నవనిర్మాణ దీక్ష.. జనానికి శిక్ష!

నవనిర్మాణ దీక్ష.. జనానికి శిక్ష! - Sakshi


∙ దీక్షల పుణ్యమాని కార్యాలయ ముఖం చూడని అధికారులు

∙ పనులకోసం వచ్చిన జనాలకు తప్పని కష్టాలు

∙ మహాసంకల్పానికి బలవంతంగా జనం తరలింపు

∙ శిక్షణను వదిలిన ఉపాధ్యాయులు




విజయనగరం కంటోన్మెంట్‌: జిల్లా వ్యా ప్తంగా వారం రోజులుగా జరుగుతున్న నవ నిర్మాణ దీక్షలవల్ల ప్రజలతో పాటు అధికారులు కూడా అవస్థలు పడుతున్నారు. ఈ నెల 2 నుంచి జిల్లాలో దీక్షలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై పర్యవేక్షణకు జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ఓ పక్క జిల్లాలోని పలువురు అధికారులు తమకు కేటాయించిన మండలాలు, నియోజకవర్గాలకు వెళ్లిపోతున్నారు. మండల స్థాయిలో అధికారులు కూడా కార్యాలయాల్లో ఉండకుండా నేరుగా ఆయా సభలకు, అందుకు అవసరమయిన ఏర్పాట్లలోనే బిజీగా ఉంటున్నారు.



నచ్చకపోయినా తప్పట్లేదు

వాస్తవానికి అధికారులు కూడా ఈ సభలకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా అధికారుల నుంచి మండల స్థాయి అధికారులు, వీఆర్వో, కార్యదర్శులు కూడా ఇదే విషయాన్ని తమలో తాము గొణుక్కుంటున్నారు. పైగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు రాష్ట్రప్రభుత్వం లక్ష్యాలు విధించి మరీ జనాలను సభలకు, మహా సంకల్ప సభకూ పంపించాలని ఆదేశిస్తున్నది.  జనా న్ని తీసుకువచ్చేందుకు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు తీవ్ర వ్యతి రేకతతో ఉంటే వారిని ఇంకా సభలకు కూడా రమ్మనడం... లేని అభివృద్ధిని చూపిం చడం కత్తిమీద సాములా మారుతోందని అధికారులే ఒప్పుకుంటున్నారు.



శిక్షణకు డుమ్మా!

ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన వృత్యంతర శిక్షణకూ ఈ దీక్ష విఘాతం కలిగించింది. ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ ద్వారా ఉపాధ్యాయులకు నవోదయ పాఠశాల తదితర ప్రాంతాల్లో శిక్షణ ఇస్తున్నారు. విజయనగరంలోని కోట జంక్షన్‌లో గురువారం నిర్వహించిన మహా సంకల్పం కార్యక్రమంలో ఆ ఉపాధ్యాయులను పాల్గొనాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో శిక్షణ తీసుకుంటున్న సుమారు వెయ్యిమంది ఉపాధ్యాయులను వెంటనే రావాలని ఆదేశించడంతో మధ్యాహ్నం పూట విలువయిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీనిపై ఆరా తీయగా పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ సంధ్యారాణి ఆదేశాలను డీఈఓ అరుణ కుమారి ఇక్కడ అమలు చేశారని తెల్సింది.



నెల్లిమర్ల మండలం ఏటీఅగ్రహారానికి చెందిన ఈయన పేరు లెంక శివ. ఈయన పట్టాదారు పాసుపుస్తకాల కోసం కొన్నాళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయానికి తిరుగుతున్నాడు. ఎప్పుడు వెళ్లినా అధికారులు లేరనే సమాధానం వస్తోంది. అత్యవసరంగా తనకు పాస్‌పుస్తకం అవసరం ఉందనీ, దానిని అందించాల్సిన డిప్యూటీ తహసీల్దార్‌ తనకు ఒక్కరోజైనా దొరకలేదని తెలిపాడు. కారణం ఆయన నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో బిజీగా ఉండటమే కారణమంట.



ఇతనొక్కడే కాదు జిల్లాలోని పింఛన్‌ సమస్యలు, ఇళ్ల సమస్య ఉన్నవారు... వన్‌బీల కోసం తిరుగుతున్నవారు ఎంతోమంది నవనిర్మాణ దీక్ష బాధితులే! దీక్షా దక్షులైన అధికారులు నిత్యం సభలకు, నిర్వహణకు వెళ్లిపోతుండటంతో సామాన్యులు పనులు జరగక ఇబ్బంది పడుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top