ఇక ప్లాస్టిక్‌ రోడ్లు

ఇక ప్లాస్టిక్‌ రోడ్లు - Sakshi

– ప్రయోగాత్మకంగా జాతీయ రహదారి 44 నుంచి మల్లేపల్లి వరకు

– త్వరలో ఎమ్మిగనూరు – వెంకటగిరి, కడిమెట్ల – సిరాళ్లదొడ్డి రోడ్లు

 

కర్నూలు(అర్బన్‌): ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్డు వేసే ప్రక్రియకు జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. సాధారణంగా కంకర, తారు మిశ్రమంతో వేసే రోడ్ల కంటే.. కంకర, తారు మిశ్రమంలోకి వ్యర్థ ప్లాస్టిక్‌ను మిక్స్‌ చేసి రోడ్లకు వాడితే నాణ్యత కూడా అధికంగా ఉంటుందని శాస్త్రీయంగా తేలడంతో జిల్లాలో ప్లాస్టిక్‌ రోడ్డు వేసేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో అర కిలోమీటర్‌ వరకు ప్లాస్టిక్‌ మిశ్రమంతో రోడ్డును వేశారు. మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో తొలిసారి ట్రయల్‌ చేసినా, కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటి సారిగా ఈ రోడ్లను వేస్తున్నారు.

 

వెల్దుర్తి మండలం 44వ నెంబర్‌ జాతీయ రహదారి నుంచి మల్లెపల్లి వరకు 2 కిలోమీటర్ల రోడ్డును రూ.1.25 కోట్లతో ఈ నెల 26, 27 తేదీల్లో వేశారు. ఈ మిశ్రమంతో వేస్తున్న రోడ్డును సోమవారం పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్బరాయుడు, కర్నూలు ఈఈ వెంకటరమణారెడ్డి పర్యవేక్షించారు. ఆలూరు సమీపంలోని హాట్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ నుంచి తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా నుంచి కిలో రూ.45 ప్రకారం 2 టన్నులను దిగుమతి చేసుకున్న వ్యర్థ ప్లాస్టిక్‌ మిశ్రమాన్ని కలిపి రోడ్లు వేసే ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు.

 

త్వరలో మరో రెండు రోడ్లు

ఎమ్మిగనూరు-ఆదోని మెయిన్‌ రోడ్డు నుంచి వెంకటగిరి వరకు రూ.72 లక్షలతో 1.4 కిలోమీటరు, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల నుంచి సిరాళ్లదొడ్డి వరకు రూ.1.10 కోట్లతో 3.5 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్‌ రోడ్డు వేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించినట్లు కర్నూలు డివిజన్‌ పీఐయూ ఈఈ వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారి ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు వేస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలసిపోయేందుకు దాదాపు 200 సంవత్సరాలు పడుతుందన్నారు. భూమి మీద ఉన్న వ్యర్థ ప్లాస్టిక్‌ను రోడ్లకు ఉపయోగిస్తే వేస్ట్‌ ప్లాస్టిక్‌ తగ్గిపోతుందన్నారు. డిజైన్‌ ప్రకారం సాధారణంగా తారు, కంకర మిశ్రమంతో వేసిన రోడ్లు 5 సంవత్సరాలు మన్నికగా ఉంటే.. ప్లాస్టిక్‌ మిశ్రమంతో వేసిన రోడ్డు దాదాపు 8 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయన్నారు. డీఈఈ కేఈ సుధాకర్‌గౌడ్, ఏఈ కేవీ రమణ రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top