అంతా ఆర్భాటం!

అంతా ఆర్భాటం! - Sakshi


► ఇన్‌పుట్‌ సబ్సిడీ బాండ్ల పంపిణీ పేరుతో గ్రామాల్లోకి అధికారులు

► ప్రచార హంగామాతోనే ముందుకు సాగుతున్న వైనం

► బాండ్లు ఇస్తున్నా.. చాలా చోట్ల జమ కాని నగదు

► ప్రభుత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా కనిపించని బీమా




సాక్షి, కడప : టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ ప్రచార ఆర్భాటంతోనే ముందుకు వెళుతోంది. ఆవగింజంత చేయకపోయినా కొండం త ప్రచారం వచ్చేలా ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా తమ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అధికారులను ఉపయోగించుకొని ప్రచారానికి తెర లేపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు వాతావరణ బీమాను కూడా విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఇతర నేతలు ప్రకటించినా ఇప్పటి వరకు జాడలేదు.



జిల్లాలో వేరుశనగ, పత్తి పంటకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ బాండ్లను రైతులకు అప్పగించడంలో అధికారులు అట్టహాసంగా చేస్తున్నా.. వెంటనే ఖాతాలలో నగదు పడటం లేదు. ఒక్క మండలంలో మొత్తాలు పడితే.. మరో మండలంలో ఇంకా పడలేదు. ఇక వాతావరణ బీమా పరిస్థితి అయితే ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి.



ఎప్పుడో..

2016 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొని జిల్లాలో మొత్తం పంటలు ఎండిపోయాయి. వేరుశనగ, పత్తితోపాటు ఇతర పంటలను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అప్పట్లోనే ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి, పరిహారం అందించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.



ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద జిల్లాకు సుమారు రూ.70 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవ నిర్మాణ దీక్షలను వేదికగా చేసుకున్న ప్రభుత్వం వెంటనే ఖాతాల్లో వేస్తున్నట్లు చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఒకట్రెండు మండలాలు మినహా మరెక్కడా పడనట్లు తెలుస్తోంది. 2016 ఖరీఫ్‌ వాతావరణ బీమా అయితే ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. అంతేకాకుండా మండలానికి ఎంత మంజూరైంది, ఏ రైతులకు వర్తించిందన్నది కూడా స్పష్టత లేని పరిస్థితి. బ్యాంకర్లకు కూడా ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. మరి ఎప్పుడు వాతావరణ బీమా రైతుల ఖాతాల్లో పడుతుందో సర్కారు తేల్చి చెప్పాలి. ఎప్పుడు పడుతుందోనని ప్రీమియం కట్టిన రైతులు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు.



అంతా ప్రచారమే

జిల్లాలో వాతావరణ బీమాతోపాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేశామని చెబుతూ అన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఇన్‌పుట్‌ సబ్సిడీ బాండ్లను పంపిణీ చేస్తున్నారు. అయితే బాండ్లు పంపిణీ చేస్తుండగా.. రైతులు ఎప్పుడు పడుతుందని ప్రశ్నిస్తే ఈ రోజో.. రేపో అంటున్నారు. కానీ ఎప్పుడు పడుతుందన్నది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. ఏదిఏమైనా మంజూరైన సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేసి తర్వాత బాండ్లను అందజేసి గొప్పలు చెప్పుకున్నా బాగుంటుంది. కానీ, అలా కాకుండా అకౌంట్లలో సొమ్ము వేయకుండా కేవలం బాండ్లను అందజేసి ప్రచార ఆర్భాటం చేసుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.



బీమా కోసం ఎదురుచూపులు

వాతావరణ బీమా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం కావడంతోపాటు పంట విత్తనాలు, సేద్యాలకు పెట్టుబడి అవసరం. ఈ నేపథ్యంలో ప్రీమియం చెల్లించిన రైతులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 2016 ఖరీఫ్‌లో వేరుశనగ పంటకు భారీ ఎత్తున రైతులు ప్రీమియం చెల్లించారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రైతులు బీమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top