లెక్క తేలేనా..?లెక్క తేలేనా..?

లెక్క తేలేనా..?లెక్క తేలేనా..? - Sakshi


తగ్గని బడిబయటి పిల్లల సంఖ్య

ఏపీజీఈఆర్‌ యాప్‌ ద్వారా పిల్లల నమోదు

గణాంకాల్లో కుదరని పొంతన

సర్వే పక్కాగా చేస్తున్నామంటున్న అధికారులు




పర్చూరు : జిల్లాలో 2550 ప్రాథమిక, 378 ప్రాథమికోన్నత, 394 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,322 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో బడిబయట ఉన్న పిల్లలు 73,222 మంది వరకు ఉన్నారని ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన ప్రజాసాధిక సర్వేప్రకారం అంచనా వేసింది. ఈ సంఖ్యను తేల్చేందుకు పూర్తిస్థాయిలో విద్యార్థి గణన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో నమోదు చేసిన వివరాలతో కూడిన ఏపీజీఈఆర్‌ (ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) యాప్‌ ద్వారా ఎన్యూమరేటర్లు విద్యార్థి గణన చేపడుతున్నారు. ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఒక్కో విద్యార్థిని గుర్తించి పాఠశాలకు కేటాయించిన కోడ్‌ ద్వారా విద్యార్థి చదివే పాఠశాల, తరగతిని నమోదు చేస్తున్నారు. దీని ద్వారా అనుమానం ఉన్న చోట నేరుగా పాఠశాలకు వెళ్లి విద్యార్థి వివరాలు తెలుసుకోవచ్చు.



గుర్తించింది సగమే..

జిల్లాలోని 290 క్లస్టర్లలో 272 మంది సీఆర్పీలు, 18 మంది ఐఈఆర్టీల ద్వారా విద్యార్థి గణన సర్వేను గత 40 రోజులుగా చేపడుతున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు 36,170 మందిని మాత్రమే గుర్తించారు. ఇక మైగ్రేషన్‌ కింద 15,130 మంది, అండర్‌ ఏజ్‌ గా 3,212 మంది, ఓవర్‌ ఏజ్‌గా 12,034 మంది, వివాహితులుగా 1081 మంది, మృతిచెందినట్టుగా 412 మంది, ఇతర పాఠశాలల్లో చదువుతున్న వారిగా 2,178 మంది, గ్రామాల్లో ఉండి పాఠశాలలకు వెళ్లనివారు 2,692 మంది జిల్లాలో ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ సర్వే గడువు పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.



కొనసాగు...తోంది.

తరచూ సర్వర్‌లో సమస్యలు తలెత్తడం వల్ల ఈ సర్వే నత్తనడకన సాగుతోంది. దీనికి తోడు అధికారులు ఇచ్చిన సమాచారం తప్పుల తడకగా ఉండడంతో ఎన్యూమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. బడి బయట పిల్లలను గుర్తించేందుకు నానా తంటాలు పడుతున్నారు. తొలుత ఆగస్టు 5వ తేదీ వరకు, తర్వాత ఆగస్టు 15 వరకు, తాజాగా ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పడు మరోమారు గడువు పెంచే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top