ఆదరణపై అంకుశం

ఆదరణపై అంకుశం


దీనులకు అండగా నిలవనంటున్న ఎస్సీ కార్పొరేషన్‌

నీరుగారుతోన్న డిస్ట్రిక్ట్‌ ఇనీషియేటివ్‌ పథం

ఆర్థికంగా చితికిపోతున్నా స్పందించనంటున్న అధికారులు




ప్రతి శాఖలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ప్రజలు ఏమైపోతున్నా పట్టించుకొనే తీరిక వారికి దొరకడంలేదని అంతా బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఎస్సీ కార్పొరేషన్‌ ఈ లిస్టులో చేరింది. హెచ్‌ఐవీ బాధితులు, చిన్న పిల్లలు ఉన్న వితంతువులు, వికలాంగులు చిరు వ్యాపారాలు నిర్వహించుకొని తమ కాళ్లపై తాము నిలబడేలా నిర్దేశించిన డిస్ట్రిక్ట్‌ ఇనీషియేటివ్‌ పథకాన్ని పట్టాలెక్కించకుండా చోద్యం చూస్తున్నారు. – ఒంగోలు సెంట్రల్‌



జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో దీనులకు చేయూత దొరకడంలేదు. 2014–15లో డిస్ట్రిక్ట్‌ ఇనీషియేటివ్‌ పథకం కింద ఒక్కరూ లబ్ధిపొందలేదు. 2015–16లో మాత్రం 120 మందికి రుణాలను అందించారు. 2016–17 సంవత్సరం వచ్చే సరికి ఒక్కరికి కూడా రుణం అందించలేదంటే ఆ శాఖ పనితీరు ఎలా ఉందో అవగతమవుతోంది. వాస్తవానికి ఈ పథకం వల్ల హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారు, భర్తకు దూరమై పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళలు, దివ్యాంగులు జీవనోపాధి పొందే అవకాశం ఉంటుంది. కానీ నెలలు గడుస్తున్నా రుణాలు మంజూరు చేయడంలేదు.



మరణిస్తున్నా అంతే..

ఇప్పటి వరకు దాదాపు 500 మంది హెచ్‌ఐవీ బాధితులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దురదృష్ట వశాత్తు వీరిలో ఇప్పటికే 20 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ సాయం అందకుండానే బాధితులు మృతి చెందుతున్నా మిగిలినవారికైనా సాయం అందించడంలో అధికారులు స్పందించకపోవడం విచారకరం.



ఆదేశాలు బేఖాతర్‌

అర్హులు ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని నిబంధన విధించారు. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోకపోయినా రుణాలను జిల్లా నిధుల నుంచే చెల్లించాలి కాబట్టి.. ఉన్నతాధిధికారుల అనుమతితో రుణాలు మంజూరు చేయవచ్చని ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర అధికారులు ఆదేశాలిచ్చినా సిబ్బంది పట్టించుకోవడంలేదు. క్షేత్ర స్థాయి పర్యటనల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ విషయంపై శ్రద్ధ పెట్టి పరిష్కరించాల్సిన ఎస్సీ కార్పొరేషన్‌ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది.



గుట్టు.. రట్టు చేస్తారా?

హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ బాధితులకు ఒంగోలు రిమ్స్, మార్కాపురం ప్రాంతీయ వైద్యశాల, చీరాల ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స కేంద్రాలున్నాయి. దీంతో ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో మందులు తీసుకుంటారు. అయితే ఎస్సీ కార్పొరేషన్‌ సిబ్బంది ఒంగోలు రిమ్స్‌ నుంచి బాధితుల సమాచారం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జాప్యం చోటు చేసుకుంటోంది. పైగా ఎస్సీ కార్పొరేషన్‌ సిబ్బంది అనాలోచిత నిర్ణయాల వలన హెచ్‌ఐవీ రుణ లబ్ధిదారుల జాబితాను మండల అభివృద్ధి అధికారులకు పంపుతున్నారు. దీంతో తమ వ్యాధి గురించి చుట్టుపక్కల వారికి తెలిసిపోతోందంటూ బాధితులు ఆందోళనకు గురి అవుతున్నారు.



చర్యలు తీసుకుంటాం:

ప్రస్తుత సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా డిస్ట్రిక్ట్‌ ఇనీషియేటివ్‌ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 400 మంది ఆన్‌లైన్‌లో.. మరో 100 మంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

– ఎ.జయరామ్, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top