మీవేం రాజకీయాలు బాబూ?

మీవేం రాజకీయాలు బాబూ? - Sakshi


కుల రాజకీయాల వ్యాఖ్యలపై మండిపడ్డ ముద్రగడ

హామీలు అమలు చేయమంటే కోపమెందుకు?


 

 సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికల సమయంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించే అడుగుతున్నాం. మేం ఉద్యమిస్తే కుల రాజకీయాలు అని విమర్శిస్తారా? మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమంటే మాపై నిందలేస్తారా?’’ అంటూ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం  చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజైన శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతమైన రాష్ట్రంలో కుల రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించబోమంటూ  చంద్రబాబు విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు.



‘మావి కుల రాజకీయాలైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవి ఏమిటో చెప్పాలి’ అని చంద్రబాబును నిలదీశారు.  ‘మీరు దీక్షలు చేయలేదా? ఆందోళనలు నిర్వహించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో అడుగడుగునా అడ్డు తగలలేదా?’ అని ముద్రగడ దుయ్యబట్టారు. ఎన్నికలలో ప్రజల తీర్పును అనుసరించి తాను ఇంటికే పరిమితమయ్యానని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ చేతిలో రెండుసార్లు ఓడిపోయినా ఇంట్లో కూర్చోక పాదయాత్ర ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ఆ పాదయాత్ర రాజకీయం కోసం కాదా? అని ప్రశ్నించారు. ఆయన హామీల గురించి ప్రశ్నిస్తే ఎందుకు కోపం వస్తోందో చెప్పాలన్నారు.



 డబ్బులు లేవనడం సరికాదు

 ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న వాదన సరికాదని ముద్రగడ అన్నారు. హామీలు ఇవ్వని వాటికి రూ.కోట్లలో ఖర్చు చేసిన ప్రభుత్వం, హామీ ఇచ్చిన వాటికి ఖర్చు చేసే ందుకు డబ్బులు లేవనడం సరికాదన్నారు.  



 ఇంటి ముందు బలగాలెందుకు?

 తన ఇంటి ముందు పోలీసులు భారీ సంఖ్య లో బలగాలను ఎందుకు మోహరిస్తున్నారో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కిర్లంపూడి ఏమన్నా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న గ్రామమా? లేక ఇక్కడున్నవారు ఉగ్రవాదులా? అని ఆయన ప్రశ్నించారు. బలగాలను తొలగించి తనను కలవడానికి వచ్చే అభిమానులను అనుమతించాలని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top