గుట్టకు పట్టా !

గుట్టకు పట్టా !

  • రేకుర్తిగుట్టపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణంపై హైకోర్టు స్టే

  • భూస్వామి వైఖరిపై గ్రామస్తుల ఆగ్రహం

  • ఆలయ నిర్మాణానికి సహకరించకుంటే భూపోరాటం

  • కరీంనగర్‌ రూరల్‌ : కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా మారింది వ్యవహారం. రెవెన్యూ అధికారుల అండదండలతో ఓ భూస్వామి ఏకంగా గుట్టను పట్టా చేసుకున్నాడు. గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయానికి చేపట్టిన ఘాట్‌రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తీసుకొచ్చిన సదరు భూస్వామిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించకుంటే భూస్వామి ఆధీనంలోని 4,500 ఎకరాల సీలింగ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆందోళనలు చేపడతామని మాజీ సర్పంచ్‌ నందెల్లి ప్రకాశ్‌తోపాటు గ్రామస్తులు హెచ్చరించారు.

    కరీంనగర్‌ మండలం రేకుర్తిలోని సర్వేనంబరు 194లో 88.21 ఎకరాల విస్తీర్ణంలో గుట్ట ఉంది. ఈ గుట్టపై పురాతనమైన స్వయంభూ శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసిన ఆనవాళ్లు లభించాయి. గుట్ట చుట్టూ ఎడ్లబండ్లతో రైతులు ప్రదక్షిణలు చేసి జాతర నిర్వహించారు. అయితే గుట్టపైకి సరైన దారిలేకపోవడంతో క్రమేపీ ఆలయం శిథిలావస్థకు చేరింది. ఏడాదికోసారి గుట్టపై యజ్ఞం నిర్వహించి పూజలు చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో గుట్టపైకి మెట్లు నిర్మించాలని, ఆలయాన్ని అభివద్ధి చేయాలని సర్పంచ్‌ నందెల్లి పద్మ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు విన్నవించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల క్రితం శ్రీలక్ష్మినర్సింహస్వామి ఉపాసకురాలు హరిప్రియతో కలిసి గుట్టను పరిశీలించిన ఎమ్మెల్యే కమలాకర్‌ ఘాట్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆలయ సమీపంలోకి రోడ్డు నిర్మాణం పూర్తయింది.

     

    హైకోర్టు స్టే తొలగించాలని డిమాండ్‌

    సర్వేనంబరు 194 పట్టా భూమిలో చేపట్టిన రోడ్డు నిర్మాణం, సర్వేనంబరు 18లో కమ్యూనిటీహాల్‌ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టు నుంచి పట్టాదారులు షేఖాన్, షేక్‌ అబుబాకర్‌ స్టే ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై మాజీ సర్పంచ్‌ నందెల్లి ప్రకాశ్‌ బుధవారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 1953లో ప్రభుత్వం సీలింగ్‌లో స్వాధీనం చేసుకున్న సర్వేనంబరు 194 గుట్టను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తిరిగి పహణీలో నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. గుట్టపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణంతో ఆలయం అభివద్ధి చెందుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి షేఖాన్, షేక్‌ అబుబాకర్‌ సహకరించి కోర్టు స్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామస్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటే బీఆర్‌ మీనా నివేదిక ప్రకారం షేఖాన్‌ ఆక్రమించుకున్న 4,500 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రజలతో కలిసి భూపోరాటం చేస్తామన్నారు. సర్పంచ్‌ జంగిలి సాగర్, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, బొమ్మకల్‌ ఉపసర్పంచ్‌ చింతల శ్రీనివాస్, వార్డుసభ్యుడు నరేశ్, శేఖర్‌రావు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top