మహాకవీ మన్నించు!

మహాకవీ మన్నించు!


గురజాడ స్మారక గృహం ఏర్పాటుకు అడ్డంకులు

వారసులను ఆదుకోని ప్రభుత్వం


 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు నడయాడిన నేలపైనే ఆయనకు అవమానం జరుగుతోంది. గురజాడ స్మారక గృహం ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గురజాడ స్మృతులను సంరక్షించే క్యూరేటర్‌గా పనిచేస్తున్న ఆయన మునిమనుమడుకి ఆరు నెలలుగా వేతనం కూడా ఇవ్వడం లేదు.  దీనిపై సాహితీ వేత్తలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.



బోర్డు ఏర్పాటుతో సరి...

విజయనగరంలో గురజాడ స్వగృహాన్ని జాతీయ వారసత్వ సంపదగా గత ఏడాది గుర్తించారు. ఈ సందర్భంగా పురావస్తు శాఖ ఈప్రాంతాన్ని ఎవరూ ఆక్రమించరాదంటూ అక్కడో  బోర్డు ఏర్పాటు చేసింది. అక్కడితో తమ పని అయిపోయిందనుకున్నారో ఏమో గురజాడ స్వగృహాన్ని స్మారక గృహంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.



స్థలకేటాయింపునకు మోకాలడ్డిన కౌన్సిల్...

గురజాడ ఇంటికి పడమరవైపున ఉన్న ప్రాంతంలోగల స్థలాన్ని సేకరించి ఆయన స్మారక  భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థలాన్ని కోల్పోతున్న గురజాడ వారసులు, మరికొంతమందికి  మరో చోట  స్థలాన్ని గుర్తించాల్సిందిగా జిల్లా యంత్రాంగం విజయనగరం తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆమేరకు సంతపేటలో  మున్సిపల్ క్వార్టర్స్ స్థలాన్ని గుర్తించి నివేదిక పంపారు.



అయితే ఆ స్థలం మున్సిపాలిటీది కావటంతో కౌన్సిల్ తీర్మానించి పంపించాలంటూ ప్రభుత్వం తిరిగి పంపించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు ఈ నెల 9న జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ అంశాన్ని పెట్టగా  తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ పాలకవర్గం అనుమతులివ్వకుండా ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. అలాగే గురజాడ వారసుడయిన వెంకటేశ్వర ప్రసాద్‌కు గురజాడ స్వగృహంలో క్యూరేటర్‌గా పురావస్తు శాఖ ఉద్యోగమిచ్చింది. కానీ ఆరు నెలలుగా వేతనం ఇవ్వడం లేదు.  



ఈ నెల 30న నిరసన

మహాకవికి విజయనగరంలో జరుగుతున్న అవమానాన్ని ఎండగట్టేందుకు గురజాడ ఇంటివద్ద ఈ నెల 30న నిరసన చేపట్టనున్నట్టు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. ప్రభుత్వం మహాకవి పట్ల అనుసరిస్తున్న తీరు దారుణమన్నారు.

 

మూడు నెలల తరువాత తీర్మానం

గురజాడ ఇంటిని స్మారక భవనంగా నిర్మించటంలో నష్టపోతున్న గురజాడ వారసులతో పాటు మిగిలిన వారికి సంతపేటలోని మున్సిపల్ క్వార్టర్స్ కేటాయిస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల రామకృష్ణ  మంగళవారం విలేకరులకు తెలిపారు.  ఒకసారి తిరస్కరించినపుడు మూడు నెలల తరువాతే కౌన్సిల్‌లో తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 9న ఈ మేరకు తీర్మానం చేస్తామని పేర్కొన్నారు. గతంలో సమాచార లోపం వల్లనే స్థలం కేటాయించలేకపోయామని, అంతేగానీ గురజాడ అంటే తమకు గౌరవం లేక కాదని వివరణ ఇచ్చారు.                 

 - ప్రసాదుల రామకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్

 

వేతనం ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు

గురజాడ వారసులకు ఉద్యోగమిచ్చామని చెప్పుకోవడానికే గానీ మాకెప్పుడూ దాని ప్రయోజనం కనిపించలేదు. ఆరునెలలుగా వచ్చే ఆ ఔట్‌సోర్సింగ్ వేతనంతోనే బతుకీడుస్తున్నాం. వేతనం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. స్మారక గృహ నిర్మాణానికి అనుమతులు త్వరగా ఇవ్వాలి.   

-  గురజాడ ఇందిర, గురజాడ అప్పారావు మనుమరాలు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top