అభ్యంతరాలు లక్షల్లో పంపాలి

అభ్యంతరాలు లక్షల్లో పంపాలి

  • జనగామ జేఏసీ చైర్మన్‌ దశమంతరెడ్డి

  • జనగామ : యాదాద్రి జిల్లా వద్దు.. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో అభ్యంతరాలు పంపాలని జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్, పూలే అధ్యయన కేంద్రంలో శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరిస్తుండటంతో ప్రతి ఒక్కరూ పంపాలని కోరారు. ఈ విషయంపై మండలాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా బాధ్యులను నియమించినట్లు చెప్పారు. ఇంటర్నెట్‌ కేంద్రాల ద్వారా ఉచితంగా విజ్ఞప్తులు పంపేందుకు జేఏ సీ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జనగామను జిల్లా చేయాలని లక్షలాది మంది ఉద్యమిస్తుంటే, హన్మకొండను జిల్లా చేయడం ప్రభుత్వ వివక్షకు నిదర్శనమన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును విరమించుకోవాలని అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడి జనగామకు సంపూర్ణ మద్దతు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. జనగామ జిల్లా ఉద్యమానికి మరింత ఊతమిచ్చేందుకు సీపీఎం ప్రత్యక్ష ఉద్యమంలోకి కలిసి రావడం శుభ పరిణామమన్నారు. లింగాలఘనపురానికి చెందిన సర్పంచ్, ఎంపీపీ ఏకగ్రీవ తీర్మాణాలతో ఎంపీపీ భర్త రాజు, చిట్ల ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు బయల్దేరే క్రమంలో జేఏసీ నేతలు కలిశారు. అభ్యతంరా ల స్వీకరణపై ఆయా గ్రామాల ఇంచార్జిలు మేడ శ్రీను (రఘునాథపల్లి), బాలలక్ష్మి (మద్దూరు), ధర్మపురి శ్రీను, ఆలేటి సిద్దిరాములు (బచ్చన్నపేట), రెడ్డి రత్నాకర్‌రెడ్డి (నర్మెట), జనగామ అర్బన్‌ (ఆకుల వేణుగోపాల్‌రావు, పిటట్ల సత్యం,జక్కుల వేణుమాధవ్, బూడిద గోపి), కళాశాలలు, విద్యాసంస్థలకు ఎండీ.మాజీద్, పిట్టల సురేష్, నరేందర్, కిరణ్‌ను నియమి స్తూ, సమన్వయకర్తగా మంగళ్లపల్లి రాజుకు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు జనగామ జిల్లా కోసం బచ్చన్నపేటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొన్నె బాల్‌రాజుకు నివాళులర్పించారు. ఆమరణ దీక్ష చేసిన 12 మంది జేఏసీ నాయకులకు అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌.రాజిరెడ్డి, డాక్టర్‌ రాజమౌళి, లక్ష్మినారాయణనాయక్, పెద్దోజు జగదీష్, మాశెట్టి వెంకన్న, మోర్తాల ప్రభాకర్, బర్ల శ్రీరాములు, సత్యపాల్‌రెడ్డి, క్రిష్ణ ఉన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top