రేటు మారలే..!

రేటు మారలే..!


ఇప్పటికీ రూ. 3 వేలు పలుకుతున్న ట్రాక్టర్‌ ఇసుక రేటు

రూ. 1500 ధర నిర్ణయించిన అధికారులు

పట్టించుకునే వారే కరువైన వైనం

గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదులు




విజయనగరం గంటస్తంభం :  అధికారులు ట్రాక్టర్‌ ఇసుక ధరను గతంలో రూ.1500గా నిర్ణయించారు. గజపతినగరం, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో ఉన్న రీచ్‌ల నుంచి ఎక్కడైనా ఇసుక పొందవచ్చని, అంతే ధర ఉంటుందని మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, అధికారులు ఇప్పటికే పలు సార్లు ప్రకటించారు. కానీ ఆ ధరకు ఇసుక దొరుకుతున్న దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. రేటు ఎంత ఉంది అని పట్టణానికి వచ్చే ట్రాక్టర్ల సిబ్బందిని అడిగితే యూనిట్‌కు రూ.3 వేలు తక్కువ లేదని చెబుతున్నారు. క్వారీల వద్ద కూడా అంతే రేటు ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇంకో విషయం ఎంటంటే ట్రాక్టర్‌ ఇసుక ఒక యూనిట్‌ కూడా కాదు. దీంతో అక్కడ కూడా మోసమే జరుగుతుంది. ఇలా అయితే పేదలు ఇళ్లు కట్టుకోగలరా..? ఇన్నీ అక్రమాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వచ్చి అధికారుల వద్ద గాజుల రేగకు చెందిన గడి వెంకట సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.



దందా ఆగలేదు..

ఇసుక రవాణాలో అక్రమార్కుల దందా ఆగడం లేదు. క్వారీలు ఉన్న చోట ఉండే అధికార పార్టీ నాయకులు, ట్రాక్టరు యజమానులు కుమ్మక్కై అధిక ధరకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి చెప్పినా, అధికారులు ప్రకటించిన ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో వినియోగదారులు అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేసి ఆర్థిక భారం మోస్తున్నారు. ఫలితంగా పేదలకు సొంతింటి కల తీరడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.



రెండింతలే..

ఇసుక అక్రమాలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జిల్లాలో ఎక్కడా ఉచిత ఇసుక అమలు కాలేదు. ట్రాక్టర్‌ ఇసుక కావాలంటే నిర్మాణదారులు రూ.3 నుంచి రూ.5 వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై వారం వరకు అనేక ఫిర్యాదులు గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులకు అందాయి. కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు దృష్టికి కూడా పలువురు సమస్యను తీసుకెళ్లారు.



 అయినా ఇసుక ఉచితంగా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జరిగిన అధికారుల సమీక్షలో ఇసుక రవాణాకు ఒక ధర నిర్ణయించాలని మంత్రులు సూచించారు. ఈ మేరకు అధికారులు ధర నిర్ణయించారు. ట్రాక్టర్‌ ఇసుక తరలించేందుకు విజయనగరానికి రూ.1500, బొబ్బిలికి రూ.1500, పార్వతీపురం రూ.1700, సాలూరుకు రూ.1300 చొప్పున తీసుకోవాలని ప్రకటించారు. ఈ ధరలు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆ ధరకు ట్రాక్టర్‌ ఇసుక ప్రస్తుతం దొరకడం లేదు. విజయనగరానికి ట్రాక్టర్‌ ఇసుక కావాలంటే రూ.3 వేలు చెల్లించాలని అడుగుతున్నారు.



గతంలో రూ.3500, రూ.4 వేలు ఉంటే ఇప్పుడు రూ.3 వేలకు ఇవ్వడం మినహా పెద్దగా ఉపశమనం లేదు. దీంతో గాజులరేగకు చెందిన సత్యనారాయణ ఈ అక్రమాలు ఆపాలని, నిర్ణయించిన ధరకు ఇసుకు అందేట్లుగా చర్యలు తీసుకోవాలని కోరడం పరిస్థితికి అద్దం పడుతుంది. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి పట్టణాలకు కూడా ఇదే విధంగా ట్రాక్టరు ఇసుకకు రూ.3 వేలకుపైగా తీసుకుంటుండడం గమనార్హం.



ఇసుక రీచ్‌ల్లో అక్రమార్కులు దందా..

ఉచితంగా అందాల్సిన ఇసుక ఉచితంగా దొరక్కపోడానికి, కనీసం అధికారులు నిర్ణయించిన ధరకు కూడా రవాణా కాకపోవడానికి ఇసుక రీచ్‌ల్లో అక్రమార్కులు దందా కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌ల్లో స్థానికంగా ఉండే గ్రామస్థులు అమ్ముకుంటున్నారు. ఇందులో అధిక శాతం మంది పచ్చ  తమ్ముళ్లే ఉండగా కొన్ని చోట్ల అక్రమార్కులకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా ఉంటున్నారు.



 విజయనగరానికి ఎక్కువగా ఇసుక వచ్చే గజపతినగరం మండలం లోగిశ రీచ్‌లో అధికార పార్టీ నాయకుడు, ఆయన అనుచరులు ఇసుక ఉచితంగా పట్టుకెళ్లకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని, ట్రాక్టర్‌ యజమానులు రూ.3వేలు ఇస్తే గానీ ఇసుక లోడ్‌ వేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లిమర్ల, గుర్ల మండలాల్లో ఇదే పరిస్థితి. వేగావతి, సువర్ణముఖి తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ల్లో అక్రమార్కులు హవా కొనసాగుతోంది. దీనికి అడ్డకట్ట వేయాలని గృహ, ఇతర నిర్మాణదారులు కోరుతున్నారు. మరి అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top