అధికారులకు పురస్కారం.. కూలీలకుతిర స్కారం

అధికారులకు పురస్కారం.. కూలీలకుతిర స్కారం - Sakshi


సారూ.. కడుపు కొట్టొద్దు

‘ఉపాధి’ కల్పించాలని ఊటుకూరు,

మామిళ్లపల్లె కూలీల విన్నపం

నగరం పరిధిలో ఉన్నందున పని

కల్పించలేమంటున్న యంత్రాంగం

హైకోర్టు ఆదేశించినా ఉపాధి పనులు చూపని వైనం


సాక్షి ప్రతినిధి, కడప: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలందరికీ పని కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న యంత్రాగం.. క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమకు ఉపాధి కల్పించాలని రెండేళ్లుగా మొర పెట్టుకుంటున్న కొంత మంది కూలీల ఆవేదన అరణ్య రోదనగా మారింది. హైకోర్టు సైతం ఉపాధి కల్పించాల్సిందిగా ఆదేశించినా అమలు చేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ‘ఉపాధి’ని అత్యద్భుతంగా అమలు చేస్తున్నారని దేశ రాజధానిలో ఘనకీర్తిని దక్కించుకున్న అధికారులు ఆదర్శంగా నిలవాల్సిందిపోయి అలసత్వంతో వ్యవహరిస్తున్నారు.


వివరాల్లోకి వెళితే.. కడప కార్పొరేషన్‌లో ఊటుకూరు, మామిళ్లపల్లె గ్రామాలు 2009లో విలీనం అయ్యాయి. ఆయా గ్రామాల పరిధిలో 1250 మంది జాబ్ కార్డులు కల్గిన వారు ఉన్నారు. వీరికి 2014 వరకూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలి పనులు కల్పించారు. తర్వాత నిబంధనలు మారాయంటూ పనులు కల్పించకపోవడంతో విలీన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే విషయమై అనేక పర్యాయాలు కూలీలు స్వయంగా అభ్యర్థించారు. ఆపై హైకోర్టును సైతం ఆశ్రయించారు.


హైకోర్టు జస్టిస్ డి శేషాద్రినాయుడు (డబ్ల్యుపి నెంబర్ 67050/2014 ద్వారా) ఉపాధి కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ జిల్లా అధికారులను నిర్లక్ష్యం వీడలేదు. మామిళ్లపల్లె, ఊటుకూరు, పెద్దముసల్‌రెడ్డిపల్లె, వెంకటగారిపల్లె రామరాజుపల్లె, పాలంపల్లె, చిన్నమాచుపల్లె, రూకవారిపల్లె తదితర పల్లెలు కార్పొరేషన్‌లో విలీనం అయ్యాయి. అయితే ఇంటి పన్ను, వాటర్ ట్యాక్స్, వైద్యం, విద్య ఇలా అన్ని శాఖలు రూరల్ పరిధిలోనే ఉన్నాయి. జాతీయ ఉపాధి హామి పథకం కేవలం రూరల్ ప్రజలకే వర్తింపజేయాలని తాజా నిబంధనలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించగా ‘ఉపాధి’ కల్పించాలని ఆదేశించింది. 


 పనులు  దొరకడం లేదు....

ఊటుకూరు గ్రామ పంచాయతీని కడప నగర పాలక సంస్థలో విలీనం చేసిన తర్వాత కూలి పనులు దొరక్క అవస్థలు పడుతున్నాం.    - సిరిశెట్టి గంగాదేవి, వెంకటగారిపల్లె


కట్టెలు కొట్టేందుకు వెళ్తున్నాము..

పనులు దొరక్క కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నాము. కడపలో విలీనం చేసినప్పటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. - మేకల క్రిష్ణయ్య, వెంక టగారిపల్లె, ఊటుకూరు.


 నిబంధనల మేరకే...

నిబంధనల మేరకే వారికి అవకాశం కల్పించలేకపోయాం. హైకోర్టు ఉత్తర్వులు పరిశీలించాల్సి ఉంది.

             - డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం, కడప

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top