీంతో సురేశ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఇస్వాక్‌ ఆబ్‌ఖాన్‌కు, తహసీల్దార్‌ గిరికి భవనం కూలిన విషయమై ఫోన్‌లో సమాచారం చేరవేశాడు. కమిషనర్‌ హైదరాబాద్‌లో సమావేశంలో ఉండడంతో మున్సిపల్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మధు, టీపీఓ శ్రీనివాస్, అదనపు టీపీఓ ఝాన్సీలను సంఘటన స్థలానికి పంపించారు.


కూలిపోయిన పురాతన భవనంలోని వారిని నిచ్చెన సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ గిరితో కలిసి  పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తగిన  ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు.


పురాతన భవనాల్లో ప్రజలెవరూ నివసించవద్దని ప్రజలకు పిలపునిచ్చారు. అనంతరం కమిషనర్‌  ఇస్వాక్‌ఆబ్‌ఖాన్‌ ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించడంతో జేసీబీ సహాయంతో కూల్చివేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top